వీడ్కోలు
31 -12-2019
శీర్షిక - ఆనవాయితీ.....
సంఖ్య - 341
ప్రకృతిలో పరవశిస్తున్న ప్రతీది
రాయి రప్ప వాగు వంక చెట్టు చేమ గుట్ట
పక్షి జంతువు ఆదిగాగల అన్నీ పులకరిస్తాయి…
కాలంతో కరచాలనంచేసి పలకరిస్తాయి…
కాలానికి విలువల వలువలు తొడిగి
కదం కలిపి నడుస్తాయి... కబోదిలాంటి
కళ్ళు లేని చెట్లు సైతం కమనీయమై…
చిరాయువుగా చిగురులేసి…కొమ్మ రెమ్మలతో కాలానుగుణమై పూతపూసి… కాత కాసి…
కమ్మని ఫలాలతో కనువిందులు చేస్తాయి…
జ్ఞానం లేని పక్షులు జంతువులు కూడా
రమణీయమై బోధిస్తాయి…రందిలేని
జీవితాలకు రసరమ్యమైన తావులకు
రయ్యిమంటూ వలసలతో ఖండాంతరాలకు….
ప్రతి ప్రారంభానికి యాంత్రికాలు
నిండిన ఓ ముగింపులా…
మనసారా పంపే ఆహ్వానానికి
మనసు రాక చెప్పే వీడ్కోలు ఓ జంట కార్యం...
వ్యక్తిగతమైనా వ్యావహారికమైనా
అధికారికమైనా అనధికారికమైనా
దేని విలువ దానిదేనాయె.........
జీవిత పాఠాలు నేర్వ బడిబాట నడిచే
గువ్వపిల్లలకు తల్లడిల్లే తల్లి మనసుతో
గుప్పెడంత గుండె దిటవు జేసుకుని
కాదనక కదిలించు చెయ్యి బై బై యటంచు.....
కంటికి రెప్పలా కాచుకున్న కన్న బిడ్డను
మంచి చెడుల మతలబులేంటో
మచ్చుకైనా తెలియని గుంభనాల
గువ్వల చెన్నునికి అరయగ ధారబోసి
గుండెలరచేత బెట్టుకుని బిక్కు బిక్కు మంటూ
బక్కచిక్కే బ్రతుకు జీవులు......అమ్మానాన్నలు
సెలవులేని కాలమని తెలుసు…
ఉత్తర దక్షిణాయణాల ఊసు లేదు…
పొద్దు మారదు..మబ్బు కురవదు..
ఆకు రాలదు చెట్లు చిగురించవు..
కొమ్మ పూయదు కోయిల కూయదు..
ప్రకృతి పరవశించదు పక్షులు పులకించవు..
పంటలు పండవు కడుపులు నిండవు
సశాస్త్రీయత లేని సంధికాలము…
కలసిరాని ఇంగ్లీషు కాలమని తెల్సినా
కాలానికి వీడ్కోలంటూ జనమంతా కోలాహలం....
కానిపనులు చక్కపెట్టకపోవడానికి
కావాలి మనుషులకొక కుంటి సాకు…
నగునూరి రాజన్న