Saturday, October 15, 2022

నేటి మొక్క…. తేది 09-06-22 శీర్షిక : వారసత్వం…

 నేటి మొక్క…. 

తేది 09-06-22
శీర్షిక : వారసత్వం… 
కవిత సంఖ్య :  137+4

పసి పాపల నవ్వులు నింపుకుని 
మారాకులతో ముద్దు లొలుకుతూ 
ఆత్మీయతానురాగాల కొమ్మలతో 
భవబంధాల రెమ్మలతో నిలబడే 
బాటసారి చెట్టు. 

నీవు నడిచొచ్చిన దారిలో 
ఎంతెంత ప్రాణ వాయువును 
పట్టించావో...ఎన్ని వింజామరలై  
గ్రీష్మ తాపాలను చల్లార్చాయో ... 

ఎన్నెన్ని చిన్నా పెద్దా చెట్లు కలిసి 
అల్లన వీచే చల్లని గాలిని మెల్లగ నడిపించి… 
దూది పింజముల్లాంటి మేఘ మాలలను 
వర్షధారలుగ కురిపించి పంట 
పొలాలకు చేర్చి పరిపుష్టిని అందించాయో... 

ఇదంతా స్వార్థమెరుగని తరాలనాటి 
తాతలో.. తండ్రులో… తలో చేయి 
వేసి తాము నాటిన..ఆనాటి చెట్లే 
నేడు మనకవి జీవన  జ్యోతులైనాయి... 

రక్త మాంసాలు రంగరించుకుని పుట్టి 
రమ్యమైన జీవితం గడుపుతున్న మనం 
సంస్కారానికి సారథులమై వారసత్వాల 
వారధులమై నాటాలి మనమూ..ఒక మొక్కను... 
ముందుతరాలకు ముదము చేకూర్చ…. 

వట వృక్షమై...రాబోవు తరాలకు 
వారసత్వ సుగంధాలను వదిలి 
మానవత్వ పరిమళాలను వెదజల్లి 
జీవరాశి మనుగడలకు ప్రాణవాయువులై 
నిరంతరాయ తోరణాలై నిలుస్తాయి…. 

నగునూరి రాజన్న 

ముఖం చాటేయకు తేది : 09-06-2022 శీర్షిక : మల్లె పరిమళం…

 ముఖం చాటేయకు

తేది : 09-06-2022
శీర్షిక : మల్లె పరిమళం… 
కవిత సంఖ్య : 917

వెన్ను చూపని ఎన్ని సామర్థ్యాలో... 
చేయి చేయి కలిపి చెర…బోతేనే.... 
మేలి రకమైన సానబెట్టిన వజ్రంగా 
సంఘంలో నువ్వు గౌరవింపబడుతున్నావు ... 

ప్రత్యక్షంగా  కొమ్మలు రెమ్మలైన 
మీ అమ్మా నాన్నలను నువు కనవచ్చు.... కానీ 
వేర్లు లాగేసుకున్న అవనిలోని పదనులా 
పరోక్షంగా సంఘ సభ్యుల బాహువులే.. 

అందలాలు ఎక్కగానే... ఎవరికీ 
అందకుండ ఆలోచనచేసే 
ఎంతో మందికి అర్థమైనా 
అర్థం కానట్టు నటించే తత్వమే... 
 
రాజైనా మంత్రైనా ఏ పాలకుడైనా… 
ఎప్పటికి  నీకు నీవే..ఒక్కడివే  గొప్పనుకోకు.... 
అధికారం కట్టబెట్టగానే ముఖం చాటేయకు..
కాలం ఎన్నటికీ ఒక్కలా ఉండదు…  
ఓడలు బండ్లయి… బండ్లు ఓడలైన 
దాఖలాలనేకం .....
 
ఎత్తుమీద కూర్చుండబెట్టిన 
చేతులే ఎత్తేయడానికి  ఎంతో 
సేపు పట్టదు.. కాలం కలిసి రాకపోతే... 
కాలగర్భంలో కలిపేసుకుంటుంది.. 

ఒకరికొకరు తోడైతేనే వసుధపైన సుగంధాలు 
మల్లె పందిరి నల్లుకున్న పరిమళాలు...  
అది గమనిస్తే ఆనంద నందనం.. 
అదే మానవ జీవన సౌరభం… 

నగునూరి రాజన్న 

నవజీవన పత్రం తేది : 08-06-2022 శీర్షిక : నియమం ....

 నవజీవన పత్రం

తేది : 08-06-2022
శీర్షిక : నియమం .... 
కవిత సంఖ్య : 917

అవనిమాతకు తరువే ఆభరణం
పచ్చందాలను మూటగట్టుకుని 
పడుచు సోయగాలు ప్రదర్శిస్తూ 
భీష్మ ఘీంకారాల గ్రీష్మాలను సైతం 
పండు వెన్నెల్లుగా వెదజల్లు  
ఫరిఢవిల్లే  జీవరాశికి పటుతరముగ ....  

కాలమాన పరిస్థితులకు 
కట్టుబడిన ఋతువులలో... 
శిశిరంలో తలలు దులుపుకున్నా  
చిత్రంగా వసంతంలో చిగురిస్తాయి .... 

విశ్రమించని చక్రంలా కదిలిపోయే 
కాలము ..ప్రకృతిలో పల్లవించే పదనిసలే ... 
మానవాళి జీవనానికి అన్వయించే 
బహు మంచి సోదాహరణం... 

తరాలు కదిలిపోతూంటేనే 
వరాలు విశ్వ మానవాళికి .... నవతరం 
యువతరం చిగురించి వెలుగొంది 
కాలమనే తరువు కొమ్మలలో 
నవజీవన పత్రాలై పొదుగుతాయి... 
  
అదే సహజ కోమల సౌందర్యం 
ప్రకృతి మాత అకుంఠిత నియమం 
అదృశ్య శక్తి శాస్త్రీయ సూత్రం .... 
అదే అనాదిగా వస్తున్న సందేశం .... 

నగునూరి రాజన్న 

ఆకుల మాటున తేది: 07-06-2022 శీర్షిక : ఆడ పిల్ల

 ఆకుల మాటున 

తేది: 07-06-2022
శీర్షిక :  ఆడ పిల్ల 
కవిత సంఖ్య : 137+3

ఆడపిల్ల పుట్టగానే ఆదిలక్ష్మని 
అదృష్ట లక్ష్మని కొనియాడెదరు… 
ఎదురుచూడని ఎదుగుదల కూడా  
తోటకూర ఎదిగినట్టుంటుందంటారు .... 

పిల్లలంటేనే ఆటపాటల అల్లరని 
అల్లరి చిల్లరిగా అసలు కూడదని 
అందునా ఆడపిల్లలు అణకువకు 
మారుపేరుగుండాలని కోరు మనుజ లోకం... 

పిల్లలెవరైనా కూడ పిసరంత స్వేచ్ఛనిచ్చి 
గమన రీతులను ఓ కంట గమనిస్తూనే 
స్వీయ క్రమశిక్షణలకు కొంత వెసులుబాటిచ్చి 
అవసరమనుకున్న చోట  ఆదుకోవడమే ... 
అసలు సిసలైన ఆత్మీయత ... 

ఆకు చాటు పిందెలా అపసోపాలు 
ప్రదర్శించకుండా … ఆటవిడుపులా
 స్వేచ్ఛలనిస్తూ … ఆత్మ నిర్భరతలను
అందిపుచ్చితే కద మల్లె తీగలై పరిమళించు…. 

అమ్మానాన్నలు కమ్మని  స్వేచ్చ నిచ్చారని 
కనులు రెండు మూసుకుని.. కానిపనులకు 
కాలుదువ్వక... కన్నవారికి కట్టబెట్టరే
కీర్తిప్రతిష్టల కిరణ కాంతులను ఇలన మీరు... 


నగునూరి రాజన్న 

సెమటసుక్కనై పోతా తేది : 06-06-2022 శీర్షిక : రారాజుగ ఎదగాలని .....

 సెమటసుక్కనై పోతా

తేది : 06-06-2022
శీర్షిక : రారాజుగ ఎదగాలని .....  
కవిత సంఖ్య : 915

ఆకలెవరికైనా ఒకటే ... అయినా .... 
పైసలున్నోని  ఆకలేమా పదిలమయితే  
పైసలు లేనోని ఆకలేమో మాడ్చేస్తది
పైస చాటు మతలబులెన్నో దాగి ఉన్నవి ....

ఐదు వేళ్ళు అణకువగా నోట్లోకి 
వెళ్లి ఆకలి దప్పులు తీరాలన్నా ...
మనిషికి విలువలు జోడించి 
మాన ప్రాణాలను కాపాడే 
వలువలు కావాలన్నా ..... 

కాలమాన పరిస్థితులను కాపు కాసి ... 
దాపుగా నిలిచి నాగరికతల నడకల్లో... 
నీడనివ్వడానికి ఇల్లు వాకిలి కావాలన్నా ...... 

పల్లె నిండా ఫరిడవిల్లిన చేతి 
వృత్తుల కొలుములు వెలగాటానికైనా...... 
పట్నాల నీడలలో అభివృద్ధి 
పేరు మీద వెలిసే పరిశ్రమలు 
పురోగమించడానికైనా ..... 
 
కావాల్సింది సెమటసుక్కే  ..... 
కాసులకన్నా ఎంతో గొప్పది ..... 
రుధిరం మదిస్తేనే సెమట 
సుక్క కారేది ..... అందరివల్ల 
అయ్యేది కాదది ..... 

అయినా .... 
ఎప్పటికప్పుడు తమ డబ్బులే 
గొప్పంటూ పెట్టుబడిదారుల 
చేతిలో నలిగి పోతూ .... యుగాలు 
గడిచినా  గుర్తింపు దక్కని నాలుగవ 
వర్ణంగానే మిగిలిపోతున్నది ....

రాజకీయం రంకెలు వేస్తూ ఆపద్ధర్మంగా 
కల్లబొల్లి కబుర్లెన్ని చెప్పినా .... ఆచరణలో .... 
చాపకింద నీరులా ... అన్ని రకాల 
సిద్ధాంతాలను నీరుగార్చుతూ ....
పెట్టుబడి దారుల చంకలో దూరిపోతారు .... 

మనుషులంతా ఒక్కటే నంటూ 
మాటలు చెప్పుడే యుగాలనుండి... 
అక్షరాలా ఆచరించిన గొప్పోళ్ళు 
ఆనవాలుగా వదిలిందే మానవీయత .... 

సెమటసుక్కది ఎప్పుడూ బానిస బతుకే 
శృంఖలాలు తెంపుకునే మంచి రోజుకై 
రాటు దేలి రారాజుగా వెలిగి పోయే క్షణం కోసం 
మనందరం వేయి కళ్ళతో ఎదురుచూద్దాం 

నగునూరి రాజన్న 

పర్యావరణ గేయం తేది: 04-06-2022 శీర్షిక : మారవయా ఓ మనిషి

 పర్యావరణ గేయం 

తేది: 04-06-2022
శీర్షిక : మారవయా ఓ మనిషి 
కవిత సంఖ్య : 914

మారవయా ఓ మనిషి  
మర్మమెరిగి జీవించు ... 

జీవరాశి ప్రాణాలకు 
పంచభూతమాధారం .. 
భూమి నీరు ఆకాశం 
అగ్నివాయువాదియూ   .....  

ప్రాణవాయువిచ్చేది 
పచ్చని తరువులు .... 
ఆకలి దప్పులు తీర్చి 
ఆయువులు పెంచును .... //మార//

జలసాలు మానుకోని  
అవసరాలు తీర్చుకో   .... 
స్వార్థాలను చంకదింపి 
వ్యర్థాలను అరికట్టు ....    

పాలిథీన్ల పనిపట్టు  
స్వచ్ఛతకు సలాంకొట్టు
సూచనలు పాటించి 
అలసత్వం జయించు....  //మార//

తొలకరితో కులకగనే 
పులకింతలు ఆవనికి 
గిలిగింతల ఆనందం 
జీవరాశికంతటికీ ....... 

తరువే మన బంధువు 
బరువని ఎంచకు  
మొక్క నాటు చాలు 
ముందుతరం మేలు   //మార//

పచ్చ తివాచీలన్నీ  
పరుచుకుంటే నిండుగా  
మరకతమై శోభించు 
ధరణి మాత మెండుగా

వాగు వంక చెట్టు గుట్ట 
ప్రాణకోటి ఆయువులు 
పట్టుబట్టి చెరబట్టకు 
ప్రకృతి నియమాలను ....        //మార//

నగునూరి రాజన్న 

చిత్ర కవిత తేది : 04-06-2022 శీర్షిక : శాలివాహనుడు

 చిత్ర కవిత 

తేది : 04-06-2022
శీర్షిక :  శాలివాహనుడు 
కవిత సంఖ్య : 137+1

మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి 
కూడు గుడ్డ నీడకు మట్టినే 
నమ్ముకుని...మట్టితోనే  అనుబంధం 
పెనవేసుకున్న మానవుడు 
బహు ముఖ ప్రజ్ఞాశాలి .... 
అక్షరజ్ఞానాలు లేనినాడే 
అకుంఠిత దీక్షలతో అపురూపాలు 
సృష్టించాడు అరచేతితో ...... 

మేధకు పదును పెట్టి తాను 
మేనుకు సౌకర్యంఅలరించ 
నాగరికతల నీడల్లో నడయాడి 
ఎవుసంలో మీసం తిప్పి  ఆకలి 
కేకలను మాయం చేసి....నేతలో 
నాయకుడై... వస్త్రంతో ఆచ్చాదనలు  
చేసుకుని ...చక్రం తిప్పి చక చక 
పాత్రాలు చేసి వంటల వల్లభుడయ్యాడు ..... 

అంగవస్త్రం లేకున్నా...చమట చుక్కల 
కష్టాల కడగండ్లను దాటుకుంటూ 
బాధ్యతల బరువులు నెత్తికెత్తుకుని 
ప్రత్యేక జిగట మట్టిని పట్టి తెచ్చి 
కుంకుమపువ్వులా మెత్తగా మార్చి 
మట్టి ముద్దలతో మహత్యములు  
సృష్టించాడు .... 

అది ఇది అను తేడా లేదు .... 
పైకప్పుకు పెంకులు ... వంటకు 
పాత్రలు ... ధాన్య రాశులకు 
గాజాలు... అతని చేతిలో కీలు 
బొమ్మలు ... మానవ జీవనాన 
మహత్తు కలిగిన మట్టి కుండలు 
జీవం పోసుకుని మనకు జీవితాల 
నిచ్చాయి ...

మట్టికుండల మాణిక్యమే కాదు 
మహారాజుగా కూడా వెలుగొందాడు 
శాలివాహనుడై క్షత్రియ ధర్మం 
పాటించి పాలనలతో శకమునే సృష్టించి 
చరితలో పేజీలు లిఖించి నిలిచాడు .....  

నగునూరి రాజన్న 

చిత్ర కవిత తేది: 27-05-2022 శీర్షిక : గాలి మేడలు

 చిత్ర కవిత 

తేది: 27-05-2022
శీర్షిక : గాలి మేడలు 
కవిత సంఖ్య : 129+8

ఆలు లేదు చూలు లేదు 
కొడుకు పేరు గోవిందమని 
ఎక్కడి గొంగడి అక్కడే ఉంచి 
గొప్పలు చెప్పడమే వారి లక్ష్యం ... 

ఆవలిస్తే ప్రేవులు లెక్కపెడుతూ 
అమాయక చక్రవర్తులు కనక 
అందుబాటులోకి వస్తే .. కంచికి 
చేరని కథలన్నీచెప్పి  వినిపిస్తారు .... 

వింతగ వినేవారు దొరకాలే గాని 
వీధి వీధి అంతా మనదేనంటూ 
డంకా బజాయించి డాబాకొరకు 
ప్రణాళికల రచనలు చేస్తుంటారు .... 

మాటలతో మతలబులు చేసి 
మూటలన్నీ సర్దేసుకుంటారు .... 
సప్తవర్ణాల కర  పత్రాలతో 
సరంజామా లేకుండానే ఇల్లుకు 
ముహూర్తం పెట్టి ముగ్గులు పోసేస్తారు .....

ఉచిత తాయిలాల ఊళ పెట్టి 
స్వార్థ రాజకీయ ఎన్నికల 
లాలూచీల  ప్రకటనలు నమ్మి 
నట్టేట మునిగే దేశ ప్రజలులా .... 

తాత్కాలికంగా తళుకులీనినా 
శాశ్వతత్వం పొందలేని...గాలిలో 
కట్టిన పేకమేడలు... ఎప్పటికైనా 
పెళ పెళ కూలక మానవు ......  

నగునూరి రాజన్న 

మబ్బుల మాటున తేది : 30-05-2022 శీర్షిక : జీవరాశి మనుగడ

 మబ్బుల మాటున

తేది : 30-05-2022
శీర్షిక : జీవరాశి మనుగడ 
కవిత సంఖ్య : 911

ఋతువుల మేళంలో గతుకుల్లా 
గ్రీష్మ జ్వాలల తాపాలకు ఆవిరైన 
సంద్రపు నీరు... అల్లన కదిలిపోవు 
తెల్లని మబ్బుల తేరుల పైకెక్కి ..... 

చిత్ర విచిత్ర ఆకారాలతో 
చిత్రకారుల కుంచెలకు 
మార్గదర్శకులై ..వింత గొలుపు 
వినీలాకాశంలో పిల్లా పెద్దలకు .... 

కొండ వాలున తిరిగే 
చల్లగాలికి తోడుగా నిలుచి 
గాలివాటమై పరుగులు తీస్తూ 
గడబిడల గర్జనలు చేస్తూ .... 

అప్పుడప్పుడు జిగేల్ మనే 
మెరుపు తీగెల పసిడి సౌందర్యాలను 
కళ్ళకు కట్టి...మాయమౌతూ ... 
సమాయత్తమౌతాయి చినుకు బాణాలు ... 

తొలకరిగా పలకరింపులు చిలకగనే 
ఆపసోపాలు పోతూ అవని మాత 
పచ్చ తివాచీలు పరుచుకుని 
ఎనలేని ఆనందాలను పంచుతుంది ... 

పుష్కలమైన ఉప్పునీటిని సంగ్రహించినా 
పుష్కరిణి లాంటి మంచి నీటిని కురిపించి 
చెట్టూ పుట్టా గుట్టలకు హరితమయ్యి 
జీవరాశి మనుఁగడలకు నిత్య సంజీవినై నిలుచు .... 

నగునూరి రాజన్న 

విరమించని వాక్యం 2 తేది: 31-03-2021 శీర్షిక : అల్లగలము

 విరమించని వాక్యం 2

తేది: 31-03-2021
శీర్షిక : అల్లగలము 
కవిత సంఖ్య: 632 

ఆరాటముండాలే గాని 
అదెంతపని.... ప్రతిరోజూ 
పందేరమేగా .... మెతుకు 
బాటలో  వెతుకులాటలాగా.... 

నూతనత్వం చేరుకోవాలనే 
తపన ఆశయముండాలి గాని ... 
పండగ కేసుకునే హరివిల్లు వర్ణాల
ఆనందాల ఆర్నవాల కొత్త వస్త్రాల్లా 
కొంగొత్త పదబంధాల అల్లుకుపోమా.... 

గురువుగారిచ్చే నవీన రీతుల 
అంశాల మల్లె పందిరికి 
ఎప్పటికప్పుడు సరి కొత్త ఆలోచనల 
చిగుర్లు జోడిస్తూ...ఇంటికొచ్చిన కొత్త 
బంధువుకు కొసిరి కొసిరి చేసే 
మధురిమల వడ్డింపుల్లా.. 
కూర్చుతూ అలంకారాలతో 
అందాలను పొందికగా 
చేర్చి…కవన దండలల్లమా.... 

అమ్మ హంసవాహిని 
అనుగ్రహం తోడవ్వగా 
మన పదాలు మనకే 
మన వాక్యాలు మనకే 
ఆశ్చర్యం గొలిపేంత 
సుందరంగా తీర్చిదిద్దామా ... 

నగునూరి రాజన్న 

మానవతా సంతకం తేది: 24-05-2022 శీర్షిక : ఎక్కడ మొదలెట్టాలి ...

 మానవతా సంతకం

తేది: 24-05-2022
శీర్షిక : ఎక్కడ మొదలెట్టాలి ... 
కవిత సంఖ్య : 908

జీవరాశి చరితలోన 
మేమె  మిన్నంటూ 
పోలికేకలు వేసే మానవాళి .. 
మానవతావాదాన్ని మసక బారుస్తూ 
మతి చలించి ప్రవర్తిస్తున్నారు .... 

విశ్వం కన్ను తెరవకముందే 
వింతగ హైందవమంతా ...శాస్త్రాలను 
వల్లె వేసి...సంస్కృతీ సాంప్రదాయాలను 
నెత్తికెత్తుకుని ... నాగరికతల నడకలను 
లోకానికి నేర్పిన ఘనత  మనది ..... 

రాను రాను రాజుగారి గుర్రం .... 
రంగు మారిపోయినట్టు .... వలస వాద 
తత్వాలో ... పొరిగింటి పుల్లకూరలో....
పాశ్చాత్యాన్ని పొదవుకుని...మానవత్వ 
వలువలు పలచబడి పోతున్నవి .... 

విద్య వైద్యం అందరికి అందకుండా ... 
అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్న 
ప్రభుత్వాలు .... ఉచితాల తాయిలాలతో 
మత్తులో ముంచి... ఉలుకు పలుకులు   
లేకుండా ఉసురులు తీస్తున్నారు.... 

పాలన సౌలభ్యాలకో....గుర్తింపుల 
ప్రత్యేక ప్రయోజనాలకో .... 
వృత్తుల వారీగా సూచనలేర్పటుకు  .... 
కులమతాల చిచ్చు రేపి 
కుంపట్లు రాజేస్తున్నారు ...... 

ప్రభుత్వాలే పంతంపట్టి 
వంతుల వారీగా సంతలో 
సరుకుల్లా ... మత్తు పదార్థాలకు 
మనుషుల్ని బానిసలు చేస్తుంటే 
మానవతా సంతకం ఎక్కడి నుండి 
మొదలెట్టాలి ? .... 

అంగవైకల్యంలా పాలనలు 
అంగడి సరుకై అమ్ముడుపోతుంటే ... 
బాకారాయుళ్లయ్యిన  బంధు మిత్రుల 
శిరో భారములతో .... దమ్మున్న దళారీలు 
అరాచకాలకు  గొడుగులు పడుతూ 
ఆసరాగా నీడలు కోరుతుంటే …
ఎవరిని అడగాలి.... 

నగునూరి రాజన్న 

జానపద గేయం తేది : 30-10-2021 శీర్షిక : ఉప ఎన్నిక

 జానపద గేయం  

తేది : 30-10-2021
శీర్షిక : ఉప ఎన్నిక 
కవిత సంఖ్య : 787 

వందలేండ్ల కష్టాలు 
వదలపాయే ఈనాటికీ ..... 

శౌర్యాలకు పేరాయె 
వీరులకు విలువాయె 
నడుంకట్టి ఒక్కటాయే  
పిక్కటిల్లే  జనం నాడు ..... 

స్వార్థాలను చంకనేసుకుని 
సదురుకున్న పెద్దోళ్ళు 
నోరు మూసుకున్నందుకు 
సమాధాయె...  తెలంగాణా...  

పడిన లేచిన కెరటంలా 
మలివిడతన ముడిపెట్టి 
పన్నెండేండ్ల కొట్లాటకు
ఫలితమైతే కనిపించే .... 
 
పన్నెండొందల ప్రాణాలు  
బలి పశువులు చేసిగానీ...  
కదల్లేదు పాలకులు 
వదల్లేదు పరపాలన .... 

స్వాతంత్య్రపు వెలుగుల్లో 
సమాధాన ప్రజాస్వామ్యం 
సంతోషాల ఒడిలోన 
పసిబిడ్డై  పడినంతనే.... 
 
అత్తగారి పెత్తనానికి 
అరిగోసల కోడలులా 
వలసవాద పాలనలో 
వట్టిపోయే పీఠభూమి..... 

అంతా బాగుందిలే అనీ.... 
అశ్వాసన దొరకక ముందే 
అప్పుల్లో కూరుకుని 
తిప్పళ్లు పడుతుండే ....రాష్ట్రం  

ఉప ఎన్నిక ఒక్కటొచ్చి 
ఉపద్రవం ముంచుకొచ్చే 
గులాబీల  చరిత్రలో
లుకలుకలు కానవచ్చే ...... 

ఉప ఎన్నిక చూడగానే 
ఉడుకు రక్తమెగిసి పడే  .... 
ఓటుకు నోట్లాటలో ఆడోళ్ళు 
రోడ్డెక్కి అరిచి గోలపెట్టవట్టె  ..... 

నగునూరి రాజన్న 

రాష్ట్రావతరణ స్ఫూర్తి తేది 02-06-2022 శీర్షిక : బంగారు తెలంగాణ

 రాష్ట్రావతరణ స్ఫూర్తి 

తేది 02-06-2022
శీర్షిక : బంగారు తెలంగాణ 
కవిత సంఖ్య : 913

చతుశ్శతములు శాతవాహనులు 
త్రిశతములు కాకతీయుల కాలం .... 
స్వంత పరిపాలనలలో సాంత్వన 
పొందిన తెలంగాణీయం .... 

శౌర్యాలకు పెట్టింది పేరయినా 
గౌరవాలకు భంగం కలిగింది .... 
వీరులకు విలువలిచ్చి నిలిపినా 
వలసలు రాజ్యమేలినాయి ..... 

ఆరువందలేండ్లు వలసవాదుల
పాలనలో...బానిస బతుకులీడ్చి... 
అరువదేండ్ల పరపాలన శృంఖలాలను  
పటుతరముగ సంకెళ్లు తెంపుకున్నాం  .... 

స్వార్థాలు చంకనెక్కి ఊరేగితే  
శూన్యమే ఒరిగింది తొలిప్రయత్నంలో ...
విద్యార్థులు యువకులు నిర్వీర్యమై 
గుణపాఠామై నిలిచింది చరితలో ..

పడినా ...  లేచిన కెరటంలా 
పుష్కర కాలపు  పోరాటంలో  
పన్నెండొందల మంది బలితో 
ఫలితమాయె తెలంగాణ రాష్ట్రం ... 

నీళ్లు నిధులు నియమాకాలన్నాం 
కలలు నెరవేర్చుకోవాలని 
కదం తొక్కించాం ... కళలను... 
సకలజనులను సమ్మేళనం చేసి .... 

ఎదురు తిరిగి సాధించుకొన్న
రాష్ట్రానికి ఎదురు లేదన్నట్టు .... 
సంక్షేమాలకు పెద్ద పీట వేసినా 
సాకారం చేయాల్సింది ఉత్పాదకతకు .... 

ఎత్తిపోతలు పోసుకున్నందుకైనా 
నదీమ తల్లి జలసిరులతో నగారా మోగించి
భూగర్భ నీటి వనరులు పెరిగినా…. 
రైతుల కష్టాలకు ముగింపు కార్డు 
పూర్ణత్వం సంతరించుకోలేదు  .... 

చద్దిమూటలాంటి మద్దతుధరలు 
ఉద్దెరపొద్దులే ఇంకా .... చేతనైన 
పసుపు బోర్డులు చెట్టిక్కినయి ... 
గోదాముల గడ్డు పరిస్థితే రైతన్నలకు ....  

కష్టాలు తీరని కాకల కొలిమే ఇంకా   
పంటల కాలానికి  వడ్లన్నీ రోడ్లెక్కుడే .... 
కాగడాల వెలుగులతో కళ్ళు కాయలు 
చేసుకోవడమే ఇంకా నియామకాలకు .... 

సాధించినది వేరుగా… రాష్ట్రమయినా 
సాధించాల్సింది ఇంకెంతో ఉంది ..... 
యువతకు సరైన భవిత  కుదిరి 
అప్పులు తీర్చే ఉత్పాదకత పెరిగి 
కుప్పల రాజ్యం...సుభిక్ష భోజ్యం కావాలి.....  

రాజ్యాలేలే సత్తా ఎంత ఉన్నా 
రాజ్యాంగాన్ని గౌరవించాలి.. 
ప్రజలందరినీ ప్రేమించినా 
ప్రథమ పీఠానికి పట్టం కట్టాలి .... 

పాలకులెంత పరితపించినా 
అధికారులెంత అర్రులు చాచినా .... 
ప్రజల సహకారం లేకుంటే 
పథకాలకు చెల్లు చీటీలే ..... 

నగునూరి రాజన్న 

తెల్లవారుజాము కల తేది: 01-06-2022 శీర్షిక : గురువులు .....

 తెల్లవారుజాము కల

తేది: 01-06-2022
శీర్షిక :  గురువులు ..... 
కవిత సంఖ్య : 913. 

కాయం కష్టాల కడలిలో 
కాసింత సేద దీరాలని 
కునుకుల రాజ్యం ఏలుదామని 
కిట కిట తలుపులు వాలగానే ..... 

సప్త వర్ణాల ఇంద్ర ధనస్సులు 
ఇష్టారాజ్యంగా వర్ణ చిత్రాలను 
పేరుస్తూ ... ఆశల తలుపులు తట్టి 
ఆశయాల గమ్యాలను చూపిస్తాయి .... 

కళ్ళ ముందు కదిలిపోయిన చిత్రాలో ... 
కాముక ఊహించుకునే కలల చిత్రాలో .... 
ప్రియమైన అనుభూతులు కొన్నైతే 
సుడిగుండాల గాలి దుమారాల ఇంకొన్ని ... 

మంచి చెడుల మతలబులు కొన్ని ... 
కష్ట సుఖాల కథల చిత్రాలు ఇంకొన్ని ... 
మనోఫలకం చిన్నగ సేద దీరగానే 
మేమున్నామంటూ పలకరిస్తాయి .... 

పగటి కలలైనా సగటు కలలైనా 
రాత్రిదైనా ....తెల్లవారుజాముదైనా 
మేధోమథనాల మేరు పర్వతం 
కొన్నిసార్లు గమ్యాలను సూచించి  
గురువులై గగన విహారం చేస్తాయి .... 

నగునూరి రాజన్న 

వీడని నీడ తేది : 31-05-2022 శీర్షిక : అస్థిత్వపు ఆనవాలు

 వీడని నీడ

తేది : 31-05-2022
శీర్షిక : అస్థిత్వపు ఆనవాలు 
కవిత సంఖ్య : 912

ఉత్తర ప్రత్యుత్తరాలు లేకున్నా 
ఉదయాత్పూర్వపు వెలుగులతో
బయటి ప్రపంచానికి బయలుదేరగానే 
నేనున్నానంటూ అనుసరిస్తుంది  
జీవిత భీమా భాగస్వామిలా ..... 

ఆజానుబాహువును 
అర మురుగుజ్జుగాను 
మురుగుజ్జును సైతం 
ఆజానుబాహువుగాను .... 

ఉభయ సంధ్యలలో పొడవై 
మిట్ట మధ్యహ్నం  పొట్టియై  
అస్తిత్వపు ఆనవాలుగా 
చల్లగా అల్లుకుపోతుంది  .... 

మనిషి అరిషడ్వర్గాల అల్లుడైనా సరే ... 
రాజు పేద భేదమెరుగక ..... 
తాను మాత్రం స్వార్థమెరుగని 
సరంగులా... ప్రతిఫలాపేక్షలు  
ఎరగని ప్రాణస్నేహితునిలా ... 
అంటి పెట్టుకునే ఉంటుంది ..... 

నీడలే కదా అని తోసేయకు 
మిత్రమా....జాడల ఊడలవి 
మనిషి ఉనికికి ముఖ్యంగా 
మనువున్నదనే  ధ్రువపత్రం ..... 

నీడల గారడీలే వినోదాల వింతలు 
గ్రహాల నీడలే గగనాన గ్రహణాలు 
సమయసూచీలకు సాంకేతికతలకు 
విజయ విజ్ఞానాల సవ్యసాచి......  

నగునూరి రాజన్న 

మబ్బుల మాటున తేది : 30-05-2022 శీర్షిక : జీవరాశి మనుగడ

 మబ్బుల మాటున

తేది : 30-05-2022
శీర్షిక : జీవరాశి మనుగడ 
కవిత సంఖ్య : 911

ఋతువుల మేళంలో గతుకుల్లా 
గ్రీష్మ జ్వాలల తాపాలకు ఆవిరైన 
సంద్రపు నీరు... అల్లన కదిలిపోవు 
తెల్లని మబ్బుల తేరుల పైకెక్కి ..... 

చిత్ర విచిత్ర ఆకారాలతో 
చిత్రకారుల కుంచెలకు 
మార్గదర్శకులై ..వింత గొలుపు 
వినీలాకాశంలో పిల్లా పెద్దలకు .... 

కొండ వాలున అల్లన తిరిగే 
చల్లగాలికి తోడుగా నిలుచి 
గాలివాటమై పరుగులు తీస్తూ 
గడబిడల గర్జనలు చేస్తూ .... 

అప్పుడప్పుడు జిగేల్ మనే 
మెరుపు తీగెల పసిడి సౌందర్యాలను 
కళ్ళకు కట్టి...మాయమౌతూ ... 
సమాయత్తమౌతాయి చినుకు బాణాలు ... 

తొలకరిగా పలకరింపులు చిలకగనే 
ఆపసోపాలు పోతూ అవని మాత 
పచ్చ తివాచీలు పరుచుకుని 
ఎనలేని ఆనందాలను పంచుతుంది ... 

పుష్కలమైన ఉప్పునీటిని సంగ్రహించినా 
పుష్కరిణి లాంటి మంచి నీటిని కురిపించి 
చెట్టూ పుట్టా గుట్టలకు హరితమయ్యి 
జీవరాశి మనుఁగడలకు నిత్య సంజీవినై నిలుచు .... 

నగునూరి రాజన్న 

ఆవిరి గీతం తేది: 26-05-2022 శీర్షిక : ఎన్నికల హామీలు

 ఆవిరి గీతం                    

తేది: 26-05-2022
శీర్షిక : ఎన్నికల హామీలు 
కవిత సంఖ్య : 910

రాజుల రోజులు పోయి రాజ్యాలు 
మారినా ... ప్రజాస్వామ్యం పేరిట 
ప్రజలే పాలకులయినా .... ఇంకా 
ఎదురు చూపులే అట్టడుగులకు .... 

యుగాలు దాటి పయనించినా... 
జగాన తేజమే రామ రాజ్యము ... 
కాదు పాలకులకు కనువిప్పు ... 
కలి మాయల పరదాలవల్లనేమో...  

వజ్రోత్సవాల వంతులో కూడా 
పస్తులుండి పూటలు మానేసి 
కుప్పలు పోసిన పన్నులన్నీ 
తిప్పళ్లకు సరిపోక... జోలెలతో 
అప్పుల సామ్రాజ్యాల ఆనవాళ్లే ... 

దగుల్బాజీ దాగుడుమూతల 
కుర్చీలాటలో...రంగులు మారుస్తున్న 
రాజకీయ పార్టీలన్నీ...కళ్ళు బైర్లు కమ్మే 
ఉత్తుత్తి హామీల ఊకదంపుడు మూటలతో ... 
బాకరాయుళ్ల  బతుకు చిత్రం .... 

సంక్షేమ పథకాలు... ఉపాధి హామీ 
పథకాలు .... నిరుద్యోగులకు భృతులు 
పేదలకు గేదెలు .... పెద్దలకు పెన్షన్లు 
ఆడవారికి చీరెలు ... పిల్లలకు పాలు .... 

అన్నీ ఇస్తారు కానీ విద్య వైద్యం 
అధికారం అందనీయరు ... 
ఆడవారికి అర్ధశాతం ఆరక్షణకు  
అనుమతులు రానివ్వరు... 
 
సప్త వర్ణాల సింగిడిలో ఎన్నికల 
హామీల పత్రాలన్నీ ఎగిసిపడే  
ఆర్భాటాలు చూస్తుంటే ..ఆవిరి గీతాలు 
ఆలపించడమే ....ప్రజల కింకర్తవ్యం.... 

నగునూరి రాజన్న 

హృదయాద్దాం తేది: 26-05-2022 శీర్షిక : సానుకూల వైఖరి ...

 హృదయాద్దాం

తేది: 26-05-2022
శీర్షిక :  సానుకూల వైఖరి ... 
కవిత సంఖ్య : 129+7

లెక్కలేనన్ని అనుభవాల సారం 
పక్కాగా పాటిస్తే అవదా సానుకూలం 
యథా ఆలోచనా విధానం 
తథా సమాజ ఆరోగ్య సూత్రం ..... 

సానుకూల వైఖరి పాటిస్తే 
పొరుగు క్షేమాలతో పాటు 
పొందు లాభాలు స్వయంగా   
సంఘమంతా సస్యశ్యామలమే .... 

పరుగెత్తి పాయసం తినేకన్నా 
నిలబడి నీళ్లు తాగడం మేలు .... 
ఒక్క క్షణం ఓపిక పడితే 
ఉపద్రవాలను అరికట్టవచ్చు ... 

శాంతం సహనం క్షమ 
శంక లేని ఆభరణాలు ... 
హేమం లా తణుకులీని 
మిల మిలల మెరిసిపోవు .... 

అందరు బాగుండాలి 
అందులో నేనుండాలి... 
నరనరాన అంతర్భాగమైన 
హైందవ సదాచారం .... 

అన్నపానీయాల అలవాట్లే 
మస్తిష్క తెరల మాయలు .... 
బుద్ది మంచి సద్ది కడితేనే  
ఆలోచనలు ఆచరణకోస్తాయి ..... 

హృదయ సాగరంలో 
ఉద్భవించే అలల సారమే 
ఉన్నత విలువలకు 
ఊతమవుతుందనేది నిజం .... 

నగునూరి రాజన్న 

అనాహత తేది: 25-05-2022 శీర్షిక : గురు బోధనలే ..

 అనాహత

తేది: 25-05-2022
శీర్షిక : గురు బోధనలే ... 
కవిత  సంఖ్య : 909

కలి మాయల ప్రభావమో 
కాల మహిమల ఫలితమో 
మర్కట ఛాయల దోషమో 
మత్తు నీడల పరిణామమో ... 

బాధల బోధనలు స్వయంగా
అనుభవిస్తూ కూడా ... 
పొరుగుల చీల్చి చెండాడే తత్వ 
సమాజంలో....అనాహత 
హృదయాలు కానరావేమో ....

సూక్ష్మంగానైనా గాయ మోక్షం 
పొందని మనిషి మనుగడ ఉండదేమో .... 
అయినా .... మలినాన్ని మనసుకు తీసుకోక 
మహిమాన్వితమై కమలంలా ఎదగాలి  .... 
 
హాలికుని స్వేదం చిందగానే 
చిత్తడి నేల కూడా చిగురించినట్టు 
మూలనున్న ముడి సరుకులు  
శిల్పి చేత మూర్తీభవించిన విధముగా  ... 
 
ఓటములైనా...గాయాలైనా... బాధలైనా ... 
గురుబోధనలుగా స్వీకరించగలిగితే 
విజయాలకు నిచ్చెనలై... దిగ్విజయ 
శిఖరాలను చేర్చగలవు .... 

నగునూరి రాజన్న 

ఆకాశాన జాబిల్లి తేది : 23-05-2022 శీర్షిక : అందమైన వెన్నెల పూవు

 ఆకాశాన జాబిల్లి 

తేది : 23-05-2022
శీర్షిక : అందమైన వెన్నెల పూవు 
కవిత సంఖ్య : 129+6

అమ్మ చంకనెక్కి ఆరున్నొక్క 
రాగమాపి ... అపురూపకంగా చూస్తూ  
అలకలు తీర్చుకున్న జాడలే ..... 
చిన్ని బొజ్జ నింపుకొనగ చిలిపి చంద్రుడే.... 

ఆలమందలు ఇంటికొచ్చే 
సమయానికి  వెన్నెల పూలు 
వెదజల్లి.. నిలువెల్లా పులకరింపజేసిన 
పుణ్యమూర్తి మన శశిధరుడు .... 

ఆదిదేవుని శిఖనలంకరించి 
అచ్యుతునికి అపనిందల సద్ది 
మూటలు కట్టి ... ఆధ్యాత్మికతల 
కథలనల్లుకున్న చల్లని దేవుడు ..... 

అతివల ముఖారవిందముల 
అలంకరణల పోలికలయ్యి ... 
కవన సేద్యపు కమతంలో 
కవుల కలాలకు చేయూతలినిస్తూ ....  
స్వాతి ముత్యమై సవరించుచుండె ..... 
          
శుక్లపక్షంలో వృద్ధి చెందుతూ 
బహుళ పక్షంలో క్షీణిస్తూ .... 
జీవన సమరంలో చీకటి వెలుగుల
చిద్విలాసములు సమమని సూచన గావిస్తూ .... 

ఋషులు కృషితో రాశిపోసిన 
విజ్ఞాన విరులనే వింతగా 
కాలగమనంలో అప్పుడప్పుడు 
మనిషి ఉన్నవాటిని వల్లెవేస్తూ.... 
ఆవిష్కరణలంటూ...కిరీటాలు 
అలంకరించుకుంటున్నారు ..... 

పాలపుంతల పుట్టు పూర్వోత్తరాలు 
నవగ్రహాల నడక నీడల గ్రహణాలు  
నక్షత్ర సూర్య చంద్రుల గమనాలు
కాల గమనాలకు అనుసందానించిన విధం .... 
అప్పుడప్పుడొచ్చే ఆ గ్రహణాల లెక్కలు .... 
అపురూపమైనవి ఎన్నెన్నో ..... 


నగునూరి రాజన్న 

ఎన్నీల ముచ్చట్లు తేది: 16-05-2022 శీర్షిక : అమ్మ తమ్ముడు

 ఎన్నీల ముచ్చట్లు

తేది: 16-05-2022
శీర్షిక : అమ్మ తమ్ముడు 
కవిత సంఖ్య : 902

అమ్మకు తమ్ముడైనందున 
అంతా తానయ్యే ఆదుకున్నాడు
అహోరాత్రులు కంటికి రెప్పలా 
అడుగడుగున మానవాళిని నాడు  ... 

బుద్ది నేర్వకముందు మనం 
బుక్కెడు బువ్వ తినాలన్నా .... 
అమ్మ సంకనెక్కి అల్లరి చేసినా 
చల్లని కాంతి దీవెనలిచ్చేది   .....   

పల్లె రాత్రులలో  మంచు పూల 
వర్షమై... ఆహ్లాదాలను పంచి 
ఆనందాలకు మూలమై ...లెక్కలేనన్ని 
జ్ఞాపకాల సంచులెన్నో నింపింది ..... 

నాగరికతల నడకల్లో తోడు నిలిచి 
కాల గమనాలను ఖచ్చితత్వంతో 
లెక్కగట్టి ...ముందు తరాలకు 
విజ్ఞానాల మూటలనందించింది  ... 

అమర ప్రేమికులకు ఆదరువై 
విరహ తాపాలను పెంచి పోషించినా ... 
కవికులానికి కలంలో సిరాయై 
కావ్య కన్యకలకు మూలమై.... వెండి 
తెరలలో వెలుగులీనింది ..... 

సాలెగూడు నెట్టింట్లో సాగిలబడినందున... 
పాల మీగడల పాయసంలాంటి  పండు వెన్నెల 
రుచుల జాడలు... కమ్మని కబుర్లు నేటి తరం 
పిల్లలకు సాంకేతికతల తెరల్లో కదలాడే 
గూగులమ్మ గుసగుసల కాకమ్మ కథల ముచ్చట్లే .... 

నగునూరి రాజన్న 

నేనో నెలవంకనౌతా తేది: 23-05-2022 శీర్షిక : అవును ... శశిని నేనే అవుతాను

 నేనో నెలవంకనౌతా

తేది: 23-05-2022
శీర్షిక : అవును ... శశిని నేనే అవుతాను 
కవిత సంఖ్య :907

సూదంటురాయి సూర్యుడు కేంద్రమై 
చుట్టూ తింపుకునే నాయక గ్రహాలకు  
పరివారమయ్యే వ్రాజక ఉపగ్రహాలతో 
ప్రకాశిస్తున్న నక్షత్ర వనంలో 
పరిణమించిన పలు పాలపుంతలు ..... 

కొలువ లేని అనంత విశ్వంలో వింతే 
కొలువైన మన పాలపుంత కొంత ... 
సౌరకుటుంబపు సూర్య చంద్రులు 
సుక్కలు నిండిన అంబర సంబరం ..... అన్నీ 

జీవమున్న ఏకైక జీవన సత్యం 
భూమి అన్నదే భువన మనోహరం 
విభిన్నమైన విశిష్ట వాతావరణంతో 
విరాజిల్లుతున్నది రాతిగ్రహమై ..... 

శక్తి వనంలో శర సంధానంలా 
నింగిన చెక్కిన కలువ భామలా 
మెరుగులు పెట్టిన నురగ కన్యలా 
తళతళలు కురిపించే వెండికొండలా  .... 

అవును అవకాశం చిక్కితే... 
అందమైన విశ్వంలో పొందుగా 
అమిరిపోయి కనువిందులు చేసే 
సుమ సుందరమైన షోడశ కళల 
నందనాల శశిని నేనే అవుతాను .... 

నగునూరి రాజన్న 

గేయం తేది: 22-05-2022 శీర్షిక : నిజం నిప్పు కణిక

 గేయం 

తేది: 22-05-2022
శీర్షిక : నిజం నిప్పు కణిక 
కవిత సంఖ్య : 129+5

ఉలుకెందుకు సోదరా 
ఉన్నమాటలన్నందుకే .... 

కదం తొక్కి స్వాతంత్య్రం 
కలివిడిగా  సాధించాం …
కలో గంజో కలిసి మెలిసి 
కాలం వెల్లదీద్దామనీ   .... 

కడివెడు కపటాలను 
కాలకూట విషంలా .... 
కంఠమందు బంధించి 
కబోదిగా నటించావే .. // ఉలు // 

చాపకిందనీరులా 
చదునుచేస్తూ వచ్చావు... 
చకోర పక్షులై నేడు
చర్నకోల ఝళిపిస్తే… 

సాంకేతిక  కూడలిలో 
సంధికాల సమయంలో...  
అరువదేండ్ల పాపాలను 
అవపోశన  పట్టగనే  ....  // ఉలు // 

శత విధాలా హతవిధిగా 
దశాబ్దాల చరితలే … 
జరిగిన ఫలితాలకు 
సాక్ష్యాలై నిలిచె నేడు....

ఆరు పదులు  అణిచినా 
అడియాసలే  ఆశలు  ... 
నిజం నిప్ప కణికేలనని 
నిరూపితం మరోసారి.....    // ఉలు // 

భౌతికంగా బాధలన్నీ 
భరించింది వాస్తవం  .... 
చరిత వార్తల చక్కర్లకే 
వశపడకుంటే ఎలాగ  .... 

కాలమెప్పుడు త్రాసులా
సరదాలు తీర్చును ..... 
కదిలికదిలి తనకుతానే
సరిచేసుకుంటుంది ....  // ఉలు // 

నగునూరి రాజన్న 

ప్రేమ గీతాలు తేదీ 21-05-2022 శీర్షిక : తొలి ప్రేమ

 ప్రేమ గీతాలు

తేదీ 21-05-2022
శీర్షిక : తొలి ప్రేమ 
కవిత సంఖ్య : 906

ఊహల్లో ఉదయించి 
గుండెల్లో నిదురించి .... 
కలలలోన తట్టి లేపి 
పులకింతలు పెట్టావు .... 

గాలిలోన ఈలవేసి 
గానంలా మారినావు .... 
సెలయేటి నీటిలోన 
సరిగమలై పాడినావు ....  

సుమముల పుప్పొడివై 
పరిమళాలు వెదజల్లి .... 
కమ్మని మాట కలిపి  
కోయిల పాటయ్యావు ... 

కనులలోన బింబమై 
కదలాడుచుండగా .... 
పెదవులేమో నీ పేరే  
వల్లె వేయుచున్నవి .... 

సుమధురాల సుందరమే 
తొలిపరిచయ కావ్యము....  
చెలి చూపుల చిక్కాలని 
చేసే ప్రతి ప్రయత్నము ..... 

గుప్పెడంత గుండెలో 
గూడు కట్టె  ప్రేమంతా ... 
ఏ రీతిగా వరసబెట్టి 
ఎరుకపరుచ నేనిపుడు .....  

నగునూరి రాజన్న 
కరినగరము 

కలల పడవలు తేది: 19-05-2022 శీర్షిక : ఆలోచనల అంకురాలు

 కలల పడవలు 

తేది: 19-05-2022
శీర్షిక :  ఆలోచనల అంకురాలు 
కవిత సంఖ్య : 905

పుట్టి పెరిగిన అలవాట్లో 
పరిసరాల ప్రభావమో 
పాలకుల వింత విధానాలో 
ప్రతివారికి కలలే లక్ష్యాలు 
గమన రీతులే గమ్యాల చేరిక  .... 

మట్టి పిసికిన చేతుల్లో 
మాయమౌతున్న పంట గింజలు  ... 
చెమట చుక్కల్లో తడిపి 
ఆరేసుకుంటున్న అంగ వస్త్రాలు.... 

స్వార్థ సరంగుల సారథ్యంలో 
రొమ్ము విరుచుకున్న దళారీల దండు... 
పంచభూతాలను పట్టి పీడిస్తూ 
పరిహాసాలు చేస్తుంటే ..... 

మరకత శోభలను మాయం 
చేస్తూ .... పుట్ట గుట్ట మట్టి  ఇసుకను 
కూడా విడవకుండా అంతర్జాతీయాల 
విఫణిలో వింతగా బేరాలౌతుంటే ... 

కనులు మూసినా తెరిచినా 
కలల ప్రపంచమే ఘోషిస్తున్నది ... 
నీటి అలలలా ... అతలాకుతలం 
చేసినా ... కలల పడవలలో మాత్రం 
కమ్మని ఆలోచనల అంకురాలు 
జీవం పోసుకుంటున్నాయి .... 

వారేం చేశారు .... వీరేం చేశారు .... 
కాకుండా .... మనమేం చేయగలమో 
నిజ నిర్ధారణలకు .... కలల పడవలే 
కమ్మని సోపానాలు ... గమ్యం చేర ..... 

నగునూరి రాజన్న 

ఆశాదీపాలు తేది: 18-05-2022 శీర్షిక : భరతభూమి ఆశాదీపాలే ...

 ఆశాదీపాలు 

తేది: 18-05-2022
శీర్షిక : భరతభూమి ఆశాదీపాలే ... 
కవిత సంఖ్య : 129+4

అనావృష్టితో అలమటించినా 
అతివృష్టితో చేతికందొచ్చిన 
పంట మట్టి కొట్టుకుపోయినా ....  
పదే పదే పలువిధాల ప్రకృతి 
కన్నెర్రజేసినా ... పాలకుల చేతిలో 
పావులుగా మారినా .... ఆశావాదిగా 
రుధిరం స్వేదం చేసుకుని... అందరి 
కడుపులు నింపే హాలికుడైనా .... 

కనిపెంచిన తల్లితండ్రులను ... 
కట్టుకున్న జీవిత భాగస్వామిని .... 
కన్న పిల్లలను కాలానికి వదిలి ... 
దేశ క్షేమమే ఉఛ్వాస నిశ్వాసలుగా 
ఊపిరి బిగపట్టుకున్న సైనికుడైనా .... 

అందలాలపై  కూర్చునే పాలకులైనా .
అందకుండ పనిచేసే అధికారులైనా ... 
ఢంకా బజాయించి రొమ్ము విరుచుకుని 
చెప్పగలిగే శారీరక శ్రమ వీరులైనా ... 

కాని కాలంలో ... కంటకమైన 
సూక్ష్మక్రిమితో ... బతుకు పందెముపై 
భారమిడి .... పోరాడిన సగటు జీవులను .... 
జీవిత కాలపు సంపాదనలు 
ధారపోయించుకున్న ... ధవళ వస్త్ర 
ధారులైనా ..... 

బింకముగా చదువులు వెలగబెట్టి 
బొంకుటయే మా నిత్యకృత్యమంటూ 
న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టిన 
నిలువెల్లా నల్ల గౌనుల న్యాయపతులైనా .... 
అందరూ మన భరతభూమి ఆశాదీపాలే .... 

నగునూరి రాజన్న 

దారి దీపాలు తేది: 18-05-2022 శీర్షిక : శిఖర దీపకాంతులు

 దారి దీపాలు

తేది: 18-05-2022
శీర్షిక : శిఖర దీపకాంతులు
కవిత సంఖ్య : 904

స్వార్థాల కుబుసం విడిచి 
సమస్తం సదా బాగుండాలనే  
తపన చిత్తంతో జపం చేసే 
మనసున్న మంచి మారాజులు ..... 

బడుగుల బలహీనుల పక్షమై 
అన్యాయపు అడుగులను నిలువరించి 
అక్రమాల గొంతుకలను ఎదిరించి 
న్యాయ దేవతగా  నడినెత్తిన బోనం 
ఎత్తుకుని నడక సాగించే వారు ...... 

ఎదుటివారి కష్టాలకు చలించి  
ఎగబడి సదా సాయాలు చేస్తూ ..... 
పక్కవారి నష్టాలను పరామర్శించి 
నిత్యం నివారణల లేపనాలద్దేవారు ..... 

బంధు ప్రీతిని బందుకు జరిపి 
తమ పర బేధములు ఎరుగక 
స్థితప్రజ్ఞతల స్థిర చిత్తములతో 
చిత్తగించే హృదయ పీఠం ఉన్నవాళ్లు ..... 

ఉత్తరాలకు ఊగిపోకుండా ... 
దక్షిణలకు ఎగిరిపడకుండా ... 
విజ్ఞానాల వెలుగుల విశ్వంలో 
నిర్భయాల నిర్ణయాలకు నిలువెత్తు 
సాక్ష్యాలయ్యే శిఖర దీపకాంతులు .... 

నగునూరి రాజన్న 

గెలుపు గమనం తేది :17-05-2022 శీర్షిక : సమన్వయాల సంతులనం

గెలుపు గమనం

తేది :17-05-2022
శీర్షిక : సమన్వయాల సంతులనం 
కవిత సంఖ్య : 903

సమస్యల సంచులు కుమ్మరించి 
పరిష్కారాల తాళం చెవి వెదికి 
సత్య శోధనలో నిత్యం మునిగాక 
నిరుత్సాహల నీలి నీడలను తరమవచ్చు .... 

మేధో మదనాల రాశులు పోసి 
ప్రాధాన్యతలకు పట్టం కట్టి 
ఎంపికల జాడలు తెలుసుకుని 
ప్రణాళికల పర్వం రచించడం 
ఒక ఎత్తయితే .... 

గెలుపుల గమ్యపు శిఖరం చేరాలంటే ...
ఇష్టంతో పూనుకుని కష్టాలన్నీ 
అధిగమిస్తూ ... వినమ్రంగా కృషితో 
అడుగుల కదిలిస్తే  ....గెలుపు గమనమే .... 

కంచె గడ్డిలో కాలి నడక బాటలా 
నడుస్తూ పోతూంటే... దానికదే  
దారి పడినట్టుగా...పట్టుదలలే 
పెట్టుబడిగా సాగిపోతే చిక్కదా ... 

గానుగలో గరిటెడు నూనె 
దక్కాలంటే ......శ్రమ విజ్ఞానాల 
జోడు గుర్రాలను సమన్వయాల సంతులన 
పరిస్తే ... చిక్కదా చక్కని ఫలితం .... 

నిండుగ పండిన చెట్టులా ... 
ఎత్తుకు ఎదిగినకొలదీ... ఒదిగి 
ఒదిగి...వినమ్రతలను చిరునామాగా 
చేసుకుంటే...వింతగా గెలుపు మన చెంతనే.....

అప్పుడప్పుడు పలకరించే వైఫల్యాల 
రుచులను కూడా .... వైవిధ్యతల 
జోడింపులతో విజ్ఞాన ఖనులమన్న 
నామధేయం సార్థకమయ్యే విధంగా...
విజయాల నిచ్చెనలుగా మలుచుకోవాలి .....  


నగునూరి రాజన్న