Sunday, September 5, 2021

చిత్ర కవిత. 25-07-2021

 చిత్ర కవిత. 


కాడెద్దుల ఘనపు  కారులోన
కల్మషమెరుగని చిరునగవులు..
కాలుష్య భూతపు నీడలు వదలని 
కారండోయి కమ్మని పయనం ..... 

జోడు గిత్తల కోడె లయలు 
ఊయలూగే మధురోహలు 
ఉన్నఫలంగా సాదా మనిషికి 
ఉన్నతంగ కారెక్కిన సంబరాలు ..... 

పాత కొత్తల మేళవింపుల
పసందైన రవాణా సాధనం 
కాణీ  ఖర్చులేని ఇంధనం 
ఉన్నదానిలోనే పొందే ఆనందం... 

పన్ను పోటు అధికారుల పైత్యాలు 
అనుమతుల జాబితాల అక్కరలు
మధ్యవర్తుల జోరు బడాయిలు
ప్రమాద భీమాల భరోసా ముచ్చట్లు
జరిమానాల చిక్కు జంజాటములు 
మచ్చుకైనా అక్కరలేని మొక్కుబడి .... 

మేధో మదనపు మెరుగులు 
జీవిత సత్యపు నడకలు 
పల్లె పట్నపు కలబోత పరుగులు 
కల్లా కపటమెరుగని కానుకలు .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

చిత్రకవిత: 27-12-2020 శీర్షిక : నండూరి ఎంకి ( village ladies were in search of firewood in a jungle )

  చిత్రకవిత: 27-12-2020

శీర్షిక : నండూరి ఎంకి 
సంఖ్య : 68

చీరకట్టులోన చిందించే అందం 
తెలుగు తల్లికెంతో శోభాయమానం 
నండూరి ఎంకిలా కట్టు బొట్టూ 
నగ నట్రా నాటి ఆరోగ్యసంకేతం.......  

సామూహికానికి సంకేతముగ నిలిచి 
సాగి కదిలేరు సాటి పడతులంతా 
తాగు నీరయినా పోగు కట్టెలయినా 
సాంప్రదాయరీతినా సన్నుతించి ....

కాల మానములకు కంగుతిన్న 
కట్టె పుల్లలను కడుశ్రద్దగా కూడేసి 
వంట చెఱుకులగ వారు ఉపయోగించ
తోడూనీడగా ఒకరికొకరు మోపుగా బంధించి 
కాపు కాసిన పర్యావరణ పరిరక్షకులు వారు... 

ఇచ్చిపుచ్చుకును ధోరణిలో 
ఇలను కనము మనము 
ఇంతులను మించిన గొప్ప 
సహకారవంతులను ....... 

బరువు బాధ్యతల లోన  సైతం
బతుకు తీపిని నింపె మగువలు
సమఉజ్జీలని సాటి చెప్పిరి 
మగనికి దీటుగా తెగువలు చూపి...  

నగునూరి రాజన్న
కరినగరము.

చిత్ర కవిత colour ful rangoli

 చిత్ర కవిత 

సా స సంఖ్య  : 65
శీర్షిక : హరివిల్లు.... 

ఆవు పేడల కల్లాపి జల్లి
ఆకాశ నక్షత్రాలను అలవోకగ 
అవనిపై దించి అందాలను పేర్చే
అనంత నైపుణ్యాల అతివల నేర్పరి.... 

అందమైన రంగుల హరివిల్లు
అలరించే హంగుల విరిజల్లు
బిందువులు మొగ్గల సోయగం
అందంగా బిగించిన కేంద్ర పద్మం 
అల్లిబిల్లి తీగల్లో అలరించే 
కుసుమ మనోహరం.... 

శుచి శుభ్రతలకు నెలవయ్యే
సప్త వర్ణాల సుమ సంగమం 
సుందర దృశ్యాల విరిబోణి 
సుమధుర తేనియల సుందరం.... 

పడతుల హస్తవాసి పదనిసలు
పండగలు పబ్బాలకు ప్రతిబింబం 
సంప్రదాయ ఆస్తుల సరంజామ
మనిషి మనసుకు సంకేతం..

మచ్చలేని చందమామల సాదృశ్యం 
మనోల్లాస గీతికల మాలా చంద్రిక
సరససల్లాపాల సందళ్ళ సంక్రాంతి 
పల్లె పట్టులో నేటికి ప్రతిబింబించే ఘట్టం ....

నగునూరి రాజన్న
కరినగరము. 

పదాలతో కవిత Dt. తేది:23.07.2021

 :పదాలతో కవిత

శీర్షిక: కకావికలమై…. 
కవిత సంఖ్య: 713

*అతలాకుతం-కుండపోత
*భయం-కన్నీరు
*జలదిగ్భంధనం

ఋతువులు మారుతూ 
బతుకులిచ్చే కాలపురుషుడు
తొలకరితో ప్రారంభమయి 
తొట్రుపడుతూ అడుగులేసినా 
ప్రకృతి పచ్చదనాల తోటను మాత్రం
పదిలంగా కాపాడి వసివాడనీయలే…

ఉన్నట్టుండి ఉడుకుమోతుగా  
ఆలోచించాడేమో...కుండపోతగా 
వర్షించి సాంతం ముంచెత్తగానే..  
*అతలాకుతలమయిన* జనమంతా 
బిక్కు బిక్కుమంటూ *భయం*గుప్పిట
చిక్కి బతుకు చేత పట్టుకున్నరు….. 

కుండపోత వర్షాలకు కుదేలయిన
కూలినాలి పేద బీద బిక్కీలు…
గుడ్డి గుడిశెల్లో గూత పెట్టెటోల్లు…
కాలువగట్టున నివసించెటోల్లు…
*కన్నీరు* మున్నీరై కకావికలమై 
*జలదిగ్బంధనములో* చిక్కుకున్న జనం 
మానవత్వపు జాడల చిరునామాలకై
 చకోర పక్షుల్లా ఎదురుచూపులయిపోయె…. 

నగునూరి రాజన్న
కరినగరము. 

దాశరథీ తేది : 22-07-2021

 దాశరథీ 

తేది : 22-07-2021
శీర్షిక : కరుణాపయోనిధీ 
కవిత సంఖ్య : 712

విప్లవాల గడ్డ తెలంగాణ బిడ్డ 
ఓరుగల్లు వాడి కాకతీయ వేడి 
కావ్యాల కర్త కరుణాపయోనిధి
దాపరికమెరుగని దయానిధీ … 

బడుగులన్న ఒడువని ప్రేమ 
బడబాగ్నుల విరజిమ్మిన కోట 
భావ ప్రేరేపిత ప్రసంగాల తోట 
జైలు గోడలు కవితల నింపినావట ..... 

అగ్నిధార రుద్రవీణలు 
అలవోకగ  అందించి 
మార్పే నా తీర్పని 
ఘంటాపథమైనావు ..... 

తిమిరంతో సమరానికి 
సైతం సై అన్నావు 
నిరంకుశాలు నిర్జీవమైతే 
నేత్ర పర్వం పొందావు ..... 

వెండి తెరల జాడల్లో 
దండి దొరగ నిలిచావు 
లెక్కలేనన్ని రివార్డులు 
లెక్కకుమించి అవార్డులు... 

ఉత్తేజపు గీతాలతో 
ఉరుకులు పెట్టించావు 
తెలంగాణా సాధనలో 
రథసారథివే అయినావు .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

చిత్ర కవిత తేది: 17-07-2021

 చిత్ర కవిత 

తేది: 17-07-2021
కవిత సంఖ్య: 37

చిత్రకారుని కలయో 
కలిమాయల భ్రమయో 
అల్లన రెక్కలార్చిన తీరు
అదుముకున్న తరువు …. 

స్వార్థమెరుగని సరంగు ప్రకృతి 
సావాసం చేసినా ఒంటబట్టని వైనం 
నాగరికతల నడకలో అడుగులేస్తూ 
చెట్టు చేమల చెరబట్టి పబ్బం గడుపుకుని .... 

దశాబ్దాల నుండి పిండి పిప్పి చేస్తూ
మోడు మీద నేడు ప్రేమలొలుక బోసి
పుండు మీద కారం చల్లిన చందం
కాటికి పాడెగా మారే మోడు పై కూడా స్వారీ…. 

జీవరాశిలోకెల్లా బుద్ధికల వాణ్ణని 
సుద్దులెన్నో చెప్పే మిధ్య బతుకుల 
వాక్చతురుడు ఎక్కి తొక్కి కూడా  
మొక్కుతున్నట్టు ఫోసులోపక్క  .... 

గౌరవించాల్సిన తరువును 
మన తీరు మారనంత వరకు 
కాలుష్యమంటు చెప్పే కల్లబొల్లి 
కబుర్లన్నీ ఉత్తుత్తి హుష్ కాకీలే ..... 

నగునూరి రాజన్న
కరినగరము 

చిత్ర కవిత 20 తేది: 19:07:2021 శీర్షిక : యువత తిప్పలు

 చిత్ర కవిత 20 

తేది: 19:07:2021
శీర్షిక : యువత తిప్పలు 
కవిత సంఖ్య : 710

పాలకుల పాచికలన్నీ యువత 
చుట్టే తిప్పి వలేసి ఉప్పు చేపలు
పట్టి ఉద్యమాలు చక్కబెట్టుకుని 
వాళ్ళ ఉద్యోగాలు వెలగబెట్టుకున్నారు... 

మధ్య తరగతి మిధ్య బతుకులకు 
ఉన్న పదో పరకో ఊర్చిపెట్టే విధంగా
ఉపాయాంగ ప్రవేటు విద్యాలయాలను
ఉసిగొలిపి... ఉన్నదంతా ఊర్చేదాకా 
ఊరుకునేది లేదంటూ…. ఊదరగట్టి
ఊడపెరుక్కుంటున్నారు….ఊసరవెళ్ళి
పెట్టుబడిదారు నాయకులు… 

పథకాల పేరుజెప్పి పతారాల   
పబ్బం గడుపుకునే పాలకులు 
ఉపాధి విషయాల ఊసులన్నీ 
హుష్ కాకి చేసేసి ఉసురు తీస్తుంటే….

డిగ్రీల మీద డిగ్రీలు; పీ జి లతో
కలల ప్రపంచాలన్నీ కళ్ళముందే 
కబళిస్తున్న కలికాలపు అధికార
గణాలపై కన్నెర్రజేసి కవాతు జరిపి 
కదంతొక్కుతుండె యువత ఉద్యమాల బాటలో … 

పిక్కటిల్లే ఉద్యమ నాదాలను 
ఉక్కుపాదాలనైనా అణగదొక్కాలన్న
తిక్క ఆలోచనల ప్రభుతలతో
తప్పని తిప్పలాయె యువతకు…. 

నగునూరి రాజన్న
కరినగరము. 

సమన్వయం తేది: 18-07-2021

 సమన్వయం

తేది: 18-07-2021
శీర్షిక : సంఘ జీవనం. 
కవిత సంఖ్య:  145

సంఘములో జీవనమంటేనే 
సమన్వయాల సంపుటాలు 
విభిన్న మనస్తత్వాల విదుర 
నీతులే సమన్వయాల సర్వ కేంద్రం..... 

ఇల్లైనా వాడైనా ఊరైనా దేశమైనా
ఐదు వేళ్ళు కలిసి  అన్నం నోట్లో
పెట్టిన చందంగా  సమన్వయం
చేసుకుంటేనే  సరదా సంతోషాలు ..... 

పండగైనా పబ్బమైనా దండిగా 
నిండుగా సాగిపోవాలంటే
అనేకవిషయాల అనుసంధానమే 
సమన్వయ సంకేతం కాదా ..... 

ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలకైనా 
యుద్ధరంగములో శస్త్రాలను
సంధించుటకైనా అనుభవజ్ఞుల 
అవలీలలతలే అమూల్యమైన 
అనుసంధానతలు ..... 

రైతన్నల యవుసమైనా
రచయితల కావ్యమైనా
కాలాలను కలుపుకుని 
కాల్పనికతలు మేళవిస్తూ
సమన్వయం చేసుకుంటేనే 
సరైన ప్రతిఫలాల పంట పండుతుంది …. 

గుండుసూది తయారునుండి
కొండతొలుచు యంత్రాలవరకు
అడుగడుగున విడమరుస్తూ
అప్రమత్తమై నిర్వర్తించడమే
సమన్వయాల సంకేతము ….. 

ప్రభుత్వాలైనా పరిశ్రమలైనా 
చేసినవి చేసేవి చేయబోయేవి 
గతానుభవాల పరిచక్రంలో 
అనుభవైక సలహాల సమీక్షలతో 
సమన్వయము చేసుకుంటే మున్ముందు
విజయాల వినీలాకాశమే కద.... 

నగునూరి రాజన్న
కరినగరము

నటి సౌందర్య తేది: 18-07-2021

 నటి సౌందర్య

తేది: 18-07-2021
కవిత సంఖ్య: 38
శీర్షిక : అమాయకత్వపు చిరునామా

అచ్చ తెలుగు అమ్మాయిలా
అందిపుచ్చుకున్నది టాలీవుడ్
అమాయకత్వం నిండిన అందం
అపురూపమై జీవించే నటనం ....
ఆమె సొంతం ...

అసలు పేరు సౌమ్య అయినా
వెండితెరల జాడల్లో  సౌందర్యగా
అనతికాలంలోనే అందుకుంది
అత్యున్నత  నటనా పురస్కారాలు .....

సంస్కృతీ సంప్రదాయాల
నిలువెత్తు రూపం ...హద్దులు దాటని
నటనలతో అందరి మనసులు
చూరగొన్న అనితర నట శిఖామణి ...

అనేక భాషల్లో నటించి మెప్పించి
నవరసాలను అలవోకగా పండించి
సహజ నటి సావిత్రిగారికి  వారసురాలై
పేరు ప్రఖ్యాతులు పొందిన  దిట్ట.....

పౌరాణికం ...సాంఘికం ...జానపదం....
చారిత్రకం ...హాస్య ప్రియం... శృంగారం ....
సందేశాత్మకం....  చిత్రమేదైనా
చిత్రంగా ఒదిగిపోయే పుత్తడి బొమ్మ .....

కరుణ రసమును కళ్ళల్లో పలికించి
ప్రేక్షకుల  కరిగించి... కంట తడి పెట్టించి..
కమనీయపు దృశ్యాలతో .... వారి గుండెల్లో
నిలిచిపోయిన  నట విదుషీమణి.....

నగునూరి రాజన్న
కరినగరము

జానపద గేయం తేది: 17-07-2021

 జానపద గేయం

తేది: 17-07-2021
శీర్షిక : రాములోరి జాతర
కవిత సంఖ్య: 709

రాయే  రాయే  నా చిన్నాదానా
రాములోరి జాతరకు మనమెల్దామే

ఇగురంగ మెప్పించి
ఇంటికాడ జెప్పించి
ఇల్లందకుంట జాతరకు
మనమెల్దామే  మనమెల్దామే  ... //రాయే//

రాములోర్ని  దర్శించి 
దండిగ  మొక్కుకుందాం 
దారి చూపించమంటూ 
దయతోడ వేడుకుందాము .....   // రాయే //  
 
కళ్యాణం మనం జూసి
కనికరించుమందామె 
కారప్పూస తినిపించి 
కాఫీనీళ్ళు తాపిస్తా.... //రాయే//

రథం చుట్టు మనం తిరిగి
రాములోర్ని కోరుకుందాం
రబ్బరు గాజుల్ని వేయిస్తా 
రంగుల రిబ్బన్లు కొనియిస్తా....  //రాయే//

జాతరంత తిరుగుదాం 
జనశోభను చూద్దాము   
బత్తీసలు కొని ఇచ్చి 
బర్ఫీలను తినిపిస్తా ....   //రాయే//

రాట్నాన్ని ఎక్కుదాం
పట్నమంత చూడొచ్చు 
మళ్లొచ్చే జాతరకు
మనువాడి వద్దామే .... //రాయే//

నగునూరి రాజన్న
కరినగరము

వెండి జాబిల్లి సాక్షిగా తేది: 15-07-2021

 వెండి జాబిల్లి సాక్షిగా

తేది: 15-07-2021
శీర్షిక : పండు వెన్నెలలు ....
కవిత సంఖ్య: 708

శిశిరంలో తలలు వాల్చిన తరువులా
కృష్ణ పక్షములో క్రమంగా క్షీణించినా
వసంతంలో వనమంతా  చిగిర్చినట్టు
శుక్ల పక్షంలో దినదినాభి వృద్ధితో
నిండు పౌర్ణమి అందాలను ఆరబోసుకుని
పండు వెన్నెలలను విశ్వమంతా పంచుతుంది .....
వెండి జాబిల్లి .....

స్వయం ప్రకాశితుడు కాలేకపోయినా
గ్రీష్మ తాపాలను తాను భరిస్తూనే
వరుసకు మనకు మామయ్యయినా
వంతుకు మాత్రం తల్లిలా ఎప్పుడూ
అమృతాలనే కురిపిస్తాడు

ఆత్మీయతల జల్లులు కురిపించే
ఆకాశ పందిరి నీడలలో శశి వెలుగుల
జాడలలో అమ్మమ్మగారింట అనుభవించిన
సాయం సామూహిక భోజనాల మధురిమలు
జీవితానికి సరిపడే ఆనందాలను మిగిల్చింది.....

కాలుష్యాల కబంధహస్తాలలో
విశ్వం చిక్కుముడి పడ్డాక
దండి గొలిపిన నిండు పౌర్ణమిల
వెండి వెలుగుల జాడల వెదుకులాటలాయె  .....

నగునూరి రాజన్న
కరినగరము

చెరువు తేది :07-09-2018

 చెరువు

తేది  :07-09-2018
శీర్షిక : ఊరుమ్మడి బతుకు
సంఖ్య : 51

స్వాగతాల తోరణమే మా ఊరి చెరువు .
జోరు వానలందుకుంటే పడువాటుకు నిండు. 
మత్తడి దునికిందంటే చిన్నపాటి జలపాతమే.
చెరువు నిండిందంటే ఊరు ఊరంతా పండగే.
చేతి వృత్తు లందరికి చెల్లి పోవు కష్టాలు.

పిల్లా పాపలందరికి  సంబరాల అంబరం. 
ఈతలకు ఊతమిచ్చే ఆటలకు నెలవు.
భూగర్భ జలం పెరిగి బావులకు బలం.
ఊరందరి బట్టలకు ఉతుకు రేవు నిజం.
సాగు నీటి కష్టాలు సాదరంగ తీరు.

ఒడి నిండిన అమ్మలా అందమైన చేపలకు
అలవికాని బెకబెకల గోండ్రు కప్ప కుప్పలకు
జర జర పాకి జడుపు పెట్టె వాన పాములకు
అప్పుడప్పుడు కనిపించే తాబేలు భామలకు
ఆలవాలమౌతుంది జలచరాలకు జీవనాధారం.

అలల సవ్వడులతో  ఆనందాలను పంచు. 
నడి మధ్యన తుమ్మలపై వాలే  కొంగల గుంపులు
తెల్ల పూల పెద్ద బతుకమ్మను తలపించు. 
పశు పక్ష్యాదుల కిల కిలలతో  పరవశాలనిచ్చు.
పచ్చ తివాచీ పరిచినట్టు పల్లె పరవశించు.

చెరువు లేని ఊరు ఉందంటే అచ్చెరువే!
గొలుసుకట్టు చెరువులు వరదపోటు నివారించు.
ఒక ఊరి పడువాటు పక్కూరు చెరువు నిండు .
మానవ మేధస్సుకు మణిహారపు మచ్చుతునకలు.

ఎండాకాలమొచ్చిందంటే నెర్రెలతో విర్రవీగు.
ఒండ్రు మట్టి వరి చేలకు నింపు చేవ.
ఎండిన తుమ్మకాయ  గొఱ్ఱెమేక ఆహారం.

పిల్లల ఈతలకు   ఊరందరికీ మెతుకు
పశువుల స్నానాలకు
మత్తడి దునికితే మనసుకు 
ఎక్కడ లేని ఆనందం.... 

చేపలకు కొదువలేదు
వరదలకు అడ్డుకట్ట
తాగు నీరు  సాగు నీరు    
కుల మత బేధాలు లేవు.... 

బతుకమ్మలను  వేసేది   
గొలుసుకట్టు ఒక ఊరి పడువాటుతో 
ఇంకో ఊరు చెరువు నిండు... 

ఎండాకాలం వస్తే తుమ్మ కాయకు 
గొర్రె మేకకు భోజనం - 
ఒండ్రు మట్టి పంటపొలాలకు
చాకలికి బట్టలుతుకే కేంద్రం...

ఒండ్రు మట్టి ఒంటికి తలంటుకు  స్నానాలకు
ఆషాడం శ్రావణం  నిండితే రెండు పంటలు
ఊరి బావులకు నీటి ఆధారం  భూగర్భ జలాలు పెంచు
కప్పలు తాబేళ్లు నీటి పాములకు నిలయాలు
చేరువేలేని పల్లె లేదంటే నమ్మం... 

ముందు చూపు మనిషి విజ్ఞానానికి మచ్చు  తునక
చెరువు నిండిందంటే  వడ్లకమ్మరోళ్లకు వడి కలిగిన గిరాకీ .
సుంకరన్నకు తమాం పని  తూము నిగురాని కోసం


Nagunuri Rajanna   Presnetly at RICHMOND,USA
Retd.Dy.Mgr(F)
NTPC Rdm
Karimnagar

ఆషాఢం తేదీ : 14-07-2021

 ఆషాఢం

తేదీ : 14-07-2021
శీర్షిక: అంతా శ్రేష్ఠమే....
కవిత సంఖ్య : 144

గ్రీష్మ జ్వాలల సెగలకు ఆవిరైన
సంద్రపు నీరు అల్లన కదిలి చల్లని
గాలులకు కొండవాలులకు భువిపైన
చేరి చిరు జల్లులు కురిపించి భూదేవి
మేనును చల్లబరుచు కాలం .....

ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి పోయి
ఉత్తమ పురుషోత్తముడు పాలసంద్రంపై
యోగ  నిద్రకుపక్రమించ.... జోరుగా
వానలందుకుని పడువాట్లకు చెరువులు
కుంటలు నిండి మత్తళ్లు దూకే పుణ్యకాలం...

ఒడినిండిన అమ్మలా ... చెరువులన్నీ
అందమైన మీనములకు ...బెకబెకల
గోండ్రు కప్పలకు....జరాజరా పాకి జడుపు
పుట్టించే వాన పాములకు ... అపురూప
దర్శనాల  కూర్మములకు... జీవాధారమౌ
జలచరములన్నింటికి .....రైతన్నకు పండగే

అవని యాత్రలో దక్షిణాయనం ప్రారంభమై...
తొలి ఏకాదశి గురుపౌర్ణమి పర్వదినములు...
జగన్నాథ రథ యాత్రలతో ...అమ్మవారి బోనాలతో
శాకాంబరీ అలంకారాలతో ఆధ్యాత్మిక శోభలన్ని
కలగలిపి అల్లుకున్నదే ఆషాడ మాసం .....

సదా తొలివాయనం మహిళామణులకంటూ
ఎండలకని ఉపశమనాలో... కొత్తనీటి వల్ల
కలిగే కలుషితాలను కొంత మట్టుబెట్టనో ....
అలంకారాలతో గోరింటల పంటలతో
కళకళలాడు ఆడవారి చేతులు...

అన్ని శుభాలనే  సంకేతించినా ...
సంప్రదాయాల చిరునామాలో మాత్రం
కొత్త దంపతులకు కొంత విరహమే...
ఎడబాటుల వియోగాలతో .....

నగునూరి రాజన్న

అసలుకన్నా వడ్డీ ముద్దు తేది: 14-07-2021

 అసలుకన్నా వడ్డీ ముద్దు

తేది: 14-07-2021
శీర్షిక :  మానవ నైజం
కవిత సంఖ్య: 708

కష్టాల కొలిమిలో కాకలు తీరి
కన్న పిల్లలను కంటికి రెప్పలా
అల్లారు ముద్దు చేసి పెంచినా
తీరని ఆనందాల ఆమని ......

భారాలెన్నో మోసి మోసి
బాటసారులై పోతున్న తరుణాన
బోసినవ్వుల పౌత్రులను చూడంగానే
ఎక్కడ లేని జవసత్వాలే ...ఆనందాలే ...

వెండి తీగల జలతారు వయసులో
ముదిమి వయసు మీదపడినా
వెన్నెముకలు జారిపోయి వంగిపోయినా
చల్ చల్ గుర్రమై చలాకీలు ఆడుకుంటాయి ....

కంటి చూపులు కానరాక మందగించినా....
కర్ణ భేరీలు సన్నగిల్లి వినలేకపోయినా
ఒంట్లో శక్తి సత్తువలు సన్నగిల్లినా
చిన్ననాటి చిలిపి కథలన్నీ గుర్తు చేసుకుంటాయి ....

నాగరికతల నడకలలో మానవ
జీవితాలన్నీ మానవత్వాలను
మరిచి పోయి  ఆర్థికత్వాలను
మూటకట్టుకుని ఊరేగుతున్నాయి ....

పట్టి పట్టి బేరమాడే నిత్య
భుక్తం కూరగాయాలనుండి
పట్నపు కార్పొరేట్ మాల్స్ లలో
ఒకటి కొంటె రెండవది ఫ్రీ దాకా ...
మానవ నైజాలకు ప్రతిబింబాలే ....

నగునూరి రాజన్న
కరినగరము

సమయస్ఫూర్తి తేది : 13-07-2021

 సమయస్ఫూర్తి

తేది : 13-07-2021
కవిత సంఖ్య : 143
శీర్షిక : చతురత

నిత్య జీవన పయనంలో చిన్నా 
పెద్ద సమస్యల సుడిగుండాలు
చుట్టుముడుతూ ...

అలవోకగా సాగాల్సిన జీవన నౌకా యానం
అల్లకల్లోల కుదుపులతో అతలా
కుతలం చేస్తూ అనుభవ పాఠాలను 
మనకందిస్తుంది  ..... 

అనుభవ పాఠాలను వల్లె వేసుకుని
సవాళ్ల పరిష్కారానికి అవరోధపు
బురదలను గుర్తించి సవ్యమైన
ఆయుధాలను సంధించుకుంటూ...

కంటకాల  అడ్డంకులను అధిగమిస్తూ
జయాల జండాలను ఎత్తుకొని ముద్దాడాలని
ప్రతి పనికొక  పంథాను పాటిస్తూ
మనిషి మనిషికో మడతను ఎరగా వేస్తూ
పరిస్థితుల స్థితి గతులననుసరించి....

ఆలోచనల అన్వేషణలలో ఎప్పటికప్పుడు
సరికొత్త ఎత్తులు రచిస్తూ.... మారుస్తూ ...
కొత్త కొత్త దారులను ఎన్నుకుంటూ ...
కోరి వెదుకుతూంటాము  చతురతతో  ......

అయినను అప్పుడప్పుడు 
అపజయాలు పలకరించి
చుట్టాలలా తిష్ట వేసుకున్నా
వెరవక సమయస్ఫూర్తి ప్రదర్శించాలి ....

నగునూరి రాజన్న
కరినగరము

అలుపు లేని వలపు రాగం తేది: 13-07-2021

 అలుపు లేని వలపు రాగం 

తేది: 13-07-2021
శీర్షిక : సంపూర్ణత్వం…. 
కవిత సంఖ్య: 707

సంప్రదాయాల సందుగలో నుండి 
కుమ్మరించుకున్న జ్ఞాపకాల ఆనవాళ్లకు
అప్పుడే నాలుగు దశాబ్దాల కాలమంటే
నమ్మలేని నాజూకైన నిజమనిపిస్తోంది…. 

ముందే తెల్సిన సంబంధమైనా
నిటారైన జొన్నకంకిని జిరాఫీ తిన్నట్టు
స్వయంగా కాళ్ళపై నిలిచి తలెత్తుకున్నాకనే
మూడుముళ్ళ బంధమై బలపడింది….. 

అంగరంగ వైభవంగ ఏర్పరుచుకున్న 
పచ్చని పందిరిలో  అమ్మానాన్నలు 
బంధు మిత్రుల బలగంతో పొందిన
అప్రతిహతమైన ఆశీర్వచనాల బలమో ఏమో
 సతత హరితపు తరువులా చివుళ్ళేసింది…..

వీనుల విందైన సన్నాయి వారి 
బాజా భజంత్రీల నాద బలమో 
వాక్శుద్ది కల వేద బ్రాహ్మణ పండితుల
వేదమంత్రాల సమరస సారమో పిల్ల
శాఖలతో విస్తరించింది …. 

అప్పుడప్పుడు అలకల నలకలు చేరినా
అంతా హుష్ కాకి అయిపోతూనే 
చిలకా గోరింకలై… కేరింతల పర్వములో
సయ్యాటల సందళ్ళు చేరి అలకలు తీర్చుతయి…. 

సద్యోగం విశ్రాంతమయ్యేసరికి 
సరాగాల తోటలోకి వచ్చిన 
వసంతాల కోకిల గానంలా 
సదా చెంత చేరిన బంధమెంతో  
సంపూర్ణత్వాన్ని సంతరించుకున్నది ….

నగునూరి రాజన్న
కరినగరము. 

సంగీత సౌరభాలు తేది: 13-07-2021

 సంగీత సౌరభాలు 

తేది: 13-07-2021
శీర్షిక: అనంత విశ్వం…. 
కవిత సంఖ్య: 36

ఆస్వాదించే మనసుండాలి గాని 
అణువణువు రాగం పొదిగిన భరిణె 
అల్లన వీచే గాలి తరంగం ఓ రాగమే
అనంత విశ్వమే విశాల సంగీత సౌరభం… 

పచ్చికలో పడి లేచే లేడికూన పరుగులు 
పారేటి సెలయేటి నీటి సవ్వడులు 
ఉదయాత్పూర్వపు పక్షుల కిలకిలా రవములు
చిటపట చినుకుల సయ్యాటలు 
మనసును మురిపించే ఏ సవ్వడైనా…… 

తరువున వీచేటి పవన వీచికలు 
అడివిన రాలేటి ఎండుటాకులు 
వసంతంలో మ్రోగేటి కోయిల రాగాలు 
ఎదను కదిలించే ఏ శబ్దమైనా….. 

పంచభూతాలే వీనుల విందైన 
సరిగమల రాగాలు మ్రోగించగా
పశుపక్ష్యాదులు శుకపికములు
పదనిసల రాగాలు ఆలపించగా….. 

అమృతమయమైన అమ్మ లాలి పాట 
ఆనందాలమూలమైన చెలియ మాట 
బోసినవ్వుల చిన్నారి మారామం 
చెవులకింపయ్యే చెప్పలేని భావనలు.... 

ప్రశాంత చిత్తం కురిపించే 
పరిమళ నిర్మల స్వభావం 
స్వరం నిండిన సర్వం 
సాగర సంగీత సౌరభాలే……. 

నగునూరి రాజన్న
కరినగరము.   

చిత్ర కవిత తేది: 09-07-2021 ( formers market vegitables )

 చిత్ర కవిత 

తేది: 09-07-2021
శీర్షిక : రైతు బతుకు 
కవిత సంఖ్య : 35

బార్టర్ బతుకుల కాలం నుండి 
బండి లాగుతున్న పల్లె సంత 
కాల మార్పులతో కదిలిపోతున్న 
కాలం చెల్లిన ఆత్మీయతల సంత ... 

ఒకప్పుడు చుట్టూ పది ఊర్లకు 
ఉపయోగపడే ఊరి సంత .... 
నేడది పట్టణాలకు పాకినా 
పల్లెనుండి సరుకులొస్తేనే... 

దమ్మిడీకి కొరగాని దళారులకు 
కొని అమ్మితే చాలు లాభాలే లాభాలు ... 
చేతినిండా పని.. జేబునిండా డబ్బు ... 
రైతు కష్టం దండగ  ... వినియోగదారు 
కడుపు నింపదు .... 

కార్మికులు రక్తం చిందించి 
చమట చుక్కలు కారిస్తే వచ్చిన 
వస్తువు ... రంగు కాగితాలు కప్పుకుని 
వాతానుకూల యంత్రాల ముంగిళ్ళలో  
వస్తువుల  ధరలు నింగిలో ఉంటాయి .... 

కాయ కష్టం చేసి కడుపు నింపే 
రైతన్న పంటలు ఎండా వానలకు 
తడుస్తూ... ఎతలన్నీ జత చేసుకుని 
ఎక్కిరింపులు ....పరిహాసాల పందిరే  కిందనే  .... 

కపట పాలకులెప్పుడు  కరుణిస్తారో 
మద్దతు ధరల మాట నీళ్ల మూటలు 
ఎండా , వాన  చలి  ఏదైనా సరే .... 
రైతు బతుకెప్పుడూ  దిన దిన గండమే...... 
 
రాజుల రోజులు పోయి రాజ్యాలు 
మారినా .... దండుకునే దళారీలదే 
పైచేయి ఏనాడైనా .... నోముకున్నోడి 
ప్రసాదం నోచుకున్నోడు తిన్నట్టు ....  

నగునూరి రాజన్న 
కరినగరము 

పాపాల చిట్టా తేది: 12-07-2021

 పాపాల చిట్టా 

తేది: 12-07-2021
శీర్షిక:   కాలనాగు పుట్ట
కవిత సంఖ్య: 142 

యథా రాజా తథా ప్రజ అన్నట్టు 
మంచితనమెప్పుడు జలాధారలా 
పైనుండి కిందకు ప్రవహిస్తేనే 
సవ్యదిశగా సఫలీకృతమౌతుంది.... 

ఒకప్పుడు యుగము పేరులోనే 
పొదువుకున్న సత్యం…కంటికి 
నల్లపూసై మసి పూసి మారేడులను
చేస్తూ మాయలు సృష్టిస్తూ ఇంద్రజాలం 
చేస్తూ హరివిల్లు భ్రమలను పంచుతున్నది.... 

యుగ ధర్మమో కాలమహిమములో 
ధర్మం ఒంటికాలుపైన కుంటుతున్నది
ప్రతివాడు చిన్నదో పెద్దదో పొరపాట్లు
తప్పులు…చేస్తూనే కాలం వెళ్లదీస్తున్నారు.... 

కాలానుగుణంగా రాజ్యాలు మారినా 
పాలనలు పతనమౌతూ నలుగురికి 
పంచాల్సిన న్యాయం నవ్వుతున్నది 
అర్థ బలం అంగబలం  చేతిలో బందీ అయి .... 

మత్త గజములలాంటి అధికార 
మదపుటేనుగుల పాదాలకింద 
నలిగిపోతూ మంచితనం నిత్యం రోదిస్తూ 
సామాన్య మానవ గొంతుకై ఆక్రోశిస్తుంది…. 

పాపాల చిట్టా కాలనాగు పుట్టలా 
పెరిగి మేరుపర్వతమై దాని నీడలో 
మానవత్వం కనుమరుగై గుడ్డి కాలం 
చెడ్డ రోజుల దివిటీలో ఒంటి కన్ను 
రాక్షసుడై ఓండ్ర పెట్టి గాండ్రిస్తుంది.... 


నగునూరి రాజన్న
కరినగరము. 

విఘ్నేశ్వర హారతి

 1.

శ్రీ శంభు తనయునకు
సిద్ది గణనాథునకు
వాసి గల దేవతా
వంద్యునకు స్థిరముగా
జయ మంగళం
నిత్య శుభ మంగళమ్ ....

ఆ సరస విద్యలకు
ఆది గురువైనట్టి
భూసురోత్తమ
లోక పూజ్యునకును  // జయ //

ఓ బొజ్జ గణపయ్య
ఓర్పుతో రక్షించు
కాచి మమ్మేలుమయ్యా
కరుణ తొడ
                           // జయ //
పంచామృతముల నిన్ను
అభిషేకింతుము
పానకము వడపప్పు
పర్వమున నీకు
                          // జయ //
పత్రి పూలతో నిన్ను
పదిలమై గొలుతు
పనస మామిడి
దానిమ్మ ఖర్జూరాలతో
                        // జయ //


2.

మంగళమని  మంగళమని
మంగళ మనరే
మంగళమని పాడరే
మన గణనాథునికి
శుభ మంగళమని పాడరే
మన గణనాథునికి  (2)

ముత్యాల హారతులు
ముదితలివ్వరే
మూషికా వాహనునికి
ముచ్చటతోను      // శుభ//

కరి వదన సదనునికి
శాంతి మంగళమ్
గిరిసుత ప్రియ తనయునికి
దివ్య మంగళమ్    // శుభ //

సిద్ది బుద్ది ప్రదాయునికి
ప్రసిద్ధ మంగళమ్
సదా శివుని కీర్తునకు
సర్వ మంగళమ్     // శుభ //

వాణీ వాణీ వందనమమ్మా

 వాణీ వాణీ వందనమమ్మా

నిరతము నీ కృప కావలెనమ్మా

పదములు సరిగా పలుకుటకైనా
చదువుల సారం తెలుయుటకైనా
పనిలో దైవం చూచుటకైనా
పదుగురి మనసులు గెలుచుటకైనా
                                             // వాణీ //
కవులకు కలములు కదులుటకైనా
సరిగమపదనిస  సాగుటకైనా
వేదశాస్త్రములరయుటకైనా
భగవత్ ధ్యానం తెలియుటకైనా
                                        // వాణీ //
మనసున మొహం వదులుటకైనా
మదిలో దీపం వెలుగుటకైనా
పదుగురి క్షేమం కోరుటకైనా
విశ్వ శాంతిని చేరుటకైనా
                                  // వాణీ //   

సుక్కల ముగ్గు తేది: 12-07-2020

 సుక్కల ముగ్గు                  

తేది: 12-07-2020
శీర్షిక : శుచి శుభ్రతలు ....
సంఖ్య : 706

ముగ్గులన్నీ ముదితల ప్రత్యేక  కళలే...
మురిపములన్నీ తీర్చుకొనంగ
అంగ రంగ వైభవమ్ముగా  అవనిని
అలంకరించే రంగు రంగుల రంగవల్లులు
సుందరంగ పొంగి పొర్లే హరివిల్లులు....

అంబరాన్ని చుంబించిన
తారకాలను అలవోకగా దించి
అవనిపైన అలంకరించు ప్రతి దినం
అతివలంతా ఉదయాత్పూర్వమే .....

క్రిమి కీటకాలు దరి చేరకుండ
ఇంటి చుట్టూ పంచితంతో
కళ్ళాపి చల్లి... మల్లె తోటలా
ఎల్ల తీర్చి దిద్దెదరు తెల్ల ముగ్గులతో ......

సంప్రదాయపు సరంగులెన్నో
సన్మార్గపు దారుల్లో నడిపించ
శుచి శుభ్రతలే ప్రాణప్రదమని
ఆరోగ్య సూత్రములని గుర్తించిన
మన ఆర్యుల మార్గదర్శనంలో ...... ..

ఉత్తరాయణ పుణ్య కాలంనుండి
ప్రత్యేకముగా ఋతువు మార్పులో
బతుకు తీర్చి దిద్దుకొనంగ  కొంత
సమయం సూర్య సంధ్యలో గడపడానికి ....

దినకరుణ్ణి ఆహ్వానిస్తూ అతివలంతా చేరి
అలికి ముగ్గులు పెట్టు వాకిళ్ళ నిండా
ముఖ్యంగా సంక్రాంతి సొగసులు సక్కంగ
వెలుగులీన సంప్రదాయమై శోభించు .....

నగునూరి రాజన్న
కరినగరము

బాలల గేయం తేది: 10-07-2020

 బాలల గేయం                         

తేది: 10-07-2020
శీర్షిక : మాతృభాషపై మమకారం 
సంఖ్య : 705

రారండోయి రారండోయి 
బాలల్లారా విన రండోయి 

వరసపెట్టి మన తెలుగు  
వర్ణమాలను వల్లె వేయండి 
అచ్చులు హల్లులు 
పొల్లుపోకుండ
మీరు నేర్వండి  .... //రార//

అచ్చుల్లోన పొట్టి పొడుగుల 
విడిగా  గుర్తించండి 
హల్లుల్లోన కలివిడైన
సరళ  పరుషముల
పలుకుట నేర్వండి..... // రార//

గుణింతాలనే గణించి మీరు
గమ్మత్తులనే  చూడండి
ద్విత్తము సంయుక్తములను 
దివ్యంగా గుర్తెరగండి …. //రార//

భవితను శాశించే 
భావి పౌరులు మీరండి 
ముద్దు ముద్దుగా 
తెలుగును మీరు హత్తుకోండి   // రార//
 
ప్రాచీనతలే  పదిలపరిచి  
పరవశాలనే పొందండి      
పర భాషల మోజులో పడి 
మాతృభాషను మరవద్దండి.    // రార//

నగునూరి రాజన్న 
కరినగరము 

సూక్తి కవిత తేది : 10-07-2021

 కొన్నిసార్లు మనసులో ఉండే బాధను 

మాటల్లో చెప్పలేం, అలా అని కనబడేలా 
ఏడవలేం . మనకి మనమే మనలో మనం 
బాధపడుతూ బ్రతికేయడమే జీవితం ..... 
******************************************
అంశం : సూక్తి కవిత 
తేది : 10-07-2021
శీర్షిక : జన సామాన్యుడు .... 
కవిత సంఖ్య : 141

ఏ మనిషికైనా జీవితమెప్పుడు 
మకరందపు పూల తోట కాదు
ఓడలు బండ్లయి .. బండ్లు ఓడలై 
బతుకు చిత్రా లవుతుంటాయి ... 

కాలమేదైనా అన్నివేళలా జీవనం 
రాజధానివైపున్న రహదారి కాజాలదు 
ముళ్ళు రాళ్లు నిండిన పల్లె బాటలో   
భవిష్యత్తు తెలియని అడవిబాటలో  .... 

గుండె ధైర్యం మెండుగా నింపుకుని 
కొండ లోయల ఎత్తుపల్లాలు దాటి 
చల్లని సెలయేటి సవ్వడుల నీరు తాగి 
పిల్ల తెమ్మెర పరిమళాలను ఘ్రాణించాలి ..... 

చిన్నా పెద్ద పనులకు లంచాలీయలేక 
అధికార మదగజాల పాదాల కింద 
అల్పుడన్న సామాన్యుడు నలిగే ప్రతిక్షణం ... 
అనుభవించే నరక యాతనాలివే.... 
 
ఆక్రోశించే మనసున్నా ...అంగబలం ... 
అర్ధబలం  సామూహికం సహకరించక 
పేదవాడి కోపం పెదవికి చేటులా .... 
కరి మింగిన వెలగపండై ... అంతా గప్చుపే ....  

నగునూరి రాజన్న 
కరినగరము 

చిత్రకవిత తేది : 02-07-2021

 చిత్రకవిత

తేది : 02-07-2021
శీర్షిక : పల్లె తల్లి
కవిత సంఖ్య : 34

నాగరికతల నడకలలో యువత
అడుగులు తడబడుతుంటే 
రాజకీయపు రంగుల కోలాటంలో 
పల్లె నీడన బతుకులు  భారమాయె... 

చేతి వృత్తులు మాయమై పోయి
యువత బ్రతుకు చిత్రాలు... ఛిద్రమై 
పట్నపు చత్తుల కింద  పది గజాల
గదులలో కాపలా బంట్లుగా  మారె ...

మాతృ గడ్డపై మమతలు వీడని
పెద్దమనుషులు మాత్రం ఇంకా
చేతులు కాల్చుకుంటూ  కాలం
వెళ్లదీస్తూ శివుని ఆజ్ఞకై వేచుచుండె ...

వట్టి పోయిన పాడి పశువులాంటి
పాటి గాని పాలకుల మాటలు
కడుపు నింపవు సరి కదా ... కనీసం
కంటి వెలుగులు ఇంటికందనీయవు ….

కాంతి నిండుకున్న గదిలోకి
నేనున్నానంటూ పలుకరిస్తున్న
దినకరుని వెలుగులో దివ్యంగా
అవ్వ బువ్వ వండుకొనుచుండె 
ఆత్మ స్థైర్యంగా కట్టెలపొయ్యి పై ....

నగునూరి రాజన్న
కరినగరము

చిత్ర కవిత. తేది: 28-06-2021

 ప్రత్యేక కవిత    చిత్ర కవిత. 

తేది: 28-06-2021
శీర్షిక: మట్టి మనిషి 
కవిత సంఖ్య : 139

కనుముక్కు తీరుతో కళ్ళకు కట్టి 
కరుణా రసమ్మును కళ్ళలో ఒలికించి 
కారుణ్య మూర్తిగా కళనంతా  వంపి 
కట్టిపడేసెనా మనను కణికట్టుగా .... శిల్పి 

అనుభవాలు ఉట్టిపడుతున్న  
ఆలోచనల అంతరంగం 
అనంతమైన మేథో మధనంతో 
విచారమయమైన వదనం ..... 

మట్టిముద్దలకు ప్రాణంపోసే 
విధాతకు ధీటుగా మెరుగులద్ది                    
పాప బొమ్మకు రూపమిచ్చిన శిల్పి 
నైపుణ్యము అనన్యం అమేయం ..... 

కరోనా కాలపు చదువులకా ?
సంఘంలో సన్నుతించే వివక్షలకా ? 
ఆగమ్యగోచరమౌతున్న ఆలి బతుకులకా ? 
బాదర బందీ లేని భావిజీవితానికా ?

ప్రశ్నేదైనా .... పరికించవల్సిన విషయమే.... 
ప్రజా జీవితంలో ప్రమదకు దక్కుతున్న 
ఫలితాలే ...ప్రశ్నలై వేధిస్తుండెనా పాపకు .... 
ప్రతివారు ప్రశ్నిచుకోవాలంటూ .... 
మృణ్మయ మౌని వ్రతం ...... 

నగునూరి  రాజన్న 
కరినగరము 

పదాల కవిత తేది: 09-07-2021

 పదాల కవిత 

తేది: 09-07-2021
శీర్షిక: ఆశావహం… 
కవిత సంఖ్య: 704 

పదాలు :  అవకాశాలు, సరిలేరు
సహానుభూతి, మానవత్వం
ఆత్మస్థైర్యం, ప్రేరణ,పంచుదాం


అందిపుచ్చుకోవాలె గానీ 
ఆత్మస్థైర్యం గుండెల నిండా వంపుకుని
అనంతమైన ఆశావహములే…అవకాశములే…
విజ్ఞులెప్పుడు వీగిపోరు విర్రవీగరు
అవకాశాలను సృష్టించుకుంటారు…. 

మనో పరిమిత చట్రంలో బందీ కాకుండ
మానవత్వ పరిమళాలు వెదజల్లితే 
జీవన గెలుపు బాట చేరదా..నీ ముంగిట
వాలదా.. సరిలేరు నీకెవరటంచు…

అప్పుడప్పుడు అపజయాలు 
పలకరించినా.. సహానుభూతుల 
భయాల నీడల జాడలు వదిలి…
పట్టుదలలే  మెండైన పెట్టుబడిగా… 
కృషి ప్రయత్నాల సాగు నువు చేస్తే… 

మంచితనపు మరువ దమనాల 
పరిమళాలను మనమే వెదజల్లి 
ప్రేరణలై పెన్నిధిగా నిలుద్దాం…. 
భారతీయ సంప్రదాయ సుగంధాలను
పంచుదాం సౌభ్రాతృత్వపు ఛాయలు నింపి… 

నగునూరి రాజన్న
కరినగరము 

వారసత్వం 2 18-02-2020

 వారసత్వం 2 

18-02-2020

నరుడే వానర రూపాంతరమని 
నాటి రాతి యుగం చీకటి మయమని 
చక్రంతోనే జీవనగతి మారిందని .... 
ఆటవికం ....ఆధునికానికి మారినా..... 
అంతా గడచిన చరిత్రే  అయినా .... 
మంచి చెడుల సమాహారమే మన వారసత్వం....
మననం చేసుకుంటే... మిత్రమా !

అడుగు తీసి అడుగు వేస్తూ .... 
అంతరిక్షం దాకా చేరుకున్నా..... 
అప్పుడప్పుడు ఆలోచన చెలిమెల నీళ్లు 
తోడుకుని  గొంతు తడుపు కోవాలనిపిస్తుంది.... 

పచ్చి మాంసాల  ఫలహారాలు వద్దని  
యాదృచ్ఛికమై కాలెనో …. కాల్చి…. 
వండి వార్చుకునే....పద్ధతి మార్చుకున్నా ....
వడివడిగ అడుగులేసారేమో .... కొంతమంది
 
వడపోతల వస్త్రగాయితాన వశపరచుకోను 
అవపోశన పట్టిన ఆరోగ్యాల అచ్చట్ల ముచ్చట్ల
పరుగు లంఘించి....ఫక్తు శాకాహారులైనారేమో....

మత్తు పానీయాల చిత్తడి నుండి ....  
పనిగట్టుకుని పట్టు తప్పించుకుని 
పలాయనం చిత్తగించారేమో...నచ్చనోల్లు ....

ఒడ్డు పొడుగులోన ఒక్క పోలిక లేవు 
ముద్ద నోటికందించుటలో ఒద్దికనే  కదా ! 
ఐదు వేళ్ళు మనకున్న చేతులవి .... 
ఐక్యత చాటే కదా ఆ క్షణమున ..... 

తారతమ్యముల తన్నులాటలన్నీ 
తప్పక అవగతమౌను కదా..... 
మనసుబెట్టి చదివితె  మన చిన్ననాటి   
మూడు చేపల కథ ముచ్చటగా..... 

అంటు ముట్లన్న ఆరాటమైతేనేమి 
ఆలింగనాల ఎంగిల్ల  వివక్షలైతేనేమి 
అంటూ వ్యాధుల మూలాలనెరిగి….
అమలు పరిచారేమో విజ్ఞులార్యులు 
ఆమోద మోదమున ....నాటి వ్యవస్థలు.  

వానరాల నాటి వాగు వంకలు....  
చెట్లు పుట్టలు కొండా కోనలు...... 
వాసాలన్నీ మార్చుకుని….వారెవ్వా యనగ

గుహలు డేరాలు గుడారాలు గుడిసెలు.... 
ఇగురమైన ఇళ్ళు వాకిళ్లుగ.....  
అందమైన లోగిళ్లుగా 
అలంకరించుకోలేదా .... 
రేపటి రూపం…రూపు మార్ప ..... కష్ట జీవులు 

చోరుని జూసిన శునకం భౌ భౌ మనంగ   
నమ్మకమున వెంట నడచు నడిరేయైనా... 
తక్కిన కుక్కలు బహుదూరమునుండైనా.... 
గ్రామసింహం పాటి జ్ఞానం గాదె 
మనుజుని నడవడి మహిలో ఎంచగ .... 




నగునూరి రాజన్న 
కరీంనగర్

నేను తను తేదీ :08-07-2021

 నేను  తను

తేదీ :08-07-2021
శీర్షిక : నేను తను ...ఒకటే....
కవిత సంఖ్య :703

అర్థ జీవితం అలవోకగా దాటేసినా
అలనాటి జ్ఞాపకాల దొంతరలు
తడుముకుంటుంటే  మనసంతా
మలయ మారుతాల వసంతమే.....

అమ్మింటి బందమేనని  ఆరు
వసంతాల నుండే ఇంటిల్లిపాది
ఇరకాటపు మాటలంటుంటే
మధురమైన ఊహల పొద...నాతో
పాటే పెరిగి పెద్దదయింది ....

నేనే తానుగా .... తానే నేనుగా ...
ఆలోచనల ఇంద్రధనుస్సులతో
అపురూపంగా మలుచుకున్న ఊహల
శిల్పం స్పృశిస్తూ సంవత్సరాలు
రోజులుగా... రోజులు క్షణాలుగా కదులుతూ ....
స్వంత కాళ్లపై నిలబడేదాకా ఎదురు
చూస్తూ కాలం  ఎలా గడిచిందో తెలియలేదు .....

ఆ అందమైన కాలములోనే
ఈ కలివిడి భావనల పరంపర
ఓ అద్వితీయ కానుకలా  అండగా
నిలిచి అడుగులు వేయించింది .....

శివునాజ్ఞ లేనిదే చీమయినా
కదలదన్నట్టు ఒక మంచి
బ్రహ్మ ముహూర్తమున నేను
తానుగా .... తాను నేనుగా ...
ఒక్కటయ్యే మనువు ముడివేసింది ......

నగునూరి రాజన్న
కరినగరము

మళ్ళీమళ్ళీపుడతా తేది: 07-07-2021

 మళ్ళీమళ్ళీపుడతా

తేది: 07-07-2021
శీర్షిక :మాటిచ్చి చెబుతున్నా
సంఖ్య :

మాటిచ్చి చెబుతున్నా
మళ్ళీ మళ్ళీ పుడతానని ...
మమతల తావి మా అమ్మ కడుపున
చదువుల తల్లి  అపర సరస్వతీ దేవి ఒడిన

వేద పురాణేతిహాసాల వటవృక్ష
ఛాయలలో  సేదలు దీరుతూ
రామాయణ మహాభారత సతత
హరిత కావ్యాల శ్వాసలు పీల్చుతూ ....
బంగరు తల్లి ఈ భారతమ్మ గడ్డపైన ....

అత్యంత పురాతమైన చరిత్రల
ఆధార దారాల పతంగుల నీడన
నాలుగు యుగాల బంగారు చరిత్రల
ఛత్రము కలిగిన భరత ఖండమున ....

పంచభూతాలను పట్టినా ముట్టినా
పబ్బతి పట్టే విలువల సంస్కృతి
నీడలలో.... ప్రకృతే పరమ పవిత్రమని
నమ్మే సుగుణ సంపన్నమైన సంస్కృతి
ఛాయలలో .....

ముక్కోటి దేవతల చల్లని దీవెనలతో
పూర్వీకుల పరమ పవిత్రమైన
ఆశీర్వచనములతో మళ్ళీ మళ్ళీ
పుడతానని ఆశిస్తూ అశ్వాసిస్తూ ....

నగునూరి రాజన్న
కరినగరము

సందిగ్ధ సంధ్య 2 తేదీ :07-07-2021

 సందిగ్ధ సంధ్య 2

తేదీ :07-07-2021
శీర్షిక : తొలి ... మలి సంధ్యలు

నాడయినా నేడయినా ఏనాడైనా
అన్నీ ముత్యపు సంద్రాల ముద్దులే
అందరూ పగడపు వసంతాల దీవులే
అందరికీ అందరూ కొంగు బంగారపు 
కొండలే .... 

కలిమి లేనినాడు కడుపుకింత 
తినిపించి  కళ్ళల్లో ప్రేమను కురిపిస్తే…
కలిమి బలిమిలు పెరిగాక కానివాటికి 
కూడా కాసులు కుమ్మరించి చేతులు 
దులుపుకుంటూ…. 

కలికాలపు ఛాయలలో కాసులవేటకై
సమయ సమర శంఖాలు మ్రోగిస్తూ 
కన్న ప్రేమను కాసుల కొలమానం చేసి 
కాలరాస్తూ కరాళ నృత్యాలు చేస్తూంటే…. 

కనుచూపు మేర అంతా వారేనన్న అత్యాశల
ముత్యములేరుకుంటూ అడుగులేస్తున్న
ఆశల గొడుగుల అమ్మానాన్నలకు రెక్కలొచ్చి
వలసలతో గొలుసులు తెంపుకుని ...

అండదండలవ్వాల్సిన ముదిమి వేళలలో
ఖండ పరిసరాలను దండిగా దాటుకుని
పిండాల వేలకు పక్షుల్లా తిరిగొస్తుంటే
తొలి సంధ్యల లాలనలన్నీ మలి సంధ్యల 
వాన ప్రస్థాన సంధిగ్దమేగా .....

నగునూరి రాజన్న
కరినగరము

సందిగ్ధ సంధ్య తేదీ :06-07-2021

 సందిగ్ధ సంధ్య

తేదీ :06-07-2021
శీర్షిక : తొలి ... మలి సంధ్యలు
కవిత సంఖ్య :702

కలుషితాల విశ్వాన ....
అల్లన మేఘాలలో తొంగిన
నయన ముగ్ద మనోహరమైన
ఉదయ భానుని తొలి సంధ్యల
భూపాళం ...
పరవశాల పక్షుల కిలకిలా రవములు..
సాయం మలి సంధ్యల సరాగం ....  

పచ్చని తరువుల పైర గాలుల వీవనలు
ప్రశాంత నిష్కల్మష వాతావరణ శ్వాసలు
వినసొంపైన పశు సంపదల పోలికేకలు
ముందు ముందు పొత్తములో తప్ప మురిపాలు
మచ్చుకైనా కానరాని జాడలసంధింగ్ధాలే  ....

ఉరుకుల పరుగుల ప్రపంచంలో
ఉమ్మడి కుటుంబాల ఉనికిని
మరచిన స్వార్థాల మానవలోకం ....
ప్రేమ గుడ్డిదన్న చందంగా పిల్లలే
తమ లోకమనే వింత ప్రవర్తనలు .....

కష్ట సుఖాల కావడులను కనపడనీయక
కాళ్లకు మట్టి అన్నదే అంటనీయకుండ
కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటూ
కన్న పిల్లలను మభ్య పెడుతూ ....

అంతా వారేనన్న అత్యాశల
ముత్యములేరుకుంటూ అడుగులేస్తున్న
ఆశల గొడుగుల అమ్మానాన్నలకు
వలసలతో గొలుసులు తెంపుకుని ...

అండదండలవ్వాల్సిన వేళలో
ఖండ పరిసరాలను దాటుకుని
పిండాల వేలకు తిరిగొస్తుంటే
మలి సంధ్యల వాన ప్రస్థమంతా
సంధిగ్దమేగా .....

నగునూరి రాజన్న
కరినగరము

జీవన పయనం తేది : 02-07-2021

 జీవన పయనం

తేది : 02-07-2021
శీర్షిక :సాగిన పయనమంతా....
కవిత సంఖ్య : 140

ఆకులలములు కట్టుకు తిన్నా
రాతి పనిముట్లతో రాజ్యమేలినా 
లోహపు పనిముట్లతో  లొట్టలేసినా
మానవాళి జీవన పయనం సాగి పోయింది ...

నాగరికతల నీడల్లో నడిచినా
రవాణా సౌకర్యం పెంచుకున్నా 
సమయాలను కుదించుకున్నా
పరుగు మాత్రం ఆపలేదు .....

పారిశ్రామికతలతో  పాకులాడినా
అభివృద్ధిలో అందలమెక్కినా
ఆకాశయానం ప్రారంభించినా
మనిషి పయనం సాగుతూనే ఉంది...

సాంకేతికతల సొబగులద్దుకుని
విశ్వ విశేషాల సమాహారం
అరచేతిలో ఆటపట్టయిన వేళ 
మరమనిషి పయన సాగుతూనే ఉంది ....

ఏది ఏమైనా ...
భూమి గుండ్రమన్నంత ముచ్చటగా
కంటికి కనపడని క్రిమి నీడను
చూసి జడుసుకున్న విశ్వం
ఒక్కసారి .... ఒళ్ళు జళ్ళుమంది ....
మడి కట్టుకుని ఓ మూల కూర్చోబెట్టింది ....
సాగిన పయనమంతా సేద దీరమన్నది ...

నగునూరి రాజన్న
కరినగరము

నాన్నకు ప్రేమతో తేది : 02-07-2021

 నాన్నకు  ప్రేమతో

తేది : 02-07-2021
శీర్షిక : అడుగు జాడల్లో ముక్తి ...

గుండెల నిండా ప్రేమలు గుంభనపరిచి
కళ్ళ కదలికలలో మాత్రమే కనపరుస్తూ
పాయసం పొంగనీయని పాత్ర అంచుల్లా
కంటికి రెప్పొలే  సదా కాపాడేవాడు  .....

కను చూపు మేర వెలుగు కాంతులు  పరిచి
రక్షణ వలయములో క్షేమంగా బంధించి
బాధ్యతల బస్తాలు  తన నెత్తికెత్తుకుని
బరువులు మోసే ఉత్తి అమాయకుడు ....

క్రమశిక్షణల కరుకు బెత్తములను
అమ్మ ఝుళిపిస్తే... కంటి సైగల ద్వారా
కరుణామృతం పొంగించి బాధలు
మరిచిపోయే .. సేదలు దీర్చేవాడు .....

అనన్యమైన తన నడకలతో నడతలతో
మాకందరికి మార్గదర్శనం చేస్తూనే
అందరి మనసులు చూరగొనుడే  కాకుండా
పూర్తి శతాబ్దమైనా...  అయన కొడుకులుగా
నేటికీ లెక్కలేని గౌరవాలే దక్కు మాకు ప్రతిచోటా.....

ఇంతకన్నా ఇంకా కోరేదేమిటి
ఆయన అడుగుజాడల్లో నడిచి
ముందుతరానికి మార్గదర్శం
కాగలిగితే మాకు ముక్తి లభించినట్లే.....

నగునూరి రాజన్న
కరినగరము

క్షత గాత్రం తేదీ :01-07-2021

 క్షత గాత్రం

తేదీ :01-07-2021
శీర్షిక : గాయాలు ....
కవిత సంఖ్య : 701

ఒకటా ... రెండా... తొమ్మిది నెలలు
తిన్నది తాగింది నిలవకపోయినా
అడుగేస్తే ఆయాస పడుతూ
అలవికాని నొప్పుల భరింపే
ఆత్మీయతలు చాటే అమ్మతనం...

ఆపసోపాలు పడే ఆవగింజయినా
అంకురమై నిలవాలంటే
నీళ్లు తాగి ... నీలిగి...ఉబ్బి ... పొట్ట
చీల్చుకుంటేనే  బట్టబయిలయ్యేది
పశు పక్ష్యాదులనుండి తనను తాను
కాపుడుకుంటేనే తరువై పంట పండేది.....

లెక్క లేనన్ని అడుగుల ఎత్తులో
లెక్క తప్పే వ్యత్యాసాల ఉష్ణోగ్రతలలో
పక్కలో బల్లాల్లాంటి కరుడు గట్టిన
శత్రుమూకలు.. ఉగ్రవాదుల ఉచుల్లోంచి
తప్పుకుంటూ తమను తాము రక్షించుకుంటూ
మనకూ రక్షణల  నిస్తారు.....

ఊది చీది ఛీత్కరించినా
గునపాల గుచ్చి గుల్ల బార్చినా
కర్రు నాగళ్ళ కడతేర్చినా
డైనమైట్లు పెట్టి పొట్ట చీల్చినా
డ్రిల్లింగుల రంధ్రాలేసి ధాతువులు
లాగినా .... జీవరాశి పొట్టనింప
నిత్యం అగ్నిహోత్రమౌతుంది
ఓర్పు నేర్పుల నా అవనితల్లి ....

నగునూరి రాజన్న
కరినగరము

కల్యాణ తిలకం తేదీ : 30-06-2021

 కల్యాణ తిలకం

తేదీ : 30-06-2021
శీర్షిక : సత్సంప్రదాయం ...
కవిత సంఖ్య : 33

కట్టు బొట్టుల కమనీయం
కళాత్మకమైన శుభ సూచకం
కనుబొమల నడుమ కాంతివలయం
కనికట్టుగ  కట్టిపడేసే హైందవం...

తిలకం ..కుంకుమల  తీరొక్క రకం
ఒక్కొక్క బొట్టు ఒక్కో ప్రత్యేకం
దృష్టి అరిష్టాలకు  విరుగుడంటూ
వెల్లివిరిసిన ఆచార సంప్రదాయం .....

సవ్య దిశన సంఘపురోభివృద్ధికై
నిలిచే సత్సంతాన వ్యవస్థార్థం...
ఉత్తమ ఉపనిషత్తుల ఉపయుక్తమైన
సమంత్రీక పెళ్లి తంతులో వెలిసిన
ముప్పదారు పెళ్లి ముచ్చట్ల
మురిపాల పట్టికలో మున్ముందటి
తతంగమే పెళ్లి అలంకరణలు .....

మంగళ స్నానాల ఘట్టములతో
చీని పట్టు పీతాంబరముల ధరింపజేసి
కాళ్లకు పారాణి కమనీయం చేసి
కల్యాణ తిలకాల దిద్దుబాటులతో
సుందర మెహందీ అలంకరణలతో 
కనులకు కాటుక చెక్కిలిపై దిష్టి చుక్క ...

బాసికముల బందనములతో
ఉట్టిపడే పట్టు పీతాంబరాలతో ...
స్వర్ణ నవరత్న ఖచిత ఆభరణాలతో
నాజూకు అలంకరణలు నాసికా కర్ణముల...

వరుడు వధువులు విశిష్టములై నిలువ
సంస్కృతీ సంప్రదాయ సంపదల
సంస్కరింపబడటమే... ప్రధానమై
ఆయురారోగ్యముల భోగమే అవనిలో
మేలైన భాగ్యమై నిలిచె .....

నగునూరి రాజన్న
కరినగరము

అల్లుకున్న ఆశాలతలు తేదీ : 30-06-2021

 అల్లుకున్న ఆశాలతలు

తేదీ : 30-06-2021
శీర్షిక : అందమైన వాహ్యాలి
కవిత సంఖ్య : 700

అంశపు ఛాయలలో తచ్చాడగానే
ఆలోచనలన్నీ బాల్యపు గుమ్మంలో
పారాడి... పురివిప్పిన ఆశాలతలై
అల్లుకున్నవి నా తనువంతా ......

పుట్టి బుద్దెరిగిన నాటినుండి
పురుడు పోసుకున్న ఊసులన్నీ
మట్టితో పెనవేసుకున్న బంధాలన్నీ...
హుషారు విహంగాలై ఒక్కొక్కటిగా
నా మనో ఫలకంపై వాలుతూ .....

ఆటపాటల్లోన అనుభవించిన
ఆనాటి  తీపి మధుర క్షణాలు
అన్నదమ్ములతోడ  అల్లుకున్న
అనుబంధాలు ... అప్పుడప్పుడు
పూనిన అలకలు... మిత్రులతో
జరిపిన గిల్లి కజ్జాలు... సప్త వర్ణ చిత్రాలై ...

ఆత్మీయతల ముల్లె అమ్మ క్రమశిక్షణలు
అనురాగాల పూదోట నాన్న కట్టుబాట్లు ...
పుట్టి పెరిగిన పొదరిల్లు ... పరిసరాలు
అనుక్షణం అనుభవాల నందనంలో
అందమైన వాహ్యాలే  కద పదవీ విరమణ
పర్వంలో ......

నగునూరి రాజన్న

సర్దుబాటు జీవితాలు తేదీ : 29-06-2021

 సర్దుబాటు జీవితాలు 

తేదీ : 29-06-2021
శీర్షిక : సగటు మనిషి బ్రతుకు చిత్రం … 
కవిత సంఖ్య : 699

సంతోషాల వెదుకులాటలో 
సర్దుబాట్ల సింహాసనం ఎక్కాల్సిందే 
మంచమున్నంతవరకే కాళ్ళార చాప 
గలిగితే కడుపులో చల్ల కదలనంటుంది.... 

ఆకలివేళ అమ్మ అందరికి
కడుపులు నింపి సర్దుకుంటే 
అవసరాల వేళ బాధ్యతల 
బందీలో నాన్న సర్దుకుంటాడు.... 

తల్లి వేరు మీద బరువును నిలిపిన 
తరువు సరిచేసుకుని పెరిగిన చందం 
ఎప్పటికప్పుడు లెక్కలు సరిచేసుకుంటూ 
తాళం తప్పకుండ చూసుకోవాలి .... 

ఉన్నవాడికి తింటే అరగదు 
లేనివాడికి తిండే దొరకదు 
అన్నాడో మహానుభావుడు  
అక్షరాలా పచ్చి నిజమది.... 

వ్యక్తులైనా  నాయకులైనా  దేశాలైనా…
కాదంటే మొదటికే మోసంలా…అప్పుడెప్పుడో 
ఆలోచన లేని నాయకుల ఆగడాలకు 
మనం ఇప్పుడెదుర్కుంటున్న పెట్రోమంటల్లా .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

అక్షరమే నా శ్వాస తేదీ : 28-06-2021

 అక్షరమే నా శ్వాస

తేదీ : 28-06-2021
శీర్షిక : అమ్మ మనసు
కవిత సంఖ్య : 698

అంతగా తెలియని వయసులోనే
అక్షరాలే అన్నం పెడతాయంటూ
అనుక్షణం బోధించిన అనునయింపులే
అంతరాత్మకు బోధించిన ...అమ్మ మనసు ...

అలా అలా అల్లుకున్న ప్రేమలు
అక్షరాలపై ఏర్పరుచుకున్న మమతలు
అలవోకగ ఒంటబట్టించుకున్న పాఠాలు
అగ్రాగామిగా నిలబెట్టిన మధుర క్షణాలు ....

పల్లె దాటి పట్నంలో అడుగిడగానే
స్వతంత్రించిన లేగదూడలకు కంచె
వేయని పంటపొలం  కంట పడినట్టు
అలవాట్ల పొరపాట్లు చేస్తూ....అప్పుడప్పుడు
గాడి తప్పినా .....

ప్రతి నెలా ...పల్లె తల్లిని పలకరించే
వేళలో అమృతవల్లి మా అమ్మ మాటలతో
మళ్ళీ గాడిన పడేది.. మా బుద్ది... వల్లె  వేసిన
విద్యార్ధి నోట లెక్క తప్పని ఎక్కంలా ...

అలా అలా అక్కున చేర్చుకున్న అక్షరం
ప్రాణవాయువై నిలిచి నేడు  ప్రాణప్రదమాయె
పడుకున్నా మెలకువగా ఉన్నా తప్పని
ఉచ్వాస నిచ్వాసల ఊయలలూగుచున్నది ....

నగునూరి రాజన్న
కరినగరము

జానపద గేయం తేది: 17-04-2021 శీర్షిక : పల్లె పూదోటలు

 జానపద గేయం 

తేది: 17-04-2021
శీర్షిక : పల్లె పూదోటలు 
కవిత సంఖ్య : 642

పల్లె తల్లి ఒడిలోన 
పారాడిన పసికూనలు
ఆనోటా ఈనోటా 
అల్లుకున్న పూదోటలు

అక్షయ జ్ఞానాల 
ఆనవాళ్ళ బోధనలు
లక్షల విరిబోణీల 
చద్దన్నం మూటలురా 
                          // పల్లె // 
అందమైన పొందికలు
సుందరాంగుల నోటంటా
గుప్పుమనే కుప్పవోసిన
గుండు మల్లె రాశులు
                             // పల్లె // 
రాగం తానం పల్లవుల
రంది లేదు వాళ్ళకు 
అలతి అలతి పదాలతో
తులసి మాలగట్టెదరు 
                               // పల్లె // 
గురుదేవులు లేకున్నా
సిరిమూటల జాడలే
లక్ష్యంగా గురిచూసే
ఉండేలు దెబ్బలురా                               
                               // పల్లె // 
వెండి తెరల జాడల్లో
వెలగబట్టె రారాజుగా 
విశ్వమే వేదికయ్యే
దశ దిశలా చాటంగా
                                 // పల్లె // 
నగునూరి రాజన్న

బార్టర్ బతుకులు 25-04-2021

బార్టర్ బతుకులు  

25-04-2021

చిత్ర కవిత 
శీర్షిక  :గతి తప్పిన వ్యాపార నీతి 
కవిత సంఖ్య : 

బార్టర్  విధానంలో బతికిన రోజుల్లోన
పల్లెయినా  పట్నమయినా 
ఇచ్చిపుచ్చుకుంటేనే ఇలవరుసగా 
బంగారు జీవనం సాగేది .... 

ఏది ఏమైనా ఎన్ని చెప్పినా 
భారతానా నాటి వ్యాపారంలో 
బహు నీతిగా సాగిందనేది 
బహుళ ఆమోదితమే .... 

మానవత్వపు ఛాయ పరిధి దాటి 
మసి పూసి మారేడు చేయలేదు 
అందుకే గుప్తుల కాలం గుంభనంగా 
స్వర్ణయుగమై విరాజిల్లినది .... 

నాడు వర్తకులు రాజుకు కప్పం 
కట్టి పాలనలకు సాయమందిస్తే ....  
నేడు వలస వాదన స్వార్థ విధానాల 
కనుసన్నల్లో పార్టీలకు పంచుతూ 
పతనాలకు నాందీ పలుకుతున్నారు 

నాటి భారత వ్యాపారులు 
అవసరాలను  అందుకుంటే  ... 
నేటి విదేశీ కార్పొరేట్లు 
అవసరాలను సృష్టిస్తున్నారు .... 

భావ వాదమైనా ... పదార్థవాదమైనా 
నియమాలకు  పరిమితులకు లోబడి
స్త్రీ పురుషులై  అన్యోన్యత పాటిస్తే
ఆనందమయమైన జీవితమే ..... 

విదేశీ వింతలో వికారాల మోజులో  
రెండూ కానీ మానసిక స్థితితో కొట్టు 
మిట్టాడుతూ వ్యాపారం కొరకు కొత్త కొత్త 
పుంతలుతొక్కి లేనిపోని మొండి 
రోగాలను వ్యాప్తి చేస్తున్నాయి .... నేడు ... 

నగునూరి రాజన్న 
కరినగరము 

 

జల గీతాలు తేదీ : 26-06-2021

 జల గీతాలు

తేదీ : 26-06-2021
శీర్షిక :జలం విలువ
కవిత సంఖ్య : 697

చేయి చేయి కలుపువయా
చేతనయింది నిలుపువయా

వరద పారు సెలయేళ్ళు
వాన నీటి జీవనదులు
అవే కదా ఆనవాళ్లు
ఆనాటి నాగరికతలకు  // చేయి //

జలమేరా జీవరాశి మూలం
ఆ జలం విలువ
తెలుసుకొనుటే
మనిషిగ మన ధర్మం    // చేయి //

ప్రతియేటా  చెట్లు నాటి
పచ్చదనం పెంచవయా
దట్టమైన వనసంపద
వాటమైన వర్శమిచ్చు ... // చేయి //

అమాయకపు సెలయేళ్ళను
అన్యాక్రాంతం చేయబోకు
నిఖార్సయిన నదీమలను
నిలువెళ్ళా  దోచెయ్యకు  // చేయి //

తాగు నీరు సాగు నీరు
ప్రాణప్రదం జీవాలకు
కలుషితాలు నింపబోకు
విషతుల్యం చేయబోకు   //  చేయి //

ప్రాణాలను నిలిపేటి
పంచభూతాత్మలను
పట్టినా ముట్టినా
పబ్బతులే ఆనాడు      // చేయి //

అనుభవాల సారమే
ఆచారం సంప్రదాయం
అవహేళన చేయబోకు
సత్వరమే గుర్తించు    //చేయి //

నగునూరి రాజన్న
కరినగరము

పురివిప్పిన ఊపిరి తేదీ : 25-06-2021

 పురివిప్పిన ఊపిరి 

తేదీ : 25-06-2021
శీర్షిక : ఋతువు మార్పు ... 
కవిత సంఖ్య : 696

గ్రీష్మ తాపాలకు గిల గిలలాడి
నిలదొక్కుకున్న తరువులు 
పచ్చదనమన్నది మాయమై 
నెర్రెలూనిన నేలమ్మకు... 

ఋతువు మార్పుతో బతుకు 
చేతబట్టినట్టు ... చిటపటల 
చినుకుల  పలకరింతలతో 
భూదేవంతా పచ్చదనం పూనింది .... 

కాలుష్యాలు కొంత కనుమరుగయి 
పరుగు పెట్టిన వరద నీటితో 
వాగు వంకలన్నీ పొంగి పొర్లగానే 
పరవశించిన ప్రకృతమ్మ 
మనసు మురిసిన జీవజాలం .....  

ఆహ్లాదాల ఆమనిలో మునిగిన 
మనసుల నిండా మమతల మూటలై 
కొంగ్రొత్త ఊపిరులు పులుముకుని 
తేలి పోతున్నది ఆకాశయానంలో .....  

పురివిప్పిన పచ్చదనాలతో 
పున్నమి రాత్రుల తలచుకుని 
వెన్నెల గానం ఆలపించాలని 
మదిలో మెదిలిన మెరుపు నక్షత్రం ..... 


నగునూరి రాజన్న 
కరినగరము 

అడుగుల సవ్వడి తేది : 24-06-2021

 అడుగుల సవ్వడి

తేది : 24-06-2021
శీర్షిక : అపర సరస్వతి మా అమ్మ
కవిత సంఖ్య : 139

అక్షరాభ్యాసాల నాటి నుండే
అకుంఠిత దీక్షా దక్షతలే 
అనుక్షణం ఆరాటములే
అడుగడున పోరాటములే

అంతగా చదవక పోయినా
అంతర్ దృష్టి కలిగిన అమ్మ
అమ్మలగన్న యమ్మ అపర
సరస్వతీ దేవియే మా అమ్మ ....

పల్లె పట్టున మల్లెలా వెలసినా
ప్రతీ క్షణం మా ప్రగతి ఆలోచనలే
ఉన్న కొంచం... గొప్ప...విజ్ఞానాలతో
ఉరకలేయించి మమ్మల్ని ఉసిగొలిపేది.

కూత పెట్టే కుక్కుటము కన్నా ముందే
లేపి వల్లె వేయించేది ఆనాటి పాఠాలు ...
మగతగా జోగినా మరునిమిషం పసిగట్టేది...
ఎప్పటికప్పుడు ఏ పనిమీదున్నా మా కదలికలే  ...

అమ్మ అడుగుల సవ్వడే  నాలో
కదిలే అక్షరాలకు ఆకృతి ఈనాడు
పదమైనా ... కవితైనా ... గేయమైనా....
హైకూలు కథలుగా ఆవిష్కరించినా ....

నగునూరి రాజన్న
కరినగరము

నా చూపు ప్రపంచమే ... తేది : 24-06-2021

 అంశం : నా చూపు ప్రపంచమే ...

తేది : 24-06-2021
శీర్షిక: సశాస్త్రీయ ఆధ్యాత్మిక సాంప్రదాయం… 
కవిత సంఖ్య :695

శతాబ్దమైనదేమో శంక లేని బతుకులకు
ప్రపంచమే నా గుప్పిటంటూ సాంకేతిక
సంబరాల్లో...అలా మునిగిపోయిందో లేదో
పారా హుషారంటూ పరుగెత్తించింది
కంటికి కనపడని కరోనా క్రిమి .......

అప్పుడప్పుడు ఏవేవో అలలు తాకి
అనుభవాలు అతలాకుతలమైనా...
ప్రసూతి వైరాగ్యం ... శ్మశాన వైరాగ్యంలా
వెను వెంటనే మరిచి.. మనిషి విర్ర వీగే రకమే.....

విశ్వాన్నే వశం చేసుకోవాలనే
విషపు ఆలోచనల స్వార్థపరత్వం
రెచ్చిపోయి వెక్కిరించి బేజారెత్తిస్తూ
ప్రాణవాయువులకై పరుగెత్తించింది ....

జనాభాలు పెరిగినంత వేగంగా జ్ఞానబోధల
ఆనవాళ్ల అనుభవాలు..జోడించని రక్షణలు
విడమరిచి బోధించే విశ్వ గురువుల కరువేమో
కొట్టొచ్చినట్టు... కొండెక్కినట్టయింది సంస్కారం .....

సంప్రదాయాలను సన్నుతించడం తగ్గి...
వల్లె వేసిన వారిని రెల్లు గడ్డిలా తీసేసి...
మునుము బెట్టి మనువునెక్కిరించి
పాశాత్యపు పైత్యములే  ఒంట బట్టె .... .

అత్యంత పురాతమని ఘంటాపథం
అదొక జీవన విధానమేనని గుర్తించు
సశాస్త్రీయతల నిబిడీకృత సంపద
ఆధ్యాత్మికత మెండుగా నిండిన హైందవం ......
గుడ్డిగా వాదించక గుంభనంగా వినుకునుడే
నా చూపు ప్రపంచం .....

నగునూరి రాజన్న
కరినగరము