Tuesday, November 13, 2018

భేషజాలు

నేటి కవిత అంశం : భేషజాలు
13-11-2018
శీర్షిక : ఆడంబరము
సంఖ్య : 95

నాకు రాదంటే నవ్వి పోదురేమోనని
అన్నీ తెలుసనే అందమైన అబద్దాన్ని
అచ్చంగా గుది గుచ్చి అచ్చు గుద్దినట్టు
అలవోకగా విప్పి చెప్పుదురు విడమరిచి ...... కొందరు

కాదు లేదంటే నామోషి కామోసని
ఆరుగాలపు కష్టాన్ని అలుసు చేసి
వైపైని మెరుగులకు ఫలహారం గావిస్తూ
అప్పు జేసి పప్పు కూడందురు ..... ఇంకొందరు

కాయ కష్టాల  కమిలిన చేతులకు
కాసుల విలువల కొలుపులు తెలిసేది .
కాసింత  మనుసు బెట్టి ఆలోచిస్తే
కలకాలం సుఖదారుల గమనమే కదా ......

మంచి చెడుల మతులబులలో
మర్మమెరిగి మసలవలె .......
నిజ జీవిత చదరంగములో
ఆడంబరాలు కుంపట్లను
అంటకాగుట మానుకోవలె ........

నగునూరి రాజన్న

వేదిక

నేటి కవిత  అంశం : వేదిక
తేదీ 12.11. 2018
శీర్షిక : వేదికంటే జ్ఞాన ప్రసూనం
సంఖ్య : 94

జాతి వికాసానికి జవసత్వాలు నింపి
జగతిన తానై నిలిచె కదా.....
ధర్మ క్షేత్రమై ప్రపంచాన 
మంగళకరమౌ మన కళ్యాణ వేదిక ....

ఆబాలగోపాలానికి  అక్షరజ్ఞానం అందించ
అలవోకగ నిలిచె కదా......
ఆణిముత్యపు పాఠశాలలు
అపురూప జ్ఞాన వేదికలై .....

వృత్తి భుక్తాన్ని తీర్చినా
ప్రవృతి భీష్టాన్ని తీర్చ
కడు దూరపు కవన బంధువుల
కలిపి నిలిపె కదా....మన వ్వాట్సాప్ కవన వేదిక....

శ్వేత కపోతాల విహంగాలు
తెగ నరుక్కోకుండా నిలవాలంటే
విశ్వశాంతి గీతాల విడిది వేదిక....
విఖ్యాతమై నిలవాల్సిందే ... విశ్వదేశాల ప్రతినిధులతో.....

వేదికంటేనే పవిత్రం..... వేదికంటేనే పరమోత్తమం....
వేదికంటేనే ప్రమోదం.... వేదికంటేనే జ్ఞాన ప్రసూనం ...
అయినా వెరువరు మన  నాయకగణం
అక్కడినుండే మొదలెడతారు అన్యాయాల దుకాణం ......

నగునూరి రాజన్న

విముక్తి

నేటి కవిత అంశం : విముక్తి
తేదీ : 10-11-2018
శీర్షిక : అసలైన విముక్తి
సంఖ్య : 93

నారాయనుండేతెంచి
సత్యభామ తోడు నిలువ
నరకుని వద గావించ
నరులంతా విముక్తి పొందె
అష్టకష్టాల బారినుండి .....

వందలేండ్ల వలస పాలకులకు 
వణుకు పుట్టించె కదా .....
వర్ధిల్లిన సమరయోధులు
భరతమాత సంకెళ్ళ విముక్తికై   

కానీ:
మరో స్వచ్ఛ  సమరం సాగాలి
మలినపు నాయకులపై .....
అమ్యామ్యాల అధికారులపై....
అంతులేని వింత వింత  అవినీతి పై .....
సంపద కొల్లగొట్టబడకుండా....
కల్తీభూతం కన్నెర్ర చేయకుండా...
కాలుష్యాలు కబళించకుండా....
విద్య అందరికి దక్కేవిధంగా...
వైద్యం చోద్యమై చూడకుండా....
సమృద్ధి  కేంద్రీకృతం కాకుండా....

అప్పుడు కదా అసలైన  విముక్తి
అలసిన సొలసిన ప్రజలందరికి......

నగునూరి రాజన్న



ధిక్కారం

టి కవితాంశం : ధిక్కారం 
09-11-2018
శీర్షిక : బహు పరాక్ .... నయాకా... 
సంఖ్య : 92

ఆటవికతను అధిగమించిన అనాగరికుడు 
అడుగడుగున ఆదిపత్యానికై అడుగిడు.  
ప్రాణకోటి మీద సాధించిన వాంఛతో 
సాటి మనిషిని సైతం వంచించు పదే పదే ..... . 

చిన్న సంస్థానాలైనందున భారతం
చిక్కింది  పరుల పంచన ఆనాడు. 
వందలేండ్లు మనల్ని  వంగదోలిన
తెల్లోడి తిరస్కారాలకు  ధీటుగా 
ధిక్కరించి ఎదురించె  ఒక్కరొక్కరు
ఒడిసిపట్టి సాధించిరి స్వాతంత్య్రం. 

స్వాతంత్రియానంతరం  సైతం 
ఒక్కటవ్వనని  ధిక్కరించిన 
565 సంస్థానాలను అప్రతిహాతంగా 
ఒక్కటిగా నిలిపె  ఉక్కుమనిషి. 

పోటీ లేదు మాకంటూ 
తోటి వారని మరచిన 
వలస నాయకుల వల్ల 
చీలి పోయెను రాష్ట్రం. 

సమిష్టి ధర్మం, సర్వులకు న్యాయం 
సమసిపోయే ప్రతీ క్షణం..... 
సంభవించు నాందీ ప్రస్థానం 
ధిక్కారపు అంకురానికి .......  

బహు పరాక్ ....... నాయాకా..... 

నగునూరి రాజన్న  

కార్తీక మాసం

అంశం : కార్తీక మాసం 
తేదీ : 08-11-2018
శీర్షిక : యద్భావం తద్భవేత్
సంఖ్య : 91

పెద్దలు చెప్పిన సుద్దులైనా 
విజ్ఞులు చెప్పిన శాస్త్రమైనా 
యద్భావం తద్భవేత్  అన్నట్టు 
ఆరోగ్యం, ఆధ్యాత్మికం,సద్భావం
సంక్షేమం సమ సమాజమన్నారు. 

వర్షఋతువు ముగింపయి 
శరదృతువు ఏతెంచ 
వర్షాకాల తేమల్లో 
సూక్ష్మ క్రిములు బాధించ.... 

అంతిమాన మిన్న ఆరోగ్యమంటూ 
ఆచరించి చూపిరి ఆర్యులు మనకు 
ఉసిరి వనమూలికలతో, 
ఉరికేటి నీటి స్నానం ఉపశమనమని . 

ఉసిరి వనమూలికల ఉల్లాస వాసనలు
శ్వాసించిన కలుగు సౌభాగ్యమంటూ 
వనభోజనాల వంతులేర్పరిచి 
ఘన సంబరాల గమ్మత్తు తెలిపిరి. 

ఇచ్చి పుచ్చుకునే ధోరణికి 
ఇల సాంప్రదాయాలు మిన్నంటు 
ఉసిరి దీప దానాలకు 
ఊతమిచ్చి చూపారు. 

కార్తీకమంటేనే దామోదర ప్రియమని.....  
కార్తీకమంటేనే యాత్రీకమని....  
సకల జనులను ప్రస్తుతించి 
సంఘ క్షేమానికి సంక్షిప్తపరిచి 
సర్వ శ్రేష్ఠమని సన్నుతించిరి
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. 

మాసాలన్నింటికి మకుటమని
ప్రతి రోజు ప్రశస్తమేనని  
పవిత్రతను పదిలపరిచి 
కార్తీకాన్ని కదంబపరిచారు. 
  
నగునూరి రాజన్న 

చీకటి వెలుగుల రంగేళి 2

అంశం : చీకటి వెలుగుల రంగేళి 2 
07-11-2018
శీర్షిక : వెలుగు నీడన పురివిప్పిన చీకట్లు 

మిల మిల మెరిసే 
తారాజువ్వల దీపావళికి 
పురి విప్పిన వెలుగుల నీడన 
కరి మబ్బుల చీకట్లెన్నో..... 

ప్రజల మోమున ఆనాటికి  
ప్రసన్నతలు పలికించే 
పటాసు కంపెనీల నీలి నీడల్లో
పరేషాన్ అవుతున్న పరివారలెన్నో ....... 

కడుపు నింపదు కలకాలం కార్మికునికి...  
కంటి మెరుపులు క్షణకాలం  ప్రజలకు  ... 
కరి మింగిన వెలగపండులా ..... 
కొసమెరుపు దండుకునే దళారులకు తప్ప .... 

అస్తమిస్తున్న సూర్యునిలాగా   
రోజు రోజు దిగజారుతున్న 
రోత పుట్టే పర్యావరణానికి ఇంకా 
రాచ మార్గమేసినట్టు...... 

చేసుకున్నోడికి చేసుకున్నంత ..... 
చేజేతులా చిచ్చు పెట్టి 
చెరిపిన పర్యావరణానికి 
మనచేతే  కక్కిస్తారు పన్నులు రూపాన....  

విద్య లేని వాడు వింత పశువు కాదు 
విద్య ఉన్న విజ్ఞుల మౌనం 
విడువరాదు శాపగ్రస్త కాలం... 
విదిలించు రాబోవు తరం .... 

అందుకే :
కవులు కళాకారులు 
కదం కలిపి కదలాలి 
కలి క్రీడలు  నిలపాలి 
కలుషితాలు తెలపాలి .... 
"కళ " కాలం బ్రతకాలి. 

నగునూరి రాజన్న 

చీకటి వెలుగుల రంగేళి

అంశం : చీకటి వెలుగుల రంగేళి 
తేదీ : 07-11-2018
శీర్షిక : హక్కు భుక్తములు ఆడవారికి.... 
సంఖ్య : 90

మంచి చెడుల మతలబులు 
కలిమి లేముల కష్టసుఖాలు 
చీకటి వెలుగుల అడుగుజాడలు 
ద్వాపారమైనా .... కలియుగమే.......  . 

నరకుని వధ గావించ 
నారాయణుడే పయనమయ్యే.. 
అనుసరించి సత్యభామ
అగ్రపూజలందుకునే !

రాక్షసాంతమయ్యెనని 
రంజిల్లిరి జనులంతా .... 
రంగు రంగుల ముగ్గులేసి
రంగవల్లులే తీర్చిరి రమణులంతా.... 

ఆనందాన జనులంతా  
అంబరమంటే సంబరాలతో  .   
ధీటైనా కాంతులకై 
దీపాల వరుసలుంచిరి . 
అపురూప పర్వమై 
ఆనవాయితీగ నిలిచె.  

ఆడదంటే ఆబల కాదని 
ఆనాడే ఋజువు పరిచినా...... 
ఈనాటికి జాడ లేవు 
హక్కు భుక్తములు ఆడవారికి...... 

కళ్ళు మూస్తే కారు చీకట్లు 
కళ్ళు తెరిస్తే పున్నమి వెలుగులు 
చీకటి వెలుగుల సమ్మిళితమే 
మానవ జీవితాన హరివిల్లు ....... 

నగునూరి రాజన్న 

Wednesday, November 7, 2018

జీవన సౌరభాలు 06-11-2018

జీవన సౌరభాలు
తేదీ : 06 -11 -2018
శీర్షిక :ఆనందాల హరివిల్లే......... 
సంఖ్య : 89

అమృతతుల్యమైన అమ్మానాన్నల ఆలన.....
మధురమైన బాల్యం.
ఆదరించి ప్రేమించే గురు బోధనలు...
ఎదుగుదల కలిగిన విద్యాభ్యాసం.....
ఆత్మీయతలు పంచి నిలిచే ఆలంబన....
అదృష్టం కలగలిసిన జీవితం.

నిలిచిన ప్రతి చోట గెలువడం..
గెలిచిన ప్రతి క్షణం బాధ్యత గుర్తెరగటం....
ఎంత ఎదిగినా ఒదిగి నిలవటం....
పెద్దలనెప్పుడు గౌరవించగల్గటం....

మనసు తెలుసుక మసలుకునే భాగస్వామి.....
మాట చెప్పితే వినే పిల్లలు....
ఆహ్లాదం పెంచే పనులు ......
అరమరికలు లేని అనుబంధాలు...
అన్నీ అమరినట్టు కుదిరితే ...
ఆనందాల హరివిల్లే...
ఆ ఇంట అసలైన జీవన సౌరభాలే కదా!

జీవితం అందరికి వడ్డించిన విస్తరి కాదు సుమా!
ప్రయత్నిస్తే పట్టు సాధించొచ్చు.
పరులను మెప్పిస్తూ.....
మనకు నచ్చిన జీవన శైలిలో నిలవచ్చు....


నగునూరి రాజన్న

ఉషాకిరణాలు 05 -11 -2018

అంశం : ఉషాకిరణాలు
05 -11 -2018
శీర్షిక:ఉషాకిరణాలు
సంఖ్య: 88

కోడి కూతలతో.......
పక్షుల కిల కిలా రవములతో.....
ఊర పిచ్ఛుకల కిచకిచలతో.......
ఉదయభానుడికి ఆహ్వానమంప....

చిరు చీకటిని పారద్రోలే వెలుగు రేఖలు.
నులివెచ్చని స్పర్శలు పూయించే  వింజామరలు.
కమ్మని అనుభవ పాఠాలు మిగిల్చే జ్ఞాన విరులు.
మానవ మేధకు దొరుకు విజ్ఞాన వీచికలు.

లేత ఎరుపు రంగు వర్ణాలతో
చిత్ర విచిత్ర రూప మేఘాల చిత్రమాలికలతో
జీవకోటికి నిత్య నూతన చైతన్యాలనందించ
సప్తాశ్వారథమారూఢుడై ఏతెంచె మానవాళిని కరుణించ....

ప్రకృతి అందాలు పంచు కమలములు వికసించాలన్నా..
ప్రాణవాయువులిచ్చే  పత్రహరితము నిత్య సతతమై నిలవాలన్నా....
ప్రాణకోటికి హాని గొలిపే సూక్ష్మజీవుల భరతం పట్టాలన్నా.......
జీవరాశి నిత్య హోమపు ఆకలిదప్పులు తీర్చుకోవాలన్నా.....
సరికొత్త ఆలోచనలకు చక్కని నాంది పలికే
నిత్యనూతన చైతన్యాల ఊహలకు రెక్కలు తొడగాలన్నా...
నులివెచ్చని లేత భానుని కిరణాల తోడుంటేనే కదా...

నగునూరి రాజన్న

అత్తా కోడళ్ళు 03 -11 -2018

తేది: 03 -11 -2018
అంశం : అత్తా కోడళ్ళు
శీర్షిక : అమ్మలిద్దరు.....
సంఖ్య - 87

ఆది అమ్మగా మూలం...
సృష్టి స్థితి లయలకు ఊతం....
ఆస్తి అంతస్తులకు అడ్డ్రస్సు ....
పిల్లా పాపలకు యశస్సు ....
ధాన్య రాశులకు ఆలవాలం....
ఆరోగ్యాలకుకొలమానం   ....
విద్యలన్నిటికీ మూలాధారం....
విజయ తీరాలకు దాహసమం....
ధైర్య సాహసాలకు ఊపిరులు......
ఆదిగాగల అష్టాధిపతులు
అమ్మరూపే అన్ని కృపలు.....
క్షీర సముద్ర రాజ తనయాం
శ్రీరంగధామేశ్వరీం..........
విష్ణు సతిగా విమలరూపిణి
హిందూ ధర్మాలకు ఉషస్సు గా
అమ్మనంతా నిలుపుదురు 
అష్టలక్ష్మిగా కొలిచెదరు .....

బ్రహ్మ సతిగా బాసర సరస్వతిగా 
వాసికెక్కిన హంసవాహిణి వీణాధరివే.....
విద్యారంభాన ఎల్లరిచే 
పూజలందుకునే విదుషీమణివే...
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా.....

అమ్మలగన్న అమ్మలే
అమ్మలిద్దరూ  ఆరాధ్య దైవాలే.......
అవని జనుల క్షేమం సదా కోరె అలుపెరుగని
అపురూపమైన అత్తాకోడళ్ళు......సుమా!
అందమైన కుటుంబాలలో
అరమరికలు మరచి మెదల
జన సామాన్యులకు ప్రవచించ ఎద ఎదన....

నగునూరి రాజన్న

ఆశ 02 - 11 - 2018

అంశం : ఆశ
02 - 11 - 2018
శీర్షిక : అభివృద్ధికి చుక్కాని....
సంఖ్య: 86

ఉరకలేసే మనసులో  అప్పుడప్పుడు 
ఊహలకి రెక్కలొచ్చి విహరిస్తూ
ఉసిగొల్పిన ఆలోచన పరంపరలు
ఉవ్వెత్తున ఎగిసిన తరంగాలే కదా....

ఉన్న స్థితిలో మార్పు కోరుకుంటూ
ఉన్నత శిఖరం చేరుకోవాలని ఆశ.....

పశు సమూహాల నుండి
పదిలంగా దూరం చేసింది .....
పనిముట్లకు రూపకల్పన గావించి
పట్టం కట్టింది .........
ప్రస్తుత సుఖమయ జీవనానికి
పరవళ్లు తొక్కింది.......
పటుతరమై తీర్చి దిద్దింది
పసిమి వన్నెల ఆశే కదా........

ద్రవ్యోల్భణాల దగుల్బాజీ లెక్కలెలా ఉన్నా
శ్రమ దోపిడీతో చాలీ చాలని జీతాలున్నా
సజావుగా బతుకు సాగితే చాలని
 సామాన్యుడి ఆశ......

వందల మందికి మేలు జరగాలని
పన్నులు కడుతూంటే..........
ప్రతి చిన్నారికి సౌష్టవమైన పౌష్టికాహారానికై
పరులను  ప్రాధేయపడని సంఘంఉండాలని ఆశ!

ఆశే మనిషికి నాగరికత నేర్పింది.
కానీ....
నాగరికత మరిచిన నాయకులూ
లక్షల కోట్లు లగాయించి మింగుతున్నారు...
ఆశ మానవాళి అభివృద్ధికి చుక్కాని కావాలని నా ఆశ....

నగునూరి రాజన్న

పాముకు పాలు పోసినట్టు

అంశం : పాముకు పాలు పోసినట్టు 
తేది: 30-10-2018
శీర్షిక : ఓటేసినా .......


అపర సుబ్రమణ్యుడాని....
ఆశించిన  జనులంతా 
ఆరతిచ్చి పూజిస్తారు  
పాలు బోసి పుట్టలోన... 

ప్రత్యక్షమైతే మాత్రం 
పరుగుపెట్టి పడిపోతారు  
పరోక్షంగా కోర్కె తీర్చితే 
పబ్బతి పట్టి నిలబడతారు

గల్లీ నుండి ఢిల్లీదాకా
ఓట్లకోసం నాయకులంతా 
కాళ్ళ వేళ్ళ పడ్తున్నారు......ఈనాడు 
గెలిస్తే మాత్రం... అడ్రస్సే గల్లంతు  

దేవుడెప్పుడు దేవిడీలో ఉండి
అంతర్యామిగా అన్నీ జూసినట్టు..... 
నాయకుడు సైతం ఎక్కడున్నా 
ప్రజాక్షేమం సదా కోరితే ....... ఎంత బాగుండు. 

ఓటేసేదాకా ఓడమల్లప్ప
ఓటేసినాక బోడమల్లప్ప....... అన్నట్టుందీనాడు 
ప్రత్యక్షంగా ప్రతిపనీ చేయలేకపోయినా 
పరోక్షమై దన్నుగా నిలిస్తే .....ఎంత బాగుండు.

నగునూరి రాజన్న

నది 01 -11 -2018

01 -11 -2018
అంశం: నది
శీర్షిక: నిజ మానస సరోవరాలు

సుందరమైన సంద్రమెంత విశాలమైనా...
సురుచిర రుచికర తాగునీరు....కానే కాదు
అరక దున్నే రైతన్నకు సాగునీరు... అసలు కాదు
గుక్కెడు కడుపు నింపదు జీవ కోటికి....
పట్టుమని పట్టెడు పుట్ట తేనై పనికి రాదు.....

భానుడి భగ భగలకు ఆవిరయ్యే సంద్రం
చల్ల గాలికి మలిచి నిలిచిన మేఘం
కొండ కొనల్లోన కొలువౌను చినుకుగా
నిండు పాయలై  బయలెల్లి పరుగెత్తు...
పండు వెన్నెల్లు ప్రకృతిన పదిలపరుచ........   

వాగు వంకలన్నీ కలిసి  సెల ఏరులయ్యి.... 
పచ్చ పచ్చని తరులకు చక్కంగ నెలవయ్యి
పుడమి తల్లికి నిండు పట్టు చీర కట్టినట్టు
పుట్టింది భువిపైన పునీతులను జేయ.....
పుణ్య తీర్థాలుగా వెలసి విలసిల్లుతుంది ........

నాగరికతకు కేంద్రాలు నదీమ తల్లులు
నిత్య చైతన్యానికి ప్రతీకలు
మానవాళి మనుగడకు నిహారికలు
తాగు నీటికి సాగు నీటికి కేంద్రాలు
జలచరాలకు నిజ మానస సరోవరాలు.....

నగునూరి రాజన్న

శ్రమకు విలువేది 31-10-2018

అంశం: శ్రమకు విలువేది
31-10-2018

నీలి నీడలు తేది:

అంశం : నీలి నీడలు
తేది: 29-10-2018
శీర్షిక : సిగ్గుపడుతున్న నీలి నీడలు
సంఖ్య : 84

ఎన్నికల నగారా మోగింది
రాజకీయుల రంజు మొదలయ్యింది
రాగాల....మేని... ఫెస్టో...ల బాకా సరిజేత్తున్నరు... సైసు.....

అయ్యా.....మా జోలె నింపండి......
మీకు మన్నంటనియ్యం ..........ఒకల్లు
అమ్మా....... మాతా కబళం...........
మిమ్మల్ని..... నెత్తమీద వెట్టుకుంటం....ఇంకోలు

నాన్న పదవినడ్డం బెట్టుకుని.....
నలిచి కోట్ల మన్ను  బుక్కితే........
దంచినోనికి బుక్కిందే మిగులుబాటన్నట్టు...
అనేకానేక కుంభకోణాలకు ఆలవాలమై
నిస్సిగ్గుగ నిలిచిన ముఠా ఒకవైపు.........ఒకరి ఆరోపణ...

ప్రాజెక్టుల నమూనాలు మార్చి
పదవులడ్డం పెట్టుకుని
పంచుకుంటున్నరు కమీషన్లని .... ఇంకొకరి ఆరోపణ ...

పెద్ద పెద్దోళ్ళు ఏకంగా
యుద్ధ విమానాల కొను... "గోల్ ".... మాలని
ఇంకొకరి ఆరోపణ.........

ఖబర్దార్ బిడ్డా......
ఖద్దరొళ్ల మాట..... నీళ్ల మూటా .....
నమ్మనే నమ్మకని ......  నా మనస్సాక్షి.

అంతటా అవినీతి నీలి నీడలే ........

రోజులు గడిచినయి ......... నూతన సంవత్సరం.

సిగ్గుపడుతున్న నీలి నీడల వెలుగుల్లో
మొగ్గ తొడిగిన సగటు ఓటరన్న .....
మళ్ళీ సమాయత్తం కావాల్సిందే..... 
ఎదో ఒక .... ........ ........ ఓటేయాల్సిందే......

నగునూరి రాజన్న

గాలి మేడలు 26 -10 -2018

అంశము:గాలి మేడలు
26 -10 -2018
శీర్షిక: మందబుద్ధులు
సంఖ్య: 83

మూడు తరాల మొఘలాయి పాలనలో
మోడువారినది ఆసేతు హిమాచలం
మూడు వందలేండ్ల తెల్లోడి పాలనతో
బీడు భూములైనాయి హిందూ సామ్రాజ్యం

ఎందరెందరో  మహానుభావులు
అందరికి వందనాలు...... అయినా
సమరాన్ని కొలిక్కి తెచ్చింది మాత్రం
గోచి పెట్టిన గోమటి గాంధీజీ సుమా ....

పోతూ పోతూ పెట్టిన తెల్లోడి పేచీతో
తోక వంకర బుధ్దిగాళ్ళు కొంత మంది జేరి
కక్షగట్టి సాధించిరి డెల్టాలు తమ దేశంగా
అయినా మారదు అవిటివాడి బుద్ది.....అన్నట్టు

అప్పుడప్పుడు ఆడిస్తాడు వాడి తోక
ఎన్నోసార్లు పెట్టుకున్నాడు కర్రు వాత
అయినా ఆశ సావని ఐశ్వర్యవంతుడు
కడుతూనే ఉన్నాడు  గాలిమేడలు

ఎప్పటికైనా సాధించక పోతానా అని....
గజనీ మహమ్మదే ఆదర్శమంటాడేమో....
ఏటిలో పిసికిన చింతపండౌతుందని
ఎప్పుడు అవలోకిస్తారో వెర్రి నాగన్నలు

తప్పుడు ఆలోచనరా  వెధవాయి నీదని
కోప్పడి చెప్పితే మాత్రం బుద్దొస్తుందా...
ముష్కరులుగా మారిన మంద బుద్దులకు
అనుక్షణం అప్రమత్తంగా ఆరితేరి నిలవాల్సిందే......

నగునూరి రాజన్న

తేనె పూసిన కత్తి తేదీ : 27 -10 -2018

అంశం : తేనె పూసిన కత్తి 
తేదీ : 27 -10 -2018 
శీర్షిక : గీతే శరణ్యం 
సంఖ్య: 84 

నిండు వేసవిలో పండు వెన్నెలలా 
హిమాలయాల్లో మంచుగడ్డ చందంలా 
ఎడారిలో కనిపించని ఒయాసిస్సులా 
ఆహ ఎంత మధురం ఆ తీయని మాట 
అనిపిస్తుంది ఆ క్షణాన ఎవరికైనా........ 

అయినవాళ్లంతా అవకాశవాదులా... 
అసలు ఆప్తుడంటే ఇతనేనా.... 
పరిసరాలు మరిచేంత పరిచర్యలు 
నిండా నమ్మి నడిస్తే అప్పుడు గాని 
అవగతం కాదు పోటు దిగేంతవరకు....

కనికట్టు మాటలకు పడబోకు 
కనిపెట్టుకుని కదం కలుపు 
కల్మషమున్న తీపిని గుర్తించు
కషాయమైనా మంచి కోరే మనుసును గుర్తించు 
కర్తవ్య నిర్వాహణలో ఏమరుపాటు అసలే వద్దు 

గీతలో చెప్పింది అక్షరాలా నిజమ్
జీవితాన అన్నింటికీ ఆచరణీయం 
అంటి ముట్టనట్టు అనుసరించు 
పొగిడితే మునగ చెట్టెక్కొద్దు 
తెగిడితే కక్ష పెంచుకోవద్దు....

నగునూరి రాజన్న

మాల్స్- 25 -10 -2018

అంశం : మాల్స్
శీర్షిక :  బంధమెరుగని బాజార్లు
25 -10 -2018 
సంఖ్య: 82 

ఉన్నవాడి డాబు దర్పానికి 
మధ్యతరగతి అంతా హడావుడి 
కోట్లిచ్చి కొండమీది కోతులతో ప్రారంభాలు 
మొదటి రోజు, వారం, నెల పథకాలు 

కావాల్సిన నాలుగు వస్తువలకై 
కాళ్లరిగేలా నలువైపుల తిరగాలి 
సమయమంతా  హరించుకు పోయి 
సంకనాకి పోతాయి మిగతా పనులు 

పార్కింగులో పతాక సన్నివేశాలు 
ఇదికొంటే అది ఫ్రీ అని 
అది కొంటె ఇది ఫ్రీ అని
ఇరకాటంలో పెట్టి ఇబ్బంది పెడతారు. 

మా మాల్ మెంబర్షిప్ ఉంటె డిస్కౌంట్ 
మా మాల్ క్రెడిట్ కార్డుంటే పాయింట్లంటూ
మడత పేచీలు పెట్టి గోడకుర్చీ వేయిస్తారు 
మళ్ళీ మళ్ళీ రా రమ్మంటూ గోము చేస్తారు  

మనిషి మరులు గొన్నాడు డబ్బు మీద ........
మనిషి మరలై నర్తిస్తున్నారు 
మనిషికి మనిషికి సంబంధం లేదు 
మొత్తానికి బంధమెరుగని బాజార్లు 

నగునూరి రాజన్న

తులసి 23 -10 - 2018

అంశం : తులసి
శీర్షిక : హిందూ సాంప్రదాయం /పెట్టని కోట
23 -10 - 2018

తరతరాల సాంప్రదాయాలు
తరగని ఆస్తులు భారతాన......
తనివి దీర కొలిచి తరింతురు
తల్లి మేలును తలపించ........

అరువదారు అనారోగ్యాలకు
ఆయువు పట్టు తులసిచెట్టు.
నాలుగు రకాల ప్రాశస్త్యం
రామ, కృష్ణ, వన మరియు కపూర.

విష్ణు చిత్త తనూజయై విలసిల్లె
తల్లి రాధమ్మకు దన్నుగా నిలిచె
తులాభారమున తులతూగి నిలిచె
ముక్కోపి భామను ముద్దుగా మందలించ....

ఇంటింటా వెలసె ఇంతులను గావ
వంటింటి మూలికై పిల్ల పాపలను బ్రోవ
ఈశాన్య దిశన నిలిచి ఇంటిల్లిపాదికి పెట్టనికోటై
అవసాన దశన జీవగంజిగా ప్రశస్తి  .....

నగునూరి రాజన్న