Monday, April 20, 2020

శీర్షిక : మే 3 / 7 తదుపరి ఇంకొ లెక్క..(10)

శీర్షిక : మే 3  తదుపరి ఇంకొక లెక్క.... 

నల్లేరుపై సాగిన నడక గత తరుణం
ఆకస్మిక నిరోధం..కరోనా కుదిపిన జీవనం 
వుహాను ఛాయల ఉనికి చిత్రం 
ఊహలన్నీ తలకిందులమయం.... 

పాలకుల లాక్ డౌన్ విరివైన ఫలితం  
వీధిన కొంత నిరోధిస్తున్న రక్షక దళం  
విధిలో కొంత గెలిపిస్తున్న వైద్యుల కష్టం 
విరామమెరుగని సకల పారిశుధ్యం... 
మే మూడు కాకపోతే ఏడు ..... ఆపైన....  

తదుపరంతా తమాషా చిత్రం 
తమకు తామే ఓ పెద్ద చాదస్తం 
ముట్టుకుంటే మూడు పట్టుకుంటే పదంటూ  
దోబూచులాటల నిత్య చోద్యం...... 

అడుగు తీసి అడుగు వేయాలన్న 
అసలు నమ్మం మన నీడను సైతం 
పక్కవారిని పలకరించాలన్నా 
పలు రకాల ఆలోచిస్తం.... సుమా ....

ఆటో టాక్సీ బస్సు రైలు విమానం 
ఏదెక్కినా చచ్చేంత అనుమానం 
ఎక్కపోతే గడవదు నిత్య జీవనం 
మనమే విధించుకునే పరిక్రమం ....

ఇనుమడించుకో రోగ నిరోధకం 
ఇమ్మడించుకో దైవ చింతనం 
కొంత విడనాడుదాం స్వార్థం 
పొరుగు క్షేమం పొందు లాభం.....  

అత్యవసరానికే అమలు పయనం 
పనిగా ధరించు నిత్య  నాసిక కవచం 
పక్కాగా పాటించు ప్రతివారితో దూరం 
పదేపదే తదుపరి చేసుకో పరిశుభ్రం...... 

నగునూరి రాజన్న
కరీంనగర్

కరుణ రసం 20-04-20

కరుణ రసం 
20 -04 -2020 
శీర్షిక : అసలైన కరుణ... 
సంఖ్య : 398

కనులలో చూపించేదైనా 
కళలలో ప్రదర్శించేదైనా 
కవాతు చేయాల్సింది గుండెల్లో
కనికరించాల్సింది మనసులోతుల్లో.. 

కళ్ళలో ప్రదర్శితమయ్యే భావనకు 
ఎదను పట్టి పిండే మెలిక స్పందన  
ఎదురుగ ముందు కన్పించాలంటే 
నిజముగ నువ్వు ప్రదర్శించాల్సిందే....

యుగాలు మారగానే ఒంటికాలైన ధర్మం 
ధైర్యాన్ని కూడదీసుకుని పోరాడుతున్నా
కనికరించి కరుణరసం చూపేవాళ్లే 
కరువవుతున్నారు రోజు రోజుకి ..... 

కళ్ళు తెరిచి కలిమాయలో పడ్డాడో లేదో 
కాసుల వెంటే మనిషి పరుగో పరుగు.....
కనికరం జాలి దయ క్షమా కాకరకాయ
మానవత్వం మంచితనం అంత ట్రాష్ ..... 

కడుపుకు పట్టెడు అన్నం పెట్టే రైతన్నకు


కష్టమొచ్చి ఏదైనా కార్యాలయమెల్తే 
అంటరానోన్ని చూసినట్టేనాయె 
ఆరా తీసి అక్కున చేర్చుకుని  
ఆర్తిగా పని చేసి పెట్టే అసలైన కరుణ ఏది .... ?

నగునూరి రాజన్న
హైదరాబాదు. 

మానవత్వాన్ని మించింది లేదు. karona (9)

శీర్షిక: మానవత్వాన్ని మించింది లేదు. (9)
తేది: 19-04-2020

కోటి ఆశల నూతన సంవత్సరం 
కొంగ్రొత్త ఆలోచనలతో కొత్త కొత్త ఆశయాలతో 
ఊపిరి సలుపని ఊసులతో 
ఉరుకులు పరుగులు పుంజుకున్నదో లేదో.... /
పులి మీద పుట్రలా ముళ్ళ కిరీటం ధరించి
కలి ధర్మపు కాల శిక్షలా పయనమైన కరోనా
కఠిన పాషాణపు కబంద హస్తాల్లో చిక్కించుకుని
మహమ్మారి వేషంతో విశ్వాన్ని చుట్టి కబళిస్తున్నది..../
పసందైన జీవనవిధానమని 
ప్రశస్తమైన సంక్షేమాలనే భ్రమలతో 
అభివృద్ధికి నిర్వచనమైన అగ్రరాజ్యమని 
అర్రులు చాచి అంగలేసిన యువతకు ....../
ఆర్థికతలో అగ్రగామినంటూ విర్రవీగి
ఆయుధాలలో తారాజువ్వనంటూ పైకెగసి
నింగి నేల నీట అన్నింటా నేనేనంటూ
నక్షత్ర పోరుకు నాందీ పలికిన అగ్ర రాజ్యం ..../
అత్యంత కీలక ఆరోగ్యాల విషయాన 
చేతులెత్తేసిన పాలక నిర్ణయాల వెనక
చేవ చచ్చిన వైద్య విధానాల సమయాన
కలి నాగుల కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుంటే 
కనీస మందులు పొందలేని స్థితిలో 
కలుక్కుమంటున్న కన్న గుండెలు అంతటా...../


అధిక జనాభా అభయారణ్యాలతో  
అరకొర వ్యవస్థల భాండాగారాలతో 
అపవాదులన్ని మూటగట్టుకున్నప్పటికీ 
అగ్రరాజ్యం మొదలు అడిగినవారందరికి 
అపర ధన్వంతరియై ఔషధ ఔదార్యాల హస్తం
అందించి ఆత్మీయతలు చాటుకున్న వితరణశీలి నాదేశం....  /
ఓడలు బండ్లు... బండ్లు ఓడలయునా
మానవత్వము మించిన మతలబు లేదంది 
నాదేశం..... /

నగునూరి రాజన్న
హైదరాబాదు. 

ఆచార సాంప్రదాయాలు 1

ఆచార సాంప్రదాయాలు 1

ఆచారమంటేనే అంతెత్తునుంటావు 
వ్యవహారమంటేనే వల్ల కాదంటావు 
సాంప్రదాయమంటేనే సాకులు వెదుకుతావు
ఆద్యాత్మికమంటే..అంతా మిధ్యేనంటావు .      .       

కుల మతాలంటూ కుళ్ళుడెందుకయ్య
కుత్చితమున పూర్వీకులపై కుతకుతలు  
మను ధర్మమును ప్రశ్నించ మనమెంత
కాచి వడబోసిన కమ్మన్ని నెయ్యది నమ్ముము...

అలవాట్ల ఆసరాల ఆనవాల్లేమో..
బండ గుర్తుల బాగైన చిహ్నములేమో ..
మెండైన వృత్తుల గౌరవమ్ములేమో ..
పరిపాలనల సౌలభ్య సంకేతములేమో....నాడు  

పని పాటలు పండించిన పద్దతులేమో.... 
నాణ్యత నైపుణ్యతల ఒరవడులేమో....... 
మాట చురుకుల మతుల మెరుపులేమో ...  
మంద గమనాల మొద్దు నిద్రలేమో....  

తిండి తిప్పల్ల దండి పద్దతులేమో .... 
మలిన మాంసహారాల ముచ్చట్లేమో....  
మత్తులు వదలనన్న చిత్తములేమో...... 
శుచి శుభ్రతల శుభ మెళకువలేమో.... 

నిరక్షరాస్యత నిర్లిప్తతల నీడలేమో 
ఉమ్మి చెమ్మను కాలరాసిన ఉదంతములేమో 
ఆకు చుట్టను జేర్చి అంటించిన పొగాకులేమో
కాకి పిల్లలు కాకికి ముద్దులే కద సోదరా... 

ఎంగిలి మంగళములన్న ఏవగింపులేలనయ్య
హెపటైటిస్  బి  సశాస్త్రీయత రుజువులున్నవి కాదా
ఏ మాంస హారములైతే ఏమౌవుతుందిలే అనెదవేమో
ఎన్ కెఫెలిటీస్ బ్రెయిన్ ఫీవర్ వరాహ వరములే కాదా
బర్ద్ ఫ్లూలన్న మలిన కుక్కుటముల మరకలే కద సోదరా .... 

ఎదురులేదు నాకంటూ 
ఎదురైనది తిన్న ఫలితమే కద 
ఎల్ల విశ్వము నేడు గొల్లుమనుచుండె
ఏకాకులను చేసి బంధాలను విడగొట్టి.... 

మనిషి సైతం మల మూత్రములు తిత్థే  కదా 
మర్మమెరిగిన మనము మతిన మసలుకో రాదా
శుభ్రపరుచంగ తాకమె సుందరమౌ కరములు
చెవి ముక్కు కను తీరులే కాదు అచట ఇచట
తీరొక్క అంగము రీతైన పని జేయ..... 

ముక్కును తాకంగ ముదముగ చూపుడు వేలు
చెవిలోన గుబిలిని చెంగుమనిపించు చిటికెన వేలు
ఒకటికైన..రెంటికైన.. తప్పని వామ హస్తము
మలినం మనదేనని మాటిమాటికి తాకెదమా
మలినమని  ముట్టకుండ  మానుకుందుమా....!

మానవాంగములైన.. మనుసిద్దాంతములైన..
మర్మమెరిగి నడచుటే మనుషుల ధర్మం
కలుపుకుని సాగుటే మానవ జీవితం 
తిరగబడి సాగిందా బతుకు జీవుడు గోవిందా.... 

అవసరాలకు  అత్యవసరాలకు  ఆదుకుంటూ..... 
ఆనక అవసరాన  శుభ్రపరుచుకుంటూ..
అడుగు ముందుకేయుటే కద ఆంతర్యము..
భుజం భుజం కలిపి నడువుము..
అడుగు ముందుకేయుము సోదరా....!

హస్తమందు నిలిచిన ఐదు వేళ్ళు
ఆకారమందు వింత బేధములు 
అయినను కలసి కట్టుగ నిలుచు 
ముద్ద నోట కందించు ముదమున...

సనాతనమైనా సంప్రదాయమైనా 
అంతా సశాస్త్రీయతే హైందవాన .... 
అందరికి అందరు విడమరువ లేదేమో 
మనకై మనం వడిగా నేర్చుకోలేదేమో...
 
నగునూరి రాజన్న 
కరీంనగర్

అనంత కీర్తి తేది- 18-04-2020

అనంత కీర్తి 
తేది- 18-04-2020
శీర్షిక- వారే “కీర్తి కిరీటులు“ 
సంఖ్య-397

ఒక్కసారి గతంలోకి తొంగి చూసుకుంటే  
ఒళ్ళు గగుర్పొడుస్తుంది..... 

అరకొర సదుపాయాల అతుకు
బతుకు సంసారాల కాలములో 
అమ్మా నాన్నలు చూపిన ఆత్మ స్థైర్యం...

ఆరుగాలం కష్టపడి 
అరక దున్ని పంట తీసి 
అరడజను మందినైనా అవలీలగా
పోషించగలమని వారు చూపిన ధైర్యం.... 

పది లేకుంటే పజీతలు 
పది కూడాలంటే పస్తులు
పది చుట్టూరా మా జీవితం 
పట్టుబట్టి గట్టెక్కిచ్చిన వైనం .... 

అడుగడుగునా కష్టాలీదుకుంటూ
అవేమి మాదృష్టికి రానీయకుండా 
మా అందరికి అక్షర జ్ఞానం అందించిన 
చైతన్యం వారి దూరదృష్టి ..... 

అంతగా రవాణాలు లేని ఆరోజుల్లో 
అక్షరమూర్తులైన మా మాష్టార్లు 
అష్టకష్టాలు పడి సైకిళ్ళమీద చేరుకొని 
మా ఉన్నతికై పాటుపడిన తీరు.... 

వారే “కీర్తి కిరీటులు“ మా జీవితాన.... 



నగునూరి రాజన్న


హైదరాబాదు. 

నూతన ఒరవడి 17-04-20

నూతన ఒరవడి 
తేది : 17-04-2020
శీర్షిక : మనసా వాచా కర్మణః 
సంఖ్య: 396

మూస పోత విధానం 
మోత బరువు నినాదం  
సరికొత్త మార్గమైనప్పుడే
సంధి సమయం దాటి నిలుస్తం... 

చిమ్మ చీకటే మార్గం కావచ్చు 
చికాకులేమైనా ఎదురవొచ్చు ... కాని 
చిరకాలం నిలుచు ఊరు పేరు
సరి రారు పోటీగ మనకెవ్వరూ......

నమ్మినదేదయినా నడక సాగిస్తే 
తనంత తానే తన్మయమై నిలవదా ..... 
తనువు మనసు లీనమై జపిస్తే తపిస్తే 
అధీనమే అవదా ఉన్నత శిఖరం..... 

సత్య వాక్ పరిపాలకుడే జాతిపితగా 
ఉక్కు సంకల్పాన మనమొకటయ్యాం....
అస్పృశ్యుడే అఖండ రాజ్యాంగ లిఖితుడు
పేదరికపు పెద్ధ గొప్ప క్షిపణి శాస్త్రవేత్తగా....   
సాధారణ పౌరుడే  సమున్నత ఆసనుడాయె
ఎందరో మహానుభావులు    
అందరికీ వందనాలు ..... 

మనసా వాచా కర్మణః పాటిస్తే 
ఏ నూతనత్వమైనా మన సొంతం.. 

నగునూరి రాజన్న 
హైదరాబాద్ 

కాలం మార్చిన కరోనా కథ... (8)

శీర్షిక : కాలం మార్చిన కథ... (8)
తేది :16-04-2020    

భారతీయమంటే బహుపురాతనం 
కాదని ఒక్క నమస్కారంలోనే 
సమస్త జీవన సంస్కారం ఇమిడిన  
భవ్యమైన విధానమని నిరూపితం ..../. 

కాసుల వేటలో కనికరాలు మరిచి 
కఠిన పాషాణమై చోద్యం చూసిన వైద్యం 
కాదని మానవత్వం నెత్తికెత్తుకుని 
ఆరాధ్యాలు అందుకుంటున్న వైనం ..... /

భక్షకులు రక్షకులన్న భ్రాంతిని విడిచి
క్రాంతి విధానమే మా మార్గమని
"జనం కొరకే మనం " అంటూ 
జన నీరాజనాలందుకుంటున్న వేళ ..... /

అంటీముట్టని శుభ్రత దూతలు
అనుంగు సోదరులై ఆదుకుంటూ
అహోరాత్రులు కనిపెట్టుకుంటూ  
అందలం అధిరోహిస్తున్న శుభవేళ..../  

ఛీత్కారాలు చీదరింపుల నుండి 
చేమంతులు గులాబీ మల్లెల జల్లుల
సత్కారాలతో సమున్నతమై శోభిల్లుతూ
కాలం మార్చిన కథగా నిరూపితమైన
శుభ సమయం... /

నగునూరి రాజన్న 
హైదరాబాద్ 

వివేచనం

వివేచనం

అందరూ చదువుతారు 
ఆ సమ కాలపు పుస్తకాలు 
కొందరు మాత్రమే చదువుతారు 
ఒక విషయం మీద వెలువడ్డ వివిధ పుస్తకాలు 

అందులో మీరు ప్రత్యేకం  
గోదావరి గలగలలు మొదలుకుని 
సారథి సిధారెడ్డి సాహిత్యాలు 
బి ఎస్ రాములు దేశపాండేల సామాజికత్వం 

దాశరథిల దార్శనికతలు 
కాళోజీ కథల తాత్వికత్వం 
తొలి తెలుగు కంద పద్యాల మూలాలు 
ఆధునిక సాహిత్య ప్రక్రియలు 
రావికంటి రామయ్యగారి ప్రజాపక్షం 
జీవిత పోరాటాల కోట ముగ్దుమ్ బాట 
నలిమెల సాహిత్య నవనీతం 
రాచపాళెం వచన కవితా దిక్సూచి  ఆదిగాగల 
ఇరువదారు పుస్తకాలను ఇమ్మడించినారు. 

జయహో జయ జయహో 
శ్రీ దాస్యం సేనాధిపతిగారు 
అసాధారణం మీ   వివేచనం 
అమోఘం ఈ  వివేచనం 
అందుకోండి అభినందనలు 
అందుకోండి శుభాభినందనలు.   


నగునూరి రాజన్న 
కరీంనగర్

పరితపిస్తున్న ప్రకృతి (కరోనా 7 )


శీర్షిక :పరితపిస్తున్న ప్రకృతి 
          (కరోనా  7 )

ఒకప్పుడు : 
ఆర్థికతలో అధిపతినంటూ 
అంగబలంలో అజేయమంటూ  
అభివృద్ధిలో  జగపతినంటూ
ఆకాశమే హద్దుగా ఆక్రమించిన వైనాలు .... 

ఇప్పుడు:
ఊగిసలాటలో ఉత్పత్తి రంగాలు 
నిలిచిపోయిన సేవారంగాలు 
పొంతన లేని విఫణి వీధులు 
అంతుబట్టని దేశాల ఆర్థికతలు ....  

మూగబోయిన వర్తక వాణిజ్య కూడళ్లు 
అసంఘటిత కార్మికుల ఆకలి కేకలు 
వరస మారుతున్న వలస కార్మికులు 
అభాగ్యుల జీవిత అతలాకుతలాలు ..... 

కపటదారుల కరోనా సూక్ష్మ క్రిమి 
కల్లోలాలను మూటగట్టుకొస్తే 
ఆగిన ప్రపంచం అందాలను ఏరుకుంటున్నది  
విసిగిన విశ్వం దృశ్యాలను మార్చుకుంటున్నది 

ప్రకోపించిన ప్రకృతి సైతం 
పరితపిస్తుంది పరిపరివిధముల  
ప్రజ్వలించే నారాయణాస్త్రం 
ప్రశాంతమైతే ప్రజలంతా క్షేమం .... 


నగునూరి రాజన్న 
హైదరాబాదు. 

ప్రణాళిక 16-04-20

ప్రణాళిక 
తేది : 16-04-2020
శీర్షిక : క్రమానుగత క్రియాశీలత .....
సంఖ్య: 395 

చిన్నదైనా పెద్దదైనా పని 
చిన్మయంగా పొందుపరచవలె 
శ్రమానుగత ప్రతిఫలానికై
క్రమానుగత క్రియాశీలత .....

ఇల్లు కట్టి చూడు అన్నా ...
పెళ్లి చేసి చూడు అన్నా ....
అనుభూతుల నానుడులన్నీ 
అనుభవాల జోలె నింపుకోడానికే  

ఆలనలైనా పాలనలైనా
అజరామరమై నిలవాలంటే
నిర్దుష్టమైన నియమ తోరణాల
అవపోశనల ఆలంబనలే.....

దేశ ఆర్ధికానికైనా దేహ ఆరోగ్యానికైనా 
పథకమేసి పని ప్రారంభించాల్సిందే.... 
నిర్దుష్టమైన నియమ నిబంధనలతో 
ఆచరణాత్మక పద్దతులతో అవలంభించడమే..... 

గత అనుభవాల విశ్లేషణలు
వర్తమానాల అవగతాలు
భవిష్యత్ కార్యాచరణాల 
గమన పథాల నిర్దేశనము.... 

నగునూరి రాజన్న
హైదరాబాదు. 


ముఖస్తుతి

నగునూరి రాజన్న 
ముఖస్తుతి
తేది 13-04-2020
శీర్షిక : శ్రీరామ రక్ష .... 
సంఖ్య : 392

స్వార్థ చింతనలు కొంతైన లేక 
స్వర పొంతనల పొగడ్తల
మాటలు వాస్తవాన మంత్రమైతే 
మనసున బంధమై నిలుచు... 

నక్క వినయాల నటనల అగడ్తలు
నాగ లోక మార్గదర్శకాలు... 
కలి నారదుల కల్పన వాక్కులు 
కకావికల కాల్పనికాలు.... 

కపటత్వం కనిపెట్టకపోతే
కనికట్టే అవుతుంది 
కన్ను మిన్ను కానకుండా పోయి 
కష్టకాలం ఎదురౌతుంది ....

రాజ్యాలేలిన రారాజులైననేమి 
గృహసీమల రమణులైననేమి
రంజయిన మూస పొగడ్తలకు 
రయముగ తలకెక్కవా రాగద్వేషాలు....

అడుగడుగున ఆదరించు ఆలంబనలై
స్వయం నియంత్రణల సంతులితలు 
సాక్షాత్ స్వీయ విశ్లేషణల చిట్కాలు  
సదా రక్షించు ఛాయలై శ్రీరామ రక్షణలై .....

నగునూరి రాజన్న 

డా బి ఆర్ అంబేద్కర్ 14-04-20

డా  బి ఆర్ అంబేద్కర్ 
తేది  14-04-2020
శీర్షిక : భారత రత్న 
సంఖ్య - 393

భాగ్యశాలి భీమాబాయి రాంజీల 
పదునాల్గవ సంతానమైనా ... 
పై చదువుల మమకారంతో  
పట్టుదల క్రమశిక్షణలతో శ్రమలకోర్చి 
పట్టాలు దండిగా పొందిన ప్రజ్ఞాశాలి 

అణగారిన జీవిత మూలాలనే 
ఆయుధంగా మలుచుకుని 
అత్యున్నత శిఖరం భారతరత్నగా 
అధిరోహించిన అపర మేధావి. 

కులమతాల కుత్సితాల 
వర్గ పోరాటాల సమయాలలో 
బరోడా పెద్దల ప్రాపకం 
సంపాదించగలిగిన కుశాగ్రబుద్ధిశాలి.  

సంయమనం పాటిస్తూనే 
సరైన సమయములో స్పందించి 
సంధి కుదుర్చుకుని గాంధీజీతో 
సాకారపర్చుకున్నాడు హక్కు భుక్తాలు 
రాజ్యాంగానా .... 

పేరుకు ఏడుగురు సభ్యులైనా 
పెద్దన్న పాత్ర రాజ్యాంగ కూర్పున 
పెన్నిదై నిలిచాడు భారతావనికి. 

నగునూరి రాజన్న 
హైదరాబాదు. 
 

మధుర భాషణం 11-4-20

మధుర భాషణం
తేది-11-04-2020
శీర్షిక: స్థిత ప్రజ్ఞత మాటలు... 
సంఖ్య: 391

యాంత్రిక జీవనాన పయనిస్తూ 
అవసరాలకు మాత్రమే అలరిస్తూ 
ఆర్తి ధీర ముచ్చట్లను ఆస్వాదిస్తానంటే  
అయిపోతాయా మధుర భాషణాలు .... 

రెక్కలు తెగిన పక్షిలా ఒంటరైనప్పుడు
ఆలోచన సుడిగుండాలలో...
చుక్కల్లో చంద్రుడై నలుగురిలో 
నిక్కముగ వెలుగులీనుతున్నప్పుడు.......
నాలుకను అదుపులో ఉంచుకుంటే 
ఆనందాల వెలుగులే సాగు జీవితాన ..... 

మనసున విషబీజం నాటుకుని 
మాటల్లో పాయసాలు వడ్డించే నటనల
మాయల మరాఠీలు స్వకార్యాలు 
చక్కబెట్టుకునే స్వార్థపరులున్నంత కాలం .... 
మధురభాషణల జాడలు వెతుక్కోవాల్సిందే... 

మితంగా హితంగా భావ వ్యక్తీకరణ 
కఠిన సత్యమైనా....  సరళంగా ....
కఠోర వాస్తవమైనా.....  ప్రేమగా .....
అనిశ్చిత ఇబ్బందిలోనైనా హుందాగా మర్యాదగా ..
శత్రువుతోనైనా మిత్రువుతోనైనా సఖ్యతగా....
స్థితప్రజ్ఞత మాటలన్నీ.... మధురభాషణలే.....


నగునూరి రాజన్న
హైదరాబాదు. 

గుడ్ ఫ్రైడే

గుడ్ ఫ్రైడే
తేది-10-04-2020
శీర్షిక- హోలీఫ్రైడే
 సంఖ్య-390

జీవితమంటేనే చిత్ర విచిత్రాలు
కష్టసుఖాల  కావడి కుండలు 
సుఖదుఃఖాల సుడిగుండాలు 
అనుకున్నవన్నీ జరగవు...అనుకోలేదని ఆగవు.... 

పుర్రెకో గుణం జిహ్వకో రుచి 
మనిషి మనిషికో ఆలోచన 
ఆలోచనలెన్నయినా అందరి 
మెప్పు పొందితేనే అజరామరం.....

అధర్మం అన్యాయం అసత్యం 
అధికార గర్వంతో హడావుడి చేసినా 
అశాశ్వతాలని రూఢి అవుతానే ఉంటాయి.... 
విలంబమైనా విధిగా గెలిచేది 
సత్యధర్మన్యాయాలే నిక్కచ్చిగా.... 

ప్రజా క్షేమం కోరాల్సిన పాలకులు 
పక్కదార్లు తొక్కుతూ తప్పుదారిన నడుస్తూ 
మంచికోరిన మహాత్ముడుని వంచించి 
శిలువ వేసిన పవిత్రమైన రోజు......

మంచి బోధనల కరుణామయుడై 
ప్రజలను రక్షించిన పవిత్రమూర్తి
ఈస్టర్ ముందొచ్చే శుక్రవారం 
మహాత్ముని మరణ జ్ఞాపకాల హోలీఫ్రైడే....

నగునూరి రాజన్న
హైదరాబాదు. 

కష్టార్జితం 09-04-2020

కష్టార్జితం 
09-04-2020
శీర్షిక : సత్యం ధర్మం న్యాయ సేవా సమ్మతం.... 
సంఖ్య : 389

సత్యమంటే ప్రీతయితే 
స్వయంకృషితో సంతృప్తే... 
చల్లని గాలిలా పచ్చని పైరులా
స్వార్జితం సాధనం ఆనందానికి....

ధర్మమంటే గౌరవమైతే
తనకు రావాల్సిందే కోరుతాడు .... 
ప్రకృతి నేర్పిన పాఠానికి
పరిమళిస్తుంది సహృదయం...... 

న్యాయం నమ్ముకుంటే 
సమ ప్రతిఫలానికి సమ్మతే .... 
నలుగురి ఆమోదం పొందితే 
నందవనమే మది ప్రశాంత మందిరమే... 

సేవాభావమే చిరునవ్వయితే 
చెక్కుచెదరదు నీ కష్ఠభాగం ....  
నిర్మలమైన  సముద్రతరంగమే 
నీవు నమ్మిన నిజ సిద్దాంతం  ..... 

గాలి నీరు ఆహారం ఆవాసం 
మానవ ప్రాదామ్యాలన్నది ఎంత నిజమో... 
సత్యం ధర్మం న్యాయం సేవాభావాలున్నవారు
కష్టార్జితాలనే నమ్ముకునే జీవిత సాఫల్యకులు.... 


నగునూరి రాజన్న
హైదరాబాదు. 

రాజ ధర్మం 8-4-20

రాజ ధర్మం 
తేదీ 08-04-2020
శీర్షిక - సత్యం ... 
సంఖ్య - 388

రాజుల రోజులు పోయి 
రాజ్యాలు మారినా .... 
రాజ ధర్మం మాత్రం సత్యం 
ప్రజల సంక్షేమమే పరమార్థం .... 

యుగాలు మారినా 
జగాలు మెచ్చే రారాజు 
జనాల మనసు గెలిచిన 
జగదేకవీరుడు ... శ్రీరామచంద్రుడు.

రంగులు మార్చే రాజకీయాలు 
హంగులు ప్రదర్శించే వేదికలు 
ప్రజల్ని బాగోగుల్ని గాలికొదిలి 
పటాటోపాలకి చిరునామాలౌతున్నాయి.... 

శాశ్వతాలను వదిలేస్తూ  
తాత్కాలికాలపై మోజులు పెంచుకునే 
ఆధునిక  స్వార్థ పాలనల పోకడలకు 
అసలైన పాఠం నేర్పిస్తూనే ఉంటుంది...  

బాధ్యతలు మరిచిన ప్రజలకు  
పద్ధతులు మరిచిన  పాలకులకు 
దండనలు దహించివేస్తూ 
పరిస్థితులే పాఠం నేర్పిస్తుందనేదానికి 
ప్రత్యక్ష సాక్ష్యం ప్రతీసారి పరిపాటే.... 
 
నగునూరి రాజన్న 
హైదరాబాదు.   

కరోనా నేర్పిన పాఠం (6)

కరోనా నేర్పిన పాఠం 
07-04-2020

కరుణ ఎరగని కరోనా 
కత్తి లేకనే కుత్తుకలు తీస్తున్నది 
ప్రాణాలను హరించేస్తూ 
ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.... 

కరోనా కఠిన పాషాణమైనా 
కళ్ళు తెరిపిస్తున్నది మనందరికీ 
సంస్కృతి సంపద మననంలో 
సంప్రదాయ సమ్మతిలోనే కాదు సుమా ... 

అత్యవసరంలో సహకరించకుండా 
అలసత్వం ప్రదర్శిస్తూ 
అసలు చికిత్సకు దొరక్కుండా 
కుటుంబాలను దేశాన్ని వధ్యశిలపై 
ఎక్కించడం..... ఎందువలనో... !

నిరక్షరాస్యత కొంతవుతే........ . 
నిర్లక్ష్యతే పెద్ద సమస్యయింది 
నిర్లక్ష్యతకు మూలం నిరాదరణలేనా ?  
అక్షరాస్యతలో .... దేశ సమగ్రతలో..... !

మతసంస్థల మాటవుతే మాకొద్దనే 
సంస్కృతికి విశ్రామం చెప్పాల్సిందే.... 
హిందూ సంస్థైనా  గురుద్వారాలైనా  ఏదైనా.... 
పాలనల పట్టు తప్పితే పరిహాసమే కదా! 
ప్రభుత్వాలకే ప్రశ్నలు మిగిలితే ఎలా ?

ఒకటొకటిగా చూస్తుంటే 
ఒళ్ళు జలదరిస్తున్నది 
అనుమతులు లేకుండానే కట్టడాలా ? 
ఆజ్ఞలు లేకుండానే విశ్వ సభలా ?

ప్రతి వ్యక్తి కదలికలో 
ప్రతి సంస్థ మూలలలో 
ప్రజల గమ్యాలలో గమనాలలో .... 
నిఘా నీడలు కదలాల్సిందే.... 

రాజకీయాల రంగులు పులమకుండా  
దేశ రక్షణే గమ్యంగా ధ్యేయంగా సాగితే ... 
ప్రజాస్వామ్యం పదికాలాలు పరిఢవిల్లుతుంది 
భిన్నత్వములో ఏకత్వానికి పట్టు పెరుగుతుంది.... 
పాలనలు ప్రశాంతంగా సాగించవచ్చు..... 

నగునూరి రాజన్న
హైదరాబాదు. 



మాతృ భాషాభిమానం 2

మాతృ భాషాభిమానం 2 
తేదీ - 6-4-20


పుట్టింది పూరిపాక పల్లెలో అయితేనేం
పెరిగింది మధ్యతరగతిలో  కావొచ్చు
అమ్మ ఆశీస్సులు ఆవాణి కరుణలే
అమ్మ భాషంటే అభిమానమయ్యింది

చదివింది వాణిజ్య శాస్త్రములైతేనేమి
గణక లేఖకులుగా కొలువుదీరితేనేమి
గురువు బోధనల సులభ చందస్సో
గురి కుదిరి గర్తున్న యతి ప్రాసలేనేమో....

బతుకు బాటలో జీవనోపాధి స్థానం
పారిశ్రామికప్రాంత రామగుండం
కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థ వలన
ఆంగ్ల మాధ్యమమే అధికార వర్తమానాలకు....

అణువంతే కావొచ్చు నా అభిమానం 
అయినను చాలు ఆర్తి దీర్చుకొన... 
అమ్మ భాష మీద నాటి అభిమానమే 
ఆలోచనల తరంగాలై అడుగు వేయిస్తున్నది....

ప్రభుత్వ సేవల పనుల్లో లీనమయి 
పరి పరి విధముల పట్టు పెంచుకుని 
అప్పుడప్పుడు వ్రాస్తూ వచ్చిన కవితలు 
అచ్చయితే చూసి ఆనంద పడ్డ సందర్భాలు....

అలసత్వం ప్రాణహాని (KARONA 6)

శీర్షిక : అలసత్వం  ప్రాణాలకు ముప్పు... 
తేది: 05-04-2020

కల్తీలకు కాలుష్యాలకు 
కాలమాన పరిస్థితులకు    
కలికాలపు నీతులు సైతం 
కరోనాపై కప్పుకుంటున్నాయి దుప్పట్లు...

ఇన్నాళ్ల ప్రేమలు ఆప్యాయతలు 
ఇంత కపటాన్ని మోసాయా! 
తరాలు మారినా తరగని 
స్వార్థాలను మూటగట్టాయా!

మనం ఆనుకున్న వాళ్లంతా 
మనిషిని వదిలి స్వార్థంకోసం 
మాత్రమే బతుకుతున్నారా! 
మర మనిషిగా నిలిచిపోతున్నారా!

ఎవరికొరకు ఈ దాపరికం 
ఎందుకొరకు ఈ దాగుడుమూతలు !
పాలకుల పబ్బతుల కన్నా 
ప్రాణ విలువలకన్నా మిన్ననా మిత్రమా ! 

కన్నవారిని కట్టుకున్నోళ్లను 
కనిపెంచిన పిల్లలను 
కబరస్తానులకు పంపేంత
కర్కోటకంగా ఎలా మారారు! 

ఆడవారు లేకుండా 
అడ్రస్ లేదు మనిషికి... 
అసలు పిల్లలు లేకుండా 
అర్థముండదు మనుగడకే ! 

చివరాఖరుకు సవ్యదిశన 
సంఘ పురోభివృద్ధికై నిలిచే   
సత్సంతానార్థం సాగించే వ్యవస్థ 
సైతం కుంటుపడే కుత్చితం....!

రాముడైనా రహీముడైనా 
ఒకటే మాట ఒకటే భావం 
మనుషులంతా ఒకటేనని !  
మనిషిలోనే దైవం చూడమని!  


నగునూరి రాజన్న 
కరీంనగర్

(After seeing warangal incident news... because of his delay nine family members were infected with carona out of which 3 are children) 

జగత్కల్యాణం 2

జగత్కల్యాణం 2
02-04-2020
శీర్షిక : లోక కళ్యాణం 
సంఖ్య - 383

శివ చాపం చిదమగానే 
శ్రీరామున్ని వరియించే
శ్రీమహాలక్ష్మి సీతమ్మతల్లి
వరపుత్రి వైదేహి జానకి.... 

అంగరంగ వైభవంగా 
ఆనందాలు మిన్నుముట్ట
అంత జనకుడు నిర్వహించె
ఆది దేవుళ్ళ లోక కళ్యాణం .....

ఆకాశమంత చలువ పందిళ్లు 
భూదేవంత ముగ్గు లోగిళ్ళతో 
జగతి మొత్తంగా జరుపుకునే 
జగజ్జనని రామయ్యల కళ్యాణం... 

మిథిల అయోధ్యల వియ్యం
పుట్టినింటి మెట్టినింటి అపురూపం  
సుందరమైన సుర దీవెనం
మిన్ను ముట్టే జన సంబరం..... 

యుగాలు మారినా పవిత్రం 
ప్రతివారికి నిత్య జీవన సత్యం 
కనులనిండ కన్న ప్రత్యక్షం  
మనసు నిండే తృప్తి జీవితం....   

నగునూరి రాజన్న 
కరీంనగర్ 

సంగీత సాహిత్యాలు 3-4-20

సంగీత సాహిత్యాలు 
తేది - 03-04-2020
శీర్షిక - నాగరికతకు జవసత్వాలు 
సంఖ్య - 384

పరిమళించే ప్రకృతి నేర్పిన ధ్వనుల లయ  
పశు పక్ష్యాదుల పరవశాల పలుకులే శృతి  
కాలానికనుగుణంగా  కదులుతూ  సంగీతం
కమ్మని కళగా ఒదిగినది అరువది నాల్గులో..... 

భాషా బేధాల పట్టింపులు రావు 
లింగ వివక్షల తారతమ్యం లేదు 
జాతి ప్రహారీల అడ్డంకులు నిలవవు 
ఎల్లలు లేని విశ్వ సందర్శనం..... 
 
నాగరికత నడకల భావాంతరం  
సంఘ సాదృశ్య సంఘటనల రూపం 
వివిధ భావ ప్రకటన విస్తృతిలో ఆహార్యం 
భాషకు సమ్మోహన ప్రాణం... సాహిత్యం

గుండె గుడి గంటల్లో పొందే తడికి 
విచ్చుకున్న వివిధ భావనానుభూతులకు 
విడమరిచే సహృదయ వినయ స్పందనలే 
పలు సాహిత్య అభిలాష మార్గాలు.... 

సంగీతం సహజ ప్రకృతి పాఠమైతే 
సాహిత్యం భాష పక్వత చైతన్యం 
అక్షర జ్ఞాన సమర్థ సంపన్నాలు 
కష్ట సుఖాల ఆశల కడలి తీరాలు 
సుఖ దుఃఖాల అమృత తుల్యాలు. 

నగునూరి రాజన్న 
కరీంనగర్

శీర్షిక: ముందు నుయ్యి వెనక గొయ్యి (కరోనా -5)

శీర్షిక: ముందు నుయ్యి వెనక గొయ్యి 
          (కరోనా -5)

కరోనా....కరోనా...కర్ణ కఠోరమాయె కదా !
కంచెలన్నీ దాటుకుని రానే వచ్చింది 
కనుచూపు మేరలోన గడప దాటి నిలిచింది... 
కాలు బయటపెడ్తే కబళించాలని చూస్తున్నది 
కఠిన నిర్ణయాలను సూచనలను
క్రమశిక్షణతో పాటిస్తేనే బతుకు బండి.....

తుమ్మయినా సరే తమ్ముడు దూరమే 
జలుబు జ్వరమయితే క్వారంటైనే మందు
కనపడని సూక్ష్మక్రిమే కదా అని నిరాదరిస్తే 
రక్షణలేని మోక్ష కర్మకు మార్గమేర్పరుస్తుంది.... 

ముట్టుకుంటే పట్టుకుంటదంటే 
పట్టుకోకుంటే పట్టుజారదా ఈ జీవితం 
ఎట్టాగబ్బా గట్టు జేరేది  జీవితం పొద్దు 
గుట్టు తేల్చే మొనగాడు ఎప్పుడొచ్చేది?....

ముందు నుయ్యి ఎనుక గొయ్యయింది బతుకు 
రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలే ఎక్కువాయె 
ముందుచూవు లేని మురిసే తరమాయె
కూసుండి తింటే గుట్టలేంది కొండలు కూడా..... 


నగునూరి రాజన్న

Sunday, April 5, 2020

మాతృభాషాభిమానము

మాతృభాషాభిమానము
తేది 06-04-2020
శీర్షిక - స్వచ్ఛమైన అభిమానం .... 
సంఖ్య - 386

అచ్చులతో అంతమయ్యే 
అందమైన భాష తెలుగు  
అమ్మ నోట తొలి మాట 
అమృతాలొలుకు మూట 

ఏబదారు వర్ణాలతో  
ఎలికైన పురాతనం 
సహస్రాధిక వత్సరాల 
సహవాసం తరాలది....

వ్యాకరణ ఛందస్సులతో 
వ్యాప్తి చెందిన మధురిమలు 
పలు రకాల పద్యాలతో 
పంచభక్ష్య పరమాన్నం.... 

అవధానాల అలంకృతం 
అంగుష్ఠ, నేత్ర , అక్షరాది 
అధునాతన ప్రక్రియల 
ఆలవాలం మన అమ్మభాషలో .... 

అయినా.... 
భాషాభాగాల భయం వద్దు... 
సంధి సమాస సమీపాలొద్దు 
అలంకారాల ఆభరణలొద్దు... 
సరళమైన భాషపై స్వచ్ఛమైన 
అభిమానం చాలు....  

నగునూరి రాజన్న 


హైదరాబాదు. 

వృక్షాలింగనము 4-4-20

వృక్షాలింగనము
తేది- 04-04-2020
శీర్షిక: మానవాళి సంక్షేమం
సంఖ్య - 385 

హరితముతోనే మానవ చరితం 
పుట్టుక నుండి పుడకల వరకు 
అంటిపెట్టుకునేదే అహరహరం
ఉఛ్వాస నిచ్వాసల రూపములో... 

పట్టుకున్నా ముట్టుకున్నా 
పవిత్ర పంచభూతాలను 
పబ్బతి పట్టి మొక్కే 
సంస్కృతి సంప్రదాయం.... మనది!

గాలిలోన తులసి గుమగుమలు
పరిమళాలో మరువ దమనాలు
కనులకింపైన సప్తవర్ణాల పూవులు 
అభిరుచుల నింపే ఆనంద ఫలాలు....

తీగలల్లుకున్న ఆత్మీయతలు 
వెలుగులు నింపుకున్న హరితములు 
పూవులు వంపుకునే మకరందములు 
పండ్లు మోసుకొస్తున్న పోషషకాలు .....

వెళ్లిపోయే వెండి మబ్బులకు
వెంటపడే వర్షపు ఛాయలు.... 
ఆకలైనా ఔషదమైనా అన్నింటికీ 
వృక్షరాజమే మానవాళి సంక్షేమం..... 

నగునూరి రాజన్న
హైదరాబాదు. 

మాయం కాదా కరోనా...! (4)

శీర్షిక: మాయం కాదా కరోనా...!


గబ్బిలమే కేంద్ర బిందువు 
గడబిడపరిచే తలకిందుల
ఉహానునుండి ఉడాయించింది
విశ్వమంతా వ్యాపించింది....

తుమ్ము దగ్గు పడిశమే అనుకుంటే 
తమ్ముణ్ణి కూడా దూరం చేస్తున్నది 
సూక్ష్మమే కదా అని నిరాదరిస్తే
మోక్ష మార్గాన్ని చూపిస్తున్నది....

ఎదురులేదనుకున్న వారందరికి 
అనుభవాల మూటలు అందిస్తోంది 
ఎదురు దెబ్బల మాట జాగ్రత్తలు 
ఎదలను చీల్చి చెండాడుతున్నది.... 

సంప్రదాయమో సశాస్త్రీయమో 
శుచి శుభ్రతలు నేర్పిస్తున్నది 
అత్వవసరమో ఆలనాపాలనమో 
అంటరానితనమే థెరపీ అంటున్నది....

నానాయాగీ చేసిన
కలి నారదులకు నాటి 
మనుసిద్ధాంతాన్ని మళ్ళీ 
మననం చేస్తున్నది .....

కలి మాయల క్రీనీడలో 
కారు చీకట్ల కపట నీతులో 
దురంహకారుల దుర్నీతులో 
హా హా కారాలతో విశ్వమంతా గగ్గోలు....

స్వీయ నియంత్రణ సంయమనం 
శుచి శుభ్రతల విస్తారాలు 
మనుషుల దూరాలు పాటిస్తే 
మటు మాయం కాదా కరోనా...!

నగునూరి రాజన్న 
హైదరాబాదు. 

కరోనాపై... కలిసి పోరాడుదాం (3)

శీర్షిక: కరోనాపై... కలిసి పోరాడుదాం


కరోనాను ఎదురెళ్లి 
కావలించుకుంటావా? 
కనువిప్పుతో ఎదురొడ్డే  
కలేజాను సాధించు సోదరా! 

కలబడి కొట్లాడేకన్నా 
కనుచూపు మేరనే 
కట్టడి చేసి నిలుపుదాం
కదం కలుపు సోదరా!

బ్రతుకు బ్రతుకనియ్యు
బాగుందాం అందరం 
బలుసాకైనా తిని బ్రతుకొచ్చు 
బాగు కోరు  సోదరా!

విశ్వమంతా కుదేలౌతుంటే 
వినవెందుకు సోదరా....
మనుషులంతా మరణిస్తుంటే 
మాట వినవా సోదరా!

వైద్యులు నర్సులు పోలీసులు 
కుటుంబాలకు దూరంగా 
కునుకు మరిచి కునారిల్లుతున్నరు
కూసింత మనుసుపెట్టి సూడు సోదరా!

నీకొరకు నాకొరకు 
నిప్పుల కొలిమెక్కినారు
నిజమైన దేవుండ్లు వాళ్ళు
నిక్కముగా నమ్ము సోదరా!

కనపడని క్రిమికోసం 
కత్తిమీద సాములా 
కవాతు చేస్తున్నారు
కదిలిరా సోదరా!

పుట్టిన ప్రతివారికి 
మరణం తథ్యమైనా.... 
అకాల మరణాలను 
అడ్డుకుందాం సోదరా!

కంటికి రెప్పలా మనల్ని 
కాచుకుంటున్నరు పాలకులు
కరోనాపై...కలిసి పోరాడుదాం 
కదిలిరా సోదరా!

నగునూరి రాజన్న 
హైదరాబాదు. 

జగత్కల్యాణం 2-4-20

జగత్కల్యాణం
02-04-2020
శీర్షిక : అపురూప కళ్యాణం 
సంఖ్య - 383

యుగం మారినా 
జగం మెచ్చిన రాజు 
కాలం కదులుతున్నా 
జనం కోరుకునే రాజరికం...

పితృవాక్య పరిపాలనమే 
పిల్లలకు శిరోధార్యమన్నాడు...
ప్రజాక్షేమము కోరిన ప్రజ్ఞాశాలి....
పాలక పగడపు శిరోమణి..... 
ఇనవంశోత్తమ దశరథ నందనుడు .... 

సిరుల తల్లి శ్రీలక్ష్మియే 
సీతమ్మగా జనియించె... 
కారణ జన్మురాలై మిథిలా
జనకుని ఇంట జానకిగా... 

పెళ పెళ శివ ధనుస్సు విరవగానే 
గల గల నవ్విన నవవధువు సీత 
తడబడు అడుగుల రామయ్య దరిచేరి  
వడి వడిగ అలంకరించె మెడలో వరమాల .. 

ఆకాశమంత చలువ పందిళ్లు 
భూదేవంత ముగ్గు లోగిళ్ళతో 
జగతి మొత్తంగా జరుపుకునే 
జగజ్జనని రామయ్యల అపురూప కళ్యాణం...

నగునూరి రాజన్న 
హైదరాబాదు. 

Wednesday, April 1, 2020

అన్యోన్యత 1-4-20

నగునూరి రాజన్న 
అన్యోన్యత
తేది 01-04-2020 
శీర్షిక: ఇరుపక్షాల ఇగురించాలి. 
సంఖ్య. 382 

పురాణేతిహాసాల పుట్టతేనె 
ఉత్తమ ఉపనిషత్తుల భాండాగారం
సత్సంప్రదాయాల పొదరిల్లు  
అభేద్యమైన బంగారు భారతం... 

అరమరికలు కొరవడ్డ అన్నదమ్ముల చరితలు
అదను చూసిన శత్రుమూకలు 
విరుచుకుపడ్డ కథనాలు
ఎందరెందరో ఏలిరి ఏండ్ల తరబడి...... 

పొంతన లేని పోరు అలసిన అతివాదం   
సత్యం అహింసవాదం నిరాహారదీక్షలతో 
నిగ్గు తేల్చి రొమ్ము విరిచె  గాంధీ గిరి... 
తెల్లవారి గుండెల్లోన రైల్లు పరుగెత్తించె .. 

వందల ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణలతో
విధిలేక .... ఇచ్చినట్టే ఇచ్చె స్వాతంత్య్రం 
విభజించి పాలించే విషనాగుల చరితులు... 
విత్తె కదా విషబీజం...విడగొట్టి...దడిగట్టె... 
పక్కలోన వృక్షమాయె....

తలకిందుల వేలాడినా...  తండ్లాట కనపడదు... 
అర్రులు చాచి  అన్యోన్యత ప్రదర్శించినా... 
అర్థం చేసుకోలేని అపరిపక్వ అకతాయితనం....
భగవంతుడే  మంచి మనసివ్వాలని కోరుకుంటా.... 


నగునూరి రాజన్న
హైదరాబాదు. 

మార్దవం

మార్దవం 
తేది 31 -03 -2020 
శీర్షిక - మార్దవం మచ్చు తునక 
సంఖ్య - 381

ఆటవిక సంపదల అలంకృతం 
ఆత్మీయతలకు కొలువైన నిలయం
అక్షర సరస్వతి ఆలయ పరిసర క్షేత్రం
అత్యంత విశాల అవిభాజ్య  ప్రాంతం.... 

వందల పుస్తకాల వస్త్రగాలితం 
సంతులిత సమీక్షల సంపదల గని 
కాలమిస్ట్ నుండి కవిత్వం కథలు నానీలు 
కథలతో కవన రంగాన నిలిచిన కలికితురాయి....  

అలతి అలతి పదాల కూర్పుతనం 
అందమైన భావగణాల విరుపులు 
సుందరమైన విషయ సంపదలు 
మానవీయ కోణపు ఆవిష్కరణల సృశింపులు....  

స్వతహాగా సాహితీ పుత్రుడైనా 
ప్రత్యక్షంగా పరోక్షంగా స్ఫూర్తి నింపుతూ 
సాహితీ సభలకే విలువైన సమయ కేటాయింపుతో 
మాతృ భాషపై మమకారం చాటిన మేటి....  

మనిషిలోన మాటలోన  సంతులనం 
రచనలోన సమీక్షలోన సద్విమర్శల మార్దవం ... 
నడుస్తున్న చరిత్రలో మార్దవానికే ప్రత్యక్ష సాక్షి 
మార్దవానికే మచ్చుతునక మన గురువు గారు..... 


నగునూరి రాజన్న 
హైద్రాబాదు 

మనోధైర్యం

మనోధైర్యం
30-03-2020
శీర్షిక - నడిపించేది..... 
సంఖ్య - 380

పుట్టి పెరిగిన పరిస్థితులు...
చుట్టూ జరిగే ఘటనలు...
మనసు తెరపై వదిలే గుర్తులకు
ప్రత్యుత్తరమై పడిలేచే కెరటం.... మనోధైర్యం 

అనావృష్టి కరువు కాటకాల కల్లోలాలల్లో 
అతివృష్టి తుఫాను భీభత్సాలల్లో 
ఆరుగాలపు శ్రమ శ్రీమంతం ఆవిరైనా.... 
అడుగడుగున ప్రోది చేసుకునే హాలికుడు.... 

కార్గిల్ సియాచిన్ శిఖర తలాలలో 
కన్నుకుట్టే కపట పొరుగు చేష్టలతో 
ఎముకలు కొరికే చలి దుప్పటిలో 
కునుకు మరిచి నిలిచిన సైనికులకు
మాతృ దేశంపై ఉన్న మమకారమే .... 

రాకాసి చీకట్లు రాశి పోసుకున్న వ్యవస్థలో 
రెక్కల కష్టాలకు తప్పుడు లెక్కలోలె 
ఎన్ని చేసినా లెక్క నిండని ఏమార్చే లోకంలో 
బతకాలంటే కావాల్సింది..... 

పుట్టి బుద్దెరిగిన నాటి నుండి 
ప్రచురణలో జరిగే అచ్చు తప్పులోలె 
పేరు మార్చుకుంటున్న పెద్దరికాలతో 
రంగు మార్చుకుంటున్న రాజరికాలతో
సాలె గూడు బందీ క్రిమిలా బతకడానికి
 బలమంతా కూడదీసుకుంటున్నాడు...సామాన్యుడు. 

మొక్కవోని మనోధైర్యాలే దిక్సూచి దివిటీలై
ముందుండి నడిపించేది. 

నగునూరి రాజన్న 


హైద్రాబాదు. 

దార్శనికులు

దార్శనికులు
తేది- 28-03-2020
శీర్షిక- సమాజమే దేవాలయం ... 
సంఖ్య - 379

స్వార్థ చిట్టాలను చంకనుండి దింపేసి
మానవ శ్రేయస్సులను నెత్తికెత్తుకున్న 
విశ్వ కళ్యాణ అభిలషణీయులు
సమకాలీన మహర్షులు మహనీయులు 
సమాజమే దేహమనే దార్శనికులు ...    

గత చరిత్రల ఆకళింపులతో
వర్తమానాల అవగతంతో 
భవిష్యత్  గమ్యాలను గుర్తించి
గమన పథాలను నిర్దేశించేవారు.... 

పరిస్థితులులెంత విచ్చిన్నమైనా 
పొరుగు క్షేమం తదుపరే పొందు లాభం 
అందరు బాగుండాలి అందున నేనుండాలి 
వ్యక్తిగతం కన్న సామూహికం సమాజమే మిన్న....

రంగమేదైనా శైలి రంగు వారిదే
రంగు రుచి వాసన వారి పేరనే
దశాబ్దాలు శతాబ్దాలు మారినా
కాలమేదైనా కనేది వినేది వారి మార్గమే..... 

ఆధ్యాత్మిక పరమహంసలు 
అహింసావాద జాతిపితలు 
అఖండ భారత ఉక్కుమనుషులు 
అంతరిక్ష కలల అధిపతులు..... 



ఎందరో మహానుభావులు 
నా దేశ ఉన్నతికి... వారందరికీ వందనాలు ... 

నగునూరి రాజన్న 
హైదరాబాదు. 

మట్టివేళ్ళు

మట్టివేళ్ళు
27-03-2020
శీర్శిక .  మనకు పుట్టినిల్లు... 
సంఖ్య : 378 


మట్టివేళ్ళు మనకు పుట్టినిల్లు 
మనిషి పుట్టుకకు చిరునామా 
గిట్టినా.. తనే అక్కున చేర్చుకునేది
పుట్టుక నుండి పుడమి చేరువరకు 
గట్టిగ మనిషి మట్టినే నమ్ముకున్నడు

మట్టిన పుట్టిన చెట్టు.. తోబుట్టువే
మనిషికి శ్వాసనిచ్చి పోషణ చేస్తుంది
వేళ్ళు మట్టితో ముద్దాడితేనే 
మట్టి వేళ్ళతో  పారాడితేనే
పట్టుబట్టి మనకు తిండి దొరికేది 
పండయినా కాయయినా పంటికిందికి... 

మట్టి ఎంత మంత్రించినదో కదా 
తీపి చేదు పులుపు వగరు కారం 
సప్తవర్ణాలతో సైతం అలరిస్తుంది
మట్టి నీరు తోడైతే పంటలిచ్చి ఆకలి తీరుస్తుంది.... 

మట్టి చెట్టు తోడైతే మనిషికి
సువాసనలు వెదజల్లుతుంది...
సుప్త చేతనావస్తకు దారితీస్తుంది...
అది ఇది అను తేడాలు లేవు ...
అన్నీ తానై అమరుస్తుంది.... 

స్వార్థం వదిలితేనే సంఘం నిలుస్తుంది 
గట్టి నిర్ణయంతోనే మట్టి చెట్టు దక్కుతుంది
మట్టి...చెట్టు.. దక్కితేనే మనిషికి చిరునామా 
మనిషి మిగిలితేనే మంగళకరమైన విశ్వం... 

నగునూరి రాజన్న
హైదరాబాదు. 



ఎడబాటు

ఎడబాటు 
తేది- 26 -03 -2020 
శీర్షిక- మరువలేని మననం .... 
సంఖ్య- 377 

మమతానురాగాల కొలతల గీటురాయని 
మౌన మానసిక సంగమాల సంతులితమని 
గుణగణాల వివేచనాల విశ్లేషితల రాజహంసని 
స్వభావ సందర్భాల వడబోతల వస్త్రగాయితమని.... 
గుర్తుకొస్తున్నాయి పదే పదే .....మరువలేని మననం  

అనుక్షణం తన్మయత్వం చెందిన 
అమ్మ అనురాగాల అనునయాల స్పర్శ... 
ప్రతిక్షణం పరిణతి  పొందగలిగిన 
నాన్న పెంపకంలోని మందలింపు.... 

కనివిని ఎరుగని కలుషితాల 
కంగుతింటూ కడతేర్చుకుంటున్న సమయాన... 
కరోనా కబంధ హస్తాలలో బంధింపబడి 
క్షణం క్షణం పరితపిస్తున్న వేళ ..... 

పాలకులు పత్రికలు ప్రముఖులు  
పనిగట్టుకుని జాగ్రత్తలు తెలుపుతుంటే.... 
నాటి మీ సూచన పరంపరలే గుర్తుకొస్తున్నాయి 
మరువలేక  మననం చేసుకుంటున్నా.....మీ ఎడబాటును  

కర్కశమైన నాటి అరాచక అంటువ్యాధులను  
కఠోర దీక్షలతో అధిగమించిన మీ ఆత్మస్థైర్యం... 
గుంభనంగా గువ్వలై సంసారాలను ఈదిన సందర్భాలు  
చేతిలో పది లేకపోయినా...చతికలబడని చక్రాలైన వైనం ... 

కలిగిన దాంట్లో కలో గంజో... 
ప్రాణం నిలుప పచ్చడి మెతుకులో... అన్న మీ 
ఆర్ద్రత మాటల ఆనుపానులు ఆకళింపు చేసుకోలేకపోయాము..... 
మరువలేక  మననం చేసుకుంటున్నా.....మీ ఎడబాటును.... 

నగునూరి రాజన్న 
హైదరాబాద్   

శార్వరి ఉగాదికి స్వాగతం

శార్వరికి స్వాగతం
తేది - 24-03-2020
శీర్షిక - ఒంటరి  ఆహ్వానం... ! 
సంఖ్య - 376   

కవలలైన తెలుగు లోగిళ్ళు 
కలిసి మెలిసి ఆహ్వానించే స్థితి లేదు.... 
వింత పోకడల వికారితోనే విసిగిపోయాము తల్లీ 
అంటు వ్యాధితో తంటాలు పడుతూ 
తలంటు పోసుకుంటున్నాము ....  

కత్తులు లేకనే కుత్తుకలు తెగి పడ్తున్నయి 
కనిపించని శత్రువుతో కవాతు చేస్తున్నం ... 
పేరుకు నువ్వు "శార్వరి " వయినా 
నిర్వికార నిశి చీకట్లను తరిమి 
పెన్నిధివై నిలువమ్మా పెద్ద దిక్కుగా..... 

కష్టకాలపు కూడలిలో దిగ్బంధమై పోయాము 
కానరాని భవిష్యత్తులో కొట్టుమిట్టాడుతున్నం....
కరోనా పుణ్యమాని కలిసి మెలిసి నడవలేం..... 
కమనీయపు తొలి తెలుగు పర్వానివీవు   
కంటి వెలుగువై కనికరించమని వేడుకుంటున్నం ... 

కాలమనే కష్టసుఖాల జీవిత పుస్తకములో 
మరో కొత్త పేజీ కొలువైన తరుణాన
గడప లోపలే బందీ అయిపోయాము. 
కమ్మని కబురేదైనా కడుపు నింపుతుందేమోనని 
కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నం..... 

ప్రకృతిలో ప్రభవించే పరవశం 
ఋతువుల్లో పల్లవించే వసంతం
కాల మార్పుతో కలిసి వచ్చే కనికరం 
మా జీవితాన అద్భుతమై సంభవించాలని 
మరి మరి వేడుకుంటూ ఒంటరిగానే పలుకనా ఆహ్వానం...!

నగునూరి రాజన్న
కరీంనగర్

శోభిత కిరీటాలు

శోభిత కిరీటాలు 
తేదీ - 23-03-2020
శీర్షిక -అమ్మలంతా నిత్య శోభిత కిరీటాలే ...... 
సంఖ్య - 375

కరోనా వైరస్ పుణ్యమో 
కర్మ ఫలితాల పాపమో 
కట్ట కట్టి కబంధ హస్తాల్లో బంధిస్తుంటే.... 
కనికరం లేని రోగ నివారణ చర్యల్లో భాగంగా.... 

ప్రభుత్వ ప్రవేట్  ఆఫీసులు మూసేసారు 
రవాణాలు అన్నీ నిలిపేశారు 
ప్రజలు సమూహంగా తిరిగితే 
పట్టుకోలేమని.. నిరోధించలేమని ... రోగ వ్యాప్తిని.... 

మాళ్లు సినిమా హాళ్లు మూసారు 
వ్యాపారాలన్ని కట్టడి చేసారు 
మానవ తప్పిదమైన  మాయా రోగం నుండి 
మనల్ని మనం రక్షించుకునేందుకు.... 

బడులు గుడులు మూసేసారు 
జన సమూహాలను నిరోధించాలని
పిల్లల పరీక్షలన్నీ నిలిపేశారు 
భావి తరాల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని... 

పరిణామాల తీవ్రతలను 
పరిధి దాటనీయకుండాలని 
పాలకుల మార్గదర్శకాలను 
ప్రజలంతా పాటిస్తున్నారు..... 

అన్నింటికీ సెలవులిచ్చినా 
అందరికి సెలవు దొరికినా ...... 
ఆడవారికి మాత్రం అస్సలు లేదు సెలవు 
అందుకే అమ్మలంతా నిత్య శోభిత కిరీటాలే ...... 

నగునూరి రాజన్న 
హైద్రాబాదు.