Sunday, July 28, 2024

వెన్నెల వెలుగులో తేది : 19-07-2024 శీర్షిక : పురోగమనాల పునాది

 వెన్నెల వెలుగులో

తేది : 19-07-2024
శీర్షిక : పురోగమనాల పునాది 
సహస్రాధికం .... 

అందరమ్మలకు తమ్ముడై ఆత్మీయతలు
మూటగట్టి బొజ్జలు నింపిన అందరి మామ… 
శుక్లంలో వృద్దిచెంది కృష్ణంలో కుంగిపోతు
జీవితమంటే నిర్వచనమై నిలిచాడు…. 

పసిపాపల నవ్వుల్లో పసిడివెన్నెలలు 
కురిపించినా…పడుచులకేమో పండు 
వెన్నెలల తోటగ మారి పోయి మైకంతో 
మైమరిపించి గమ్మత్తుగా మురిపిస్తుంది… 

పిండి వెన్నెలలు  కుమ్మరిస్తూ 
వనమంతా కలియతిరిగినా 
మనవెంటే ఉన్నట్టు భ్రమలు 
కల్పించి ఆప్యాయంగా పలకరిస్తాడు ..... 

ఆకుల సందుల్లోంచి అలా జారిపోతూ 
జలతారులా అందాలను చిలకరిస్తూ 
మధురోహల పల్లకిలో ఊరేగిస్తూ ఒక్కొక్కసారి 
కౌముది కావ్యానికి శ్రీకారం చుడుతాడు ..... 

చీకటి గుహల బ్రతుకులకు 
వెలుగు రేఖల తోవ నేర్పిన రేడు 
విజ్ఞానాల వీధులలో ఊరేగించి
విలువల వలువలు తొడిగిన రేడు… 

కాలగమనాలను ఖచ్చితత్వంతో 
లెక్కింపజేసి ప్రణాళికల పర్వంతో
పురోగమనాలకు పునాది వేసి
అనాదిగా వెన్నంటి నిలిచిన రేడు… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment