Sunday, March 22, 2020

కరోనా...ఓ కరోనా 2

కరోనా...ఓ కరోనా 2
21-03-2020
కలిసి కట్టుగా ఎదిరిద్దాం 


కుక్కుటములు పొట్టేల్లు మిక్కుటమంటివి   
మీన మేషములకేమో వంత పాడితివి 
మత్తుపానీయముల తెగ చిత్తడి చేస్తివి  
కాయగూరలకు కనీస విలువ లేదంటివి 
పండ్లు ఫలహారమంటే...  ఫరువ లేదంటివి... ఓ మానవా.. 

అది ఇది అను తేడాలు మరిచితివి 
అడుగు ముందుకేసి అన్ని కావాలంటివి 
కనిపించిన ప్రాణి నెల్ల కబళించ చూసితివి.... 
పెడ రెక్కలు విరిచి పచ్చి ముక్కలు నోట కరిచి ... 
కనికరములు వీడి కర్కోటకములు చాటి... .ఓ మానవా... 

శుచి శుభ్రతలను ఎద్దేవా జేసితివి 
మడి ఆచారాలను మంటగలిపితివి 
సంస్కృతి సంప్రదాయాలను అటకెక్కించివి  
ఆడిపాడితివి అడ్డగోలు తైతక్కల పబ్బుల్లో  క్లబ్బుల్లో 
వీడితివి నీతి నియమాలు నిజాయితీ క్రమశిక్షణలు .... ఓ మానవా! 

మనిషి వివేచనం చాల గొప్పదని
జీవకోటిపై ఆధిపత్యం వచ్చెనని
నీకు నీవే కితాబులిచ్చుకుంటే...ఏల ?
చూడు జరిగిందేమిటో ప్రత్యక్ష సాక్ష్యం.... 
విర్రవీగే క్షణం నీదికాదని విశ్వ నీరాజనం ... తెలుసుకో మానవా !

ప్రకృతైనా ప్రకోపిస్తే ప్రచండమైన
పర్యావరణ పర్యవసానమే అవదా !
తఫాను వరదలే కాదు మిత్రమా
తుడిచిపెట్టుకుపోయే సునామీలు కూడా!
చలిచీమల చేత చంపబడ్డ బలమైన సర్పమల్లే 
సాంతంగా మానవాళిని కబళించగల  సూక్ష్మ క్రిమిని... నేను !

అహర్నిశలు అసమతుల్యతలను ఆహ్వానిస్తే 
అనుచితాలను అనుసరిస్తే అసూయలను పోషిస్తే 
అనాహ్వానితంగానైనా అరుదెంచనా .... కరోనాగా !
అనామికనై  నిలిచినా... అచంచల విశ్వాసం తో 
అదుపు చేయగలవు మిత్రమా...మీరంతా కలిసికట్టుగా నిలిస్తే ..! 

నగునూరి రాజన్న 


కరీంనగర్ 

కరోనా....ఓ కరోనా

కరోనా....ఓ కరోనా 
తేది- 21-03-2020
శీర్షిక - కరుణించవే ఓ కరోనా 
సంఖ్య- 374 


కరుణించవే ఓ కరోనా 
కాసింత... కూసింత...
కనికరించవే ఓ కరోనా ....

తెలిసో తెలియకో మనిషి 
చేసిన జీవహింసను.... 
మనసున పెట్టుకోకు
మంకు పట్టు పట్టుకోకు.... 

కాంతి వలయన్నంటావు 
జీవ కాంతినే లాక్కుంటావా?
మహమ్మారిలా వచ్చావు 
మనిషి జాడలే కబళిస్తున్నావా..! 

చీని దేశాన పుట్టినావే
చిందులేసి విస్తరించావే...!.
కంటిమీద కునుకులేకుండా 
కంచెలన్నీ దాటుతున్నావే....!

ప్రపంచ యుద్ధాలను మించిపోయి 
విశ్వమంతా విస్తరించావు....! 
రోజుల్లోనే అల్లుకుపోయి 
వేలల్లోనే మింగుతున్నావు.....!

మనిషి మారిపోయి 
పొరుగు కళ్యాణం కోరితే....
ప్రకృతి ప్రశాంతించి 
పరిఢవింపుకై  ప్రయత్నించదా! 

నగునూరి రాజన్న
హైదరాబాదు.  

నిరర్ధక స్వప్నాలు

నిరర్ధక స్వప్నాలు 
తేది- 20-03-2020
శీర్షిక- నిరర్ధక స్వప్నాలు 
సంఖ్య- 373

మేను ముసుగులో మెదిలే 
మేధోమధన భావనలు
కనుల తెరలలో క్షణకాలం కదిలే 
దృశ్య రూపాంతకాలు .....

పట్టుదల ప్రశిక్షణ ప్రణాళిక ఓర్పు నేర్పులు 
మార్గదర్శకమయిన కృషి మాత్రమే
స్వప్న సాకారాల రహదారులు..... 
స్వాప్నికుల సమున్నత శిఖరారోహణం.... 

స్వప్నం సాకారం కావాలంటే 
సకారాత్మక సానుకూల ఆలోచలు...
ధర్మ దక్షతతో కూడుకోవాలి
న్యాయ సమ్మతమై నడచుకోవాలి.....

అలసత్వం అందిపుచ్చుకుని 
అదృష్టం కై ఆశపడి శ్రమను వీడి
పరాకును పొదువుకుంటే
అన్నీ స్వప్నాలు  నిరర్దకాలే సుమా !

నిత్య స్వప్నలోక సంచారమే 
మిధ్య బతుకుల బాగోతం... 
స్వప్నాలకే జీవిత సర్వాంకితం 
నిరర్ధకాలకు నిలువెత్తు నిర్వచనం... 

నగునూరి రాజన్న
హైదరాబాదు. 

అలల అంతరంగం

అలల అంతరంగం 
తేదీ -18 -03 -2020 
శీర్షిక - మేథోమదనం..ప్రగతిపథం.. 
సంఖ్య - 372


అంతరంగ సముద్రంలో ఆటుపోట్ల 
భావోద్వేగాల అలలు చెలరేగుతూనే ఉంటాయి... 
కష్ట సుఖాల బడబాగ్నులు కలకాలం 
కవాతు చేస్తూనే ఉంటాయి.... 

ప్రశాంత పరిమళాలు వెదజల్లే 
మానసిక సాగరం సైతం అప్పుడప్పుడు 
అనూహ్య ఉద్వేగ ఉప్పెనలకు 
లోనవుతూనే ఉంటుంది.....

ఆరాటాల కెరటాలు అలల ఘోషితాలూ
ప్రతిక్షణం పదనిసల కదలికల  
పునశ్చరణలు చేస్తూనే ఉంటాయి...

ఆగమ్య గోచరమైన అంతరంగాన
మేథోమదన మేలి గుర్తింపులతో 
పయనిస్తూ ప్రగతి గమ్యానికి  
పథ గమనం నిర్దేస్తూంటుంది.... 

ఏటికైనా మదిలోని మాటకైనా
ఎదురీది నిలవడం ఏనాటికి జరగదు 
పట్టుదల ప్రశిక్షణ మచ్చికలతో మాత్రమే 
ప్రకోపాల ప్రకృతిని ప్రశాంతపర్చొచ్చు...

నగునూరి రాజన్న
హైదరాబాదు. 

వాస్తవం లోకి తొంగిచూడు

వాస్తవం లోకి తొంగిచూడు 
తేదీ -17 -03 -2020 
శీర్షిక - పరధర్మం కన్నా మన ధర్మం మిన్న 
సంఖ్య - 371 

ఆర్భాటాలకు ఆడంబరాలకు ఆమడగా
డాంబికాలకు భిన్నంగా 
హంగులు రంగులు అద్దకుండా
మెరుపులు మెరుగులు దిద్దకుండా
అచ్చంగా ఆచరించేది ......

కృత్రిమాలను అలంకరించుకుని 
మేడిపండు మెరుగు నవ్వులు పులుముకున్న
కరచాలనం కత్తి కన్నా పదునైన ఆయుధమని... 
ఆత్మీయతలను ఆరబోసే దండం
నమస్కారము గొప్ప సాంప్రదాయ సంస్కారమని 
మన ధర్మం హిమశిఖర మహోన్నతమని....
విశ్వ  కీర్తనలు విన సొంపాయే వీనుల విందాయె! 



స్వచ్ఛ శుభ్రతను చంకన బెట్టుకుంటే 
ప్రతీ అనుభవం పచ్చి చాదస్తామంటూ 
మంచిని కూడా వంచన రాజకీయమని 
వత్తాసు పలికినోళ్లవి వెకిలి చేష్టలని.....
జన జాగరణ నేడు జాతి గర్వమాయె....!

ఇప్పటికైనా మించింది లేదు మిత్రమా 
గీత బోధనా సూత్రమే సుమా!
పరధర్మం కన్నా మన ధర్మం మిన్న 
వాస్తవమెంత కటువైనా
వాదించక తొంగిచూడు....

నగునూరి రాజన్న
హైదరాబాదు. 

మనసు పెడితే...

మనసు పెడితే...
తేది- 16-03-2020
శీర్షిక- మనిషికి సాధ్యమే సుమా!
సంఖ్య- 370

రాతి గుహల జాడల్లో తచ్చాడిన 
మానవుడు చక్రం తిప్పిన చరిత్రతో 
అడుగు తీసి అడుగు వేస్తూ అంచెలంచెలుగ
ఎదిగి సంఘజీవి అయ్యాడు..... 

జక్కన్న చేతిలోని జనం మెచ్చిన శిల్పమోలె
పడావు పడ్డ నేల తల్లికి పచ్చకోక చుట్టాడు...
సాగరాలను సొరచేపలా  ఈదగలిగి
సముద్రగర్భాన్ని శోధించి సాధించాడు....

ఆకాశమార్గాన పక్షిరాజై పరుగెత్తగలిగి
అవని మొత్తంగా చుట్టేయగలిగాడు...
అనంత విశ్వ ఛేదనతో పాలపుంతల 
పరిక్రమలను సైతం పసిగట్టే స్థితికొచ్చాడు.... 

అంతేనా అంటే....

కోట్ల జనాల కష్టాన్ని కూడా కొల్లగొట్టగలడు 
కాలయముడై కబంధ హస్తాల బంధించి....
చర్వితచరణమైన చరిత్రలు చూసినా
చలించని ప్రబుద్దులు.. కలికాల మహిమలో...

కష్టమైన మంచి పనులకు కాలమెక్కువ 
కడహీనపు పనులకు కష్టం తక్కువ....
శత్రుత్వంతో మూడు..మిత్రుత్వంతో అరంటూ..
జయవిజయుల జన్మ రహస్యాల వలె .....

మంచైనా చెడైనా మనిషికి సాధ్యమే సుమా!

నగునూరి రాజన్న
హైదరాబాదు. 

నిశ్శబ్ద ప్రతిధ్వని

నిశ్శబ్ద ప్రతిధ్వని 
తేది - 14 -03 -2020 
శీర్షిక - ప్రళయమే రావొచ్చు! 
సంఖ్య - 369

ఉదయాత్పూర్వపు తొలి సంధ్యన  
అమృత ఘడియల ఆరంభాన 
ఆవరించిన నిశ్శబ్ద ఛేదనలో ప్రతిధ్వనించు 
ప్రాసయుక్త పక్షుల కిల కిలా రవములే కాదు...

నిశ్శబ్దం ప్రతిధ్వనిస్తే నిలువున ముంచే
సంతులిత తరంగాల సంద్రం సైతం 
కప్పులు ఎగిరించే తుఫాన్లు మోసుకొని
నిప్పులు చెరిగే సునామీలను చూపదా! 

అవును నివురుగప్పిన జన సామాన్యుని 
నిశ్శబ్దం నిరాఘాటంగా ప్రతిధ్వనిస్తే 
రాజకీయ రాబందుల గోళ్లు చిట్లుతాయో...
పాలకుల పరాచికాలకు ఫులుస్టాపులో...... 
అధికారుల ఆగడాలకు అడ్డుకట్టలో .....
బల్లకింది బడాబాబులకు చిల్లు జేబులో...

నిశ్శబ్దం చేతకాని తనమూ కావొచ్చు...
నిలకడైన వినయ విధేయతలు కావొచ్చు...
నిలకడ లేని అలసత్వమూ కావొచ్చు....
నీతి వదిలిన స్వార్థమూ కావొచ్చు.....కానీ 
ప్రతిధ్వనిస్తే మాత్రం ప్రళయమే రావొచ్చు! 

నగునూరి రాజన్న
హైదరాబాదు. 

మనిషి లోపలి సంభాషణ

మనిషి లోపలి సంభాషణ
తేది - 13-03-2020
శీర్షిక- అందుబాటైన అంతర్ దిక్సూచి.  
సంఖ్య - 368

అంతరంగం అడుగున నిక్షిప్తమై 
తరతమాలను తడబడే నడవడికలను 
తప్పులు దొర్లిన సందర్భాలను 
ఎత్తి చూపుతూ తొంగిచూస్తుంది.... 

అడుగడుగున ఆరిందలా
అన్నీ తెల్సిన పెద్ద మనిషిలా 
అందరిని అంటిపెట్టుకునే 
సర్వాంతర్యామియై సరిదద్దడానికి సై అంటుంది....

సందర్భ సాంద్రతను బట్టి 
సమరానికి సంకేతించి 
సమస్య పరిష్కారానికి 
సామ దాన బేధ దండోపాయాలను సైతం
సూచించి సమాధానపడుతుంది....    

అనుక్షణం అనుసరించినవారిని 
అందలమెక్కించి ఊరేగిస్తుంది 
అమరజీవులను అహింసావాదులను
అబ్దుల్ కలాములను ఆవిష్కరిస్తుంది...

కప్పగంతుల్లా దాటేసేవారిని 
కాలగమనంలో కరిగిపోయే 
కాలం మరిచే హ్రస్వ చరితులుగా 
కబోది జీవితంలా మిగిలిపోతారు .... 
అందరికి అందుబాటైన అంతర్ దిక్సూచి. 

నగునూరి రాజన్న
హైదరాబాదు

కలల బేహారి

కలల బేహారి 
తేది- 12 -03 -2020 
శీర్షిక - నమ్మకాల్ని వమ్ము చేయకు... 
సంఖ్య-367

ప్రాణకోటికే ప్రచండం మానవ జన్మం 
యుక్తాయుక్తాల వివేచనం మనకే సొంతం
అయినా మత్తు వదలని విక్రమార్కులం 
ఆలోచనలు కూడా ఆచరించలేని అనాథలం 
కాలు చేయి కదపలేని కబోదులం...... 

కలల లోనే కదలాడే కరటకులం
కర్మంటే మా ఇంటా వంటా లేదంటాం 
ఉన్నది లేనట్టు... లేనిది ఉన్నట్టు .... 
ఊహల్లోనే విహరిద్దాం...శూన్యంలోనే ఊరేగుదాం.. 

ఎదుటి వారి కలలను ఏరుకుంటారు
ఏపారంగా మార్చి బతికేస్తుంటారు
ఎవరేమనుకున్నా పట్టించుకోరు
ఎప్పటికైనా మారతారేమోనని చిన్న ఆశ.... 

కొంత మంది మాత్రమే ఉంటారు
నిజాయితీగా కలలు కంటారు 
నిబద్దతతో అడుగులు వేస్తారు
నియమనిష్టలతో అమలు పరుస్తారు
 
ప్రణాళికలతో పనులు చక్కబెడతారు
క్రమశిక్షణలకు చిరునామై నిలుస్తారు 
హిమశిఖరమైనా అలవోకే అధిరోహించ 
అజరామరమై నిలుస్తారు ప్రజా గుండెల్లో... 
అబ్దుల్ కలాంగారిలా....  

నగునూరి రాజన్న
హైదరాబాదు. 

అంతస్సూత్రం

అంతస్సూత్రం 
తేది- 11 -03 -2020 
శీర్షిక - అందరు బాగుండాలి 
సంఖ్య-366 

మల్లెలు మందారాలు మరువం ధవనాలు 
బంతులు చామంతులు కనకాంబరాలు
వర్ణాలెన్నయినా వంకలెరుగని మాలకాధారం 
మరుగునుండే  శ్వేతవర్ణపు అంతస్సూత్రం... 

అన్యోన్యతలకు ఆలవాలమై 
ఆప్యాయతలకు చిరునామై
విశాల విశ్వంలో వెలుగొందిన
వివాహ వ్యవస్థ మన స్వంతం.... 

ముష్కరులే మూలమయినా 
నిష్కర్షగా శిక్షించని దేశం.....
వంద మంది దోషుల్ని వదిలినా...  
నిర్దోషిని శిక్షించొద్దనే న్యాయ సూత్రాల నమ్మకం .... 

పద్దెనిమిది సార్లు శత్రువు ఓడినా 
ప్రాణం మీదికి వస్తుందని తెల్సినా 
పరిత్యజించి క్షమా భిక్ష పెట్టడం 
మన దేశ సంస్కృతి సంప్రదాయం.... 

భిన్న సంస్కృతుల సమాగతం 
విభిన్న మతాల సమ్మేళనం 
భరతజాతి ఆమూలాగ్రం 
అదేకదా మన రాజ్యాంగం..... 

ప్రకృతి పట్ల  ప్రజలైనా
ప్రజల పట్ల పాలకులైనా
పాటిస్తేనే నిండు ప్రమోదం 
ఆత్మసాక్షిగా అంతస్సూత్రం.... 


నగునూరి రాజన్న
హైదరాబాదు

ఋణానుబంధం

ఋణానుబంధం
తేది10-03-2020
శీర్షిక: ఋణానుబంధ రూపేణా....
సంఖ్య - 365

జన్మభూమి నా దేశం నమోనమామి 
కర్మభూమి నా దేశం నమో నమామి  
పాప భీతి..మంచి చెడుల సమాగమం 
దైవ చింతన.. పాపపుణ్యాల ప్రక్షాళనం  

పుణ్యాపుణ్యాల పూర్వజన్మ కృతములే
పురుడుపోసుకునే ఈ జన్మ బంధాలు .... 
పైవాడి పకడ్బందీ అరమరికల అల్మారా 
గిజిగాడి అల్లికే... బంధాలు బంధుత్వాలు

అమృతం చిలికించే అమ్మయినా 
అనురాగం పండించే నాన్నయినా 
ఆప్యాయతలు నింపే తోబుట్టువులయినా 
ఆదరువుగ నిలిచే సంతానమయినా...... 
ఆపన్నులయే మిత్రులయినా.....

ఆలోచనలకు ఆశ్చర్య కడలిగా అనిపించినా
తార్కికాలకు తాత్సారం లేకుండా 
అవపోశనల అంతిమ సారం... సంస్కారం...
అదేకదా మన సంస్కృతి సాంప్రదాయం....

పశువులకైనా ప్రజలకైనా 
పాలనలకైనా పాలకులకైనా 
పలుకుబడిగా నడిచేది...నిలిచేది...
పక్క పక్కన నిలిచి కాచేది .. కంచె సుమా! 

క్రమశిక్షణల తరాలకై
కదలిన విజ్ఞ గణం 
కదిలించిన నియమ తోరణం 
కలకాలం నిలిచే రూపకల్పనం... 

నగునూరి రాజన్న
కరీంనగర్

ఇదా లోకం

ఇదా లోకం 
తేదీ - 04-03-2020
శీర్షిక - ఇదే లోకం ....  
సంఖ్య - 364

అవును బాబూ ! అవును ఇదే లోకం ... 
నువ్వు నేను బతికేది ఇదే లోకం ... 

కృతం నుండి త్రేతం  
త్రేతం నుండి ద్వాపరం 
ద్వాపరం నుండి కలియుగం......... 
కాలం మారుతూనే ఉంది..... 

అవసరాలకు అనుగుణంగా
కాలమాన పరిస్థితులకనుకూలంగా
జీవిత గమ్యం మారుచున్నది    
జీవన గమనం మారుతూనే ఉంది .....   
నాటి వ్యవస్థలను తూలనాడె నైజం  
స్వైన్ ఫ్లూ లను స్వాంతనపరచగలదా .... 
అన్న పానీయాల అలవాట్లన్నీ ఒక్కటే అని 
కరోనాల కరచాలనాలు చేయగలరా  ... 

పూర్వ పునశ్చరణల విమర్శలతో  
పుణ్యకాలాలు  హరించవా ..... 
ఆహార నియమాలు ఆదమరిస్తే 
స్వచ్ఛతలను విస్మరిస్తే నాడైనా నేడైనా  
సమాజ గమనం గమ్యం అధోగతే..... 
మంచి చెడుల మధ్య దూరం ఎప్పుడైనా రేఖా మాత్రమే మిత్రమా!


నగునూరి రాజన్న 
కరీంనగర్

ఆలాపన

ఆలాపన
తేది 03-03-2020
శీర్షిక: కనులు మూసినా...... 
సంఖ్య: 363

ముదము గొలిపే ముచ్చటైనను
మదిని తాకిన మతలబైనను
అంతరంగమును కదిలించిన అచ్చెరువైనను
ఆత్మను తట్టిన అపురూపమైనను
మరుపురాని మెరుపు సంఘటనలైనను
దిగ్భ్రాంతిని దిగమింగిన దిటవైనను
ముప్పిరిగొన్న ముచ్చమటల భయానకమైనను
మసక మసకగా మనోఫలకంపై కదలాడుతూ
మనసున కలవరిస్తూ మాటన  పలవరిస్తూ
సమయాసమయాలను సందర్భాలను మరచి
కనులు మూసినా....  తెరిచినా...... 
కంఠం సవరించినా .... 
లోలోపలి లోతుల్లోని స్మరణకు సంకేతమై
అప్రయత్నపు అలవాటుగ.... అలవోకగా...
పలవరించే పలుకులు....నిలువరించే నీడలు....
ఆలపించే అప్రయత్నపు మధుర గీతాలు.....

మధు మాసపు ఉదయ సంధ్యన
పల్లె తరువుల పచ్చని మలయ మారుతంలో 
పక్షుల కిల కిలా రవము కూడిన
నులివెచ్చని రవి కిరణాన
నెచ్చెలినుదురు తాకే ముంగురుల
ముగ్ద రూపం పదే పదే మనమున
దోబూచులాడుతున్నది...... 

నగునూరి రాజన్న
కరీంనగర్ 

అల వైకుంఠపురములో....

అల వైకుంఠపురములో....
తేది 02-03-2020
శీర్షిక: మన భారతాన.... 
సంఖ్య- 362

అంగాంగము నిలిపిన ఆనందం 
సర్వాంగ సుందర నందనవనం  
దివ్యాంగులతో పోల్చితే కనే వైనం 
భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మం..... 

ఆత్మీయతల పెంపకాల అమ్మానాన్నలు 
అనురాగాల నందించే తోబుట్టువులు 
ఆప్యాయతలను పంచే  బంధు మిత్రులు 
అనుక్షణం అన్నీ అమరిన బతుకు పందిరిలో ..... 
   
అమర్చి నిలిపిన స్వేచ్చా స్వాతంత్య్రం 
అహోరాత్రులు అంటిపెట్టుకున్న సైనిక పహారా 
అనుకున్న చోట బ్రతగ్గలిగే వెసులుబాటు 
అదే కదా స్వాతంత్య్ర భారత సౌరభం ...... 

వేదఘోషకు వేదికైన ఈ దేశం 
పురాణాలకు పుట్టినిల్లు మన దేశం 
ఇతిహాసాలకు ఇంద్రధనస్సుల సరస్సు 
సంస్కృతి సత్ సంప్రదాయాలకు చిరునామా .... 

అప్పుడప్పుడు అక్కడక్కడా తప్పని 
అల్పుల ఆగడాలు రచ్చలు తప్ప 
అల వైకుంఠపురమే కదా అధికులకు 
అపురూప మానవ జన్మ మన భారతాన.... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ 

సద్యోగం

సద్యోగం 
తేదీ - 29-02-2020
శీర్షిక -పరిఢవిల్లు ప్రజాక్షేత్రం....   
సంఖ్య- 361

ఉద్యోగం పురుషలక్షణం  నాడు 
లింగ బేధముల బేరీజు లేదు ఈనాడు.... 
సిఫారసుల చిట్టాలు కొందరికి 
పచ్చనోట్ల ముచ్చట్లు ఇంకొందరికి.... 

ఆర్థికతలకన్న అర్హతలెక్కువ ఒకచోట 
అరకొర అక్షరాస్యతకు పట్టాభిషేకములింకోచోట  
యజమానులిచ్చు మాసపు రాళ్ళ యావ కన్న 
మచ్చ తెచ్చే ప్రజా పీడనలే  
ఫలహారముల విందుభోజనములు....  

ఉద్యోగాల జాడ  లేక ఉసురు కొందరికైతే  
జీతం ... గీతం ... రెండూ కావాలి ఉన్నవారికి  
తారతమ్యం మరిస్తే తమాషా చూస్తుంది 
తక్కెడ లెక్కకు మించితే  బొక్క బోర్లానే ...... 

యథా రాజా తథా ప్రజా
పాలనల నుండి పారే మురుగు 
అధికార దర్పాల పొగరు 
ప్రజాక్షేత్ర ప్రగతికి కాకూడదు లంగరు....

ఆధికారముంటే అంధకారం కారాదు 
దర్పముంటే సమర్పణం కారాదు.... 
చదువుకు తగిన కొలువు.... బలం  
కొలువుకు తగిన జీతము.....విలువ 
విలువలు కలిగిన సేవ...... నీతి నిజాయితీ 
అదే కదా సద్యోగం.... పరిఢవిల్లు ప్రజాక్షేత్రం.... !


నగునూరి రాజన్న 
కరీంనగర్ . 

నాన్న

నాన్న 

అవని చేరిన విత్తనానికి 
అంకుర బీజదళమోలే
అకుంఠిత రక్షణ కవచమై 
అనుక్షణం పహారా కాస్తాడు... 

గుండెలపైన ఓలలాడించి
గుంభనంగా ప్రేమ పంచుతాడు 
గురుతరంగా శిక్షణలిచ్చి 
గుండెలోనే పొంగిపోతాడు... 

అవసరాలన్నీ అందిపుచ్చుకుని 
ఆర్ధికతలను సమకూరుస్తాడు... 
ఆప్యాయతల పోషణలిచ్చి
అనురాగలనందిస్తాడు.... 

స్వావలంబనలకు సంకేతమై 
సంతృప్తిని పొందే తత్వం .... 
భావి మార్గదర్శి అయి 
బతుకు గమ్యం బోధిస్తాడు... 

కాల గమనంలో కనుమరుగౌతున్నాం 
కన్న ప్రేమల కమ్మదనాల గుర్తింపులో 
ఆస్వాదిస్తే అద్వితీయం అమేయం 
ఆదరిస్తే అనునిత్యం అవుతుంది ద్విగుణీకృతం. 

నగునూరి రాజన్న 
కరీంనగర్. 

వివేచనం

వివేచనం
తేది 28-02-2020
శీర్షిక - సమపాళ్ళ అవపోశనం
సంఖ్య- 360 

జీవరాశుల్లోకెల్లా ఉత్తమం 
మనిషి జన్మందామా అంటే...
అందరికి సమంగా ఉండదాయే! 

అమ్మల పెంపకమే అసలు
రహస్యమందామా అంటే....
అందరిని పెంచేది అమ్మలే కదా ! 

అక్షరజ్ఞానం అందించిన 
గురువర్యులది అందమా అంటే....
అందరికి విద్యలందించేది ఆ గురువులే కదా!

నాగరికత నేర్పిస్తుందనుకుంటే 
గల్లీలో ఉన్న పాటి పొరుగు నమ్మకం 
ఢిల్లీలో కూడా దొరకపాయె..... 

ఆణిముత్యాలన్నీ ఆల్చిప్పలో జారిన
స్వాతి చినుకులే అయినా 
స్వాతి చినుకులన్నీ ఆణిముత్యాలు కానట్టే... 

ఆత్మీయతల రంగరింపుల అమ్మతనం 
అసువులు నిలపే అమృతతుల్య భుక్తవిధానం
గురుతర బోధింపుల గురుత్వం 
సాన బెట్టి నేర్చుకున్న సహజీవనం 
బతుకు జీవన గమనంలో సంఘ జీవనం
బరువు బాధ్యతల జవాబుదారి  పాలకగణం 
సమపాళ్లలో అందించిన అవపోశనం.....

మంచి చెడులకు మధ్య జరిగే 
రేఖామాత్రమైన ఆలోచనా సంఘర్షణల 
వివేచనే మానవాళి సంక్షేమం కోరుతుంది... 
పవిత్ర మానవ జన్మకు ఊపిరిగా నిలుస్తుంది... 

నగునూరి రాజన్న
కరీనగర్  

కొనగోటి మీద జీవితం

కొనగోటి మీద జీవితం 
తేది- 27-02-2020
శీర్షిక -  క్షణ భంగురం... ఈ జీవితం 
సంఖ్య - 359

జీవితం క్షణ భంగురమని తెలిసినా 
ఆశ చావని అర్భకులు రాజకీయనాయకులు 
తర తరాలకు సరిపడా సంపాదనలు 
అధికార మత్తు అవధులు దాటితే ......

ప్రాణాలు ఫణంగా పెట్టి తెచ్చుకున్న స్వాతంత్య్రం 
పదిలంగా కాపాడుకోవాల్సిన ప్రజాతంత్రం 
ఆర్భాటాలకు అర్రులు చాచే అధికార పక్షం
ప్రేక్షక పాత్రల పెద్దన్న చిత్రం మన ప్రతిపక్ష గణం
పాలకుల పరాచికాల పటాటోపానికి అపహాస్యం... 

సిద్ధాంతాలు లేని బుద్ధావతారాలతో 
ఎద్దేవా అవుతుందేమో దేశ పురోగతి 
మత ప్రతిపాదికల మల్లగుల్లాలు 
దీర్ఘకాల ప్రాయోజితాలు విస్మరింపు 
స్వల్పకాలిక సర్దుబాట్లతోనే సాగతీత ..... 

అక్కరకు రాని వెక్కిరింతల హామీలు 
సంబంధం లేని సాధ్యాసాధ్యాలు 
స్వావలంబనలు గాలికొదిలిన సంక్షేమాలు 
సోమరుల ఉత్పత్తి కేంద్రాలయిన
పనికి(మాలిన) ఆహార పథకాలు 
పన్ను చెల్లింపుదారుల పగిడి మోతలు
పందికొక్కులకు ఫలహారాల సబ్సిడీలు

వ్యక్తి పూజలతో వ్యవస్థలు కుదేలు
చేతివాటపు అపసవ్య పన్ను వసూళ్ళతో 
చిల్లు పడ్డ నావలు ప్రభుత్వ ఖజానాలు..... 
జవసత్వాల జలగలు ప్రభుత్వ ఉద్యోగులు 
లంచాలకు మంచమేస్తున్న  ప్రజా భక్షకులు....

విశ్వమెరిగిన విధి విధానమే అయినా 
అధికులు అవగాహన చేసుకున్నా
అల్పులు మాత్రం అక్కడే తచ్చాడుతూ 
చిరునామాల చిత్తు కాగితాలౌతున్నారు.... 

నగునూరి రాజన్న

మట్టి మనిషి ఆకాశం

మట్టి మనిషి ఆకాశం
తేది- 26-02-2020
అవినాభావ సంబంధం
సంఖ్య- 358

చిత్రంగా మనిషయినా చిన్మయంగ మానయినా 
పచ్చని చెట్టైనా పట్టుకోలేని గుట్టయినా 
పరుగు పరుగున ఎగిరే పక్షైనా
పడిలేచే సంద్రమయినా పయనించే మేఘమయినా 
ప్రాణమున్న జీవమైనా ప్రాణం లేని పంజరమైనా
పంచభూతాల పరిణామమే ప్రతీది !

జన జన్మానికైనా ఉదర పోషణానికైనా 
ఊతమే మనిషికి మట్టి ఆకాశం రెండూ.....
అందరు మట్టి మనుషులే అయినా 
ఆ మట్టిని నమ్ముకున్న ప్రత్యక్షుడు మాత్రం హాలికుడే...

ఆకాశం  కరుణించకపోయినా 
అరుణిమ అనుగ్రహించకపోయినా 
అవకాశానికై ఆరాటపడుతూనే ఉంటాడు 
ఆకాశంవైపు ఆత్రుతగా ఎదురుచూస్తూ
ఆశల పల్లకినెక్కి ఊరేగుతూనే ఉంటాడు...

కన్న బిడ్డలోలె పంట చేలను పెంచినా 
కంటి పాపలోలె ప్రతి పూట సాకినా 
పంటకు కనీస మద్దతు ధర లేక 
పాలకుల పరాచికాలకు బలౌతూనే ఉన్నారు....

పేరుకు రైతే రాజనే నానుడే ఉన్నా
పెత్తనమంతా పరుల చెంత......
నివురు గప్పిన నిప్పై నిన్ను నన్ను దహించక ముందే 
బాధ్యత తెలిసిన పాలకులుగా 
బాధలు తెలిసిన అధికారులుగా  
కష్టసుఖాలెరిగిన  పౌరుడిగా చేయూతనందిద్దాం....

నగునూరి రాజన్న 
కరీంనగర్. 

విశ్వ జీవన రాగాలు

విశ్వ జీవన రాగాలు 
తేదీ - 24-02-2020
శీర్షిక - కలుషితాల కల కలం.... 
సంఖ్య - 357

గ్రహాల ఉపగ్రహాల గగన సమూహం 
సూర్య చంద్ర నక్షత్రాల సమాహారం
ఒక్కొక్క పాలపుంత ఒయ్యారం 
పలు పాలపుంతల ఆవిష్కారం...ఈ విశ్వం 

భూచరాల జలచరాల భువనం 
వాయు విహంగాల భాండాగారం
అనేక జీవ రాశులకు ఆలవాలం 
అమృతమైన ఈ ప్రకృతి సోయగం.... 

పవిత్రమైన ప్రకృతి పరిష్వంగంలో
ఫరిడవిల్లాల్సిన ప్రజా జీవనాలు 
పలు కలుషితాల పర్యావరణ రణంతో
పరాకు పాలకుల స్వార్థ చింతనలతో
విరాజిల్లాల్సిన విశ్వ జీవన రాగాలు విల విల.....

మానవాళి మర్కట  రూపాంతరమయినా
బ్రతుకు బ్రతుకనియ్యంటు బాటలు వేసినా 
కాలమానాల మార్పుల ప్రవాహంలో 
కరిమింగిన వెలగపండే కలి ధర్మం.... మిత్రమా!

నగునూరి రాజన్న 
కరీంనగర్

వారసత్వం 2

వారసత్వం 2 
18-02-2020

నరుడే వానర రూపాంతరమని 
నాటి రాతి యుగం చీకటి మయమని 
చక్రంతోనే జీవనగతి మారిందని .... 
ఆటవికం ....  ఆధునికానికి మారినా..... 
అంతా గడచిన చరిత్రే  అయినా .... 
మంచి చెడుల సమాహారమే మన వారసత్వం....
మననం చేసుకుంటే ...మిత్రమా !

అడుగు తీసి అడుగు వేస్తూ .... 
అంతరిక్షం దాకా చేరుకున్నా..... 
అప్పుడప్పుడు ఆలోచన చెలిమెల నీళ్లు 
తోడుకుని  గొంతు తడుపుకోవాలనిపిస్తుంది.... 

పచ్చి మాంసాల  ఫలహారాలు వద్దని  
వండి వార్చుకుని.... పద్ధతి మార్చుకున్నా ...... 
వడివడిగ అడుగులేసారేమో .... కొంతమంది
వద్దన్న దానిమీదే వాటమయిన మోజు ... మనందరికీ... 
 
వడపోతల వస్త్రగాయితాన వశ పరచుకోను 
అవపోశన పట్టిన ఆరోగ్యాల  అచ్చ ట్లు ముచ్చట్లు  
పరుగు లంఘించి  ....  ఫక్తు శాకాహారులైనారేమో....
మత్తు పానీయాల చిత్తడి నుండి ....  
పలాయనం చిత్తగించారేమో... నచ్చనోల్లు ....

ఒడ్డు పొడుగులోన ఒక్క పోలిక లేవు 
ముద్ద నోటికందించుటలో ఒద్దికనే  సుమా  ! 
ఐదు వేళ్ళు మనకున్న చేతులవి .... 
ఐక్యత చాటే కదా ఆ క్షణమున ..... 

తారతమ్యముల  తన్నులాటలన్నీ 
తప్పక అవగతమౌను కదా..... 
మనసుబెట్టి చదివితె  మన చిన్ననాటి   
మూడు చేపల కథ ముచ్చటగా..... 

అంటు ముట్లన్న ఆరాటమైతేనేమి 
ఆలింగనాల ఎంగిల్ల  వివక్షలైతేనేమి 
అంటూ వ్యాధుల మూలాలు తెలుసుకుని .  
అమలు పరిచారేమో విజ్ఞులార్యులు 
ఆమోద మోదమున .... నాటి వ్యవస్థలు.  

వానరాల నాటి వాగు వంకలు....  
చెట్లు పుట్టలు కొండా కోనలు...... 
వాసాలన్నీ మార్చుకుని 
గుహలు డేరాలు గుడారాలు గుడిసెలు.... 
ఇగురమైన ఇళ్ళు వాకిళ్లుగ.....  
అందమైన లోగిళ్లుగా 
అలంకరించుకోలేదా .... 
రేపటి రూపం రూపు మార్ప ..... కష్ట జీవులు 

చోరుని జూసిన...  శునకం భౌ భౌ మనంగ   
నమ్మకమున వెంట నడచు నడిరేయైనా... 
తక్కిన కుక్కలు బహుదూరమునుండైనా.... 
గ్రామసింహం పాటి జ్ఞానం గాదె 
మనుజుని నడవడి మహిలో ఎంచగ .... 


నగునూరి రాజన్న 
కరీంనగర్

వారసత్వం

వారసత్వం 
తేదీ- 18 - 02 -2020 
శీర్షిక - వారసత్వాలు.... మానవాళి  
సంఖ్య - 356 

వేద పురాణ ఉపనిషత్తుల సమాగమం   
జగతికి మార్గనిర్దేశమైన జాతి విలువల ఔన్నత్యం....  
ప్రకృతి ప్రసాదించిన పంచభూతాలు
తరం నుండి తరానికి నిలిచే సాక్షీ సంతకాలు.... 

తాతల తండ్రుల తనువులు పంచుకుని 
కొడుకులు మనుమల జన్మల కోనసాగింపే....
మంచి చెడులను మాటవరసకు పాటిస్తూ 
మదిన నిలుపుకుని మసలు తత్వమే....

సంస్కృతి సాంప్రదాయాల సచ్చరితలు 
అలవాట్లు పొరపాట్ల ఆచరణాత్మకాలు....
సంగీత సాహిత్య కళల కదంబ కాణాచీలు 
విద్య ఉద్యోగ నైపుణ్య పాలనల విశదీకరణలు.... 

శుచి శుభ్రతలను సూటిగా పొదువుకునేది  
ఆచార వ్యవహారాలను అక్కున చేర్చుకునేది 
కట్టుబొట్టు కట్టుబాట్లను కణికట్టుగా నిలుపుకునేది 
తిండి తిప్పళ్లను దివారాత్రాలు పాటించేది.......
 
స్వార్థాల  తట్ట బుట్టలను తలకెత్తుకుని 
సాంకేతికతను సంకన బెట్టుకుని 
అలసత్వాలను అక్కున జేర్చుకుని 
వరుసలు వారసత్వాలు అన్నీ మరస్తున్న మానవాళి......   


నగునూరి రాజన్న 
కరీంనగర్ 

కవితాపుష్పకం

కవితాపుష్పకం 
తేదీ 17_02_2020
శీర్షిక - మానవీయత.... 
సంఖ్య _355

కనిపించినవి వినిపించినవి 
కనబడని మైదానంలో కవ్వించి 
కలియబడి తిరగబడి అణచబడి                       
ఎగిసిపడితేనే కడలి ప్రశాంతత చేకూర్చేది...... 

కాల మాన పరిస్థితులకు 
కదిలే హృదయం చేసే కవాతు .... 
కసితో కుత్తుకలు కోసే 
కత్తులు సైతం చేయలేని పని..... 

ఆశయాల గమ్యాలకు 
ఆలోచనల గమనాలతో 
అలవోకగా రూపమిచ్చి చేయు 
అపురూప మార్గదర్శనం...... 

రవికన్నా ముందే పసిగట్టి 
కదిలిస్తుంది కవి హృదయం....  
మేటిగా సూటిగా సుందరంగా 
వాడిగా వేడిగా హృద్యంగా అందిస్తుంది..... 

అలౌకిక ఊహలకు  అందమైన రూపమిస్తూ  
ఆద్యంతం గుప్తమైనా క్లుప్తపరుస్తూ 
సమస్యా పరిష్కారాల సానుకూలతలను 
మానవీయంగా  ఆవిష్కరిస్తూ అల్లుకుపోయేది ....... 

నగునూరి రాజన్న 
కరీంనగర్

Monday, March 16, 2020

కరి వేప


అంశం: కరి వేప
తేదీ:  18 -10 -2019 
శీర్షిక - హరిత చరితము
సంఖ్య- 306

హరితమే కదా మానవ చరితమూ... హితం 
కరుకు బెరుకులు కనబరిచినా...కమ్మదనం 
సువాసనలు వెదజల్లే....సమ్మోహనం 
సురుచిర వంటకాల ..... సుగంధం ...... 

కొలువతరమా నీ కమ్మదనం ....
విలువల జోడింపే.... ప్రతి వంటకం 
ఇంపదు నీవు లేక .... తాలింపు 
సొంపదు నీవు కలువక... పులిహోర దద్దోజనం ....

సూక్షంలో మోక్షమై నిలుస్తావు 
మోతాదు చిన్నదైనా 
మోగిస్తావు  నగారా రుచులలో....
పచ్చళ్ళైనా పరిమళించు నీ చిగుళ్ళతో......

కాల్షియములు నిండుగా కలిగి 
క్యాన్సర్లను దూరముంచే ప్రభావశీలివంటూ 
కడు సుగుణాలను సంతరించుకున్న 
కరదీపిక ఔషధాన.... ఆయుర్వేద విఫణియందు....అయినా.....

కలిమాయల ప్రభావమో ఏమో కాని
కన్న తల్లిదండ్రులను 
కలిసి నివసించే బంధు మిత్రులను 
అవసరానికి వాడుకుని 
ఆనక విస్మరిస్తూ .....  మనుషులు
నిన్ను సామెతగా వాడుకుంటున్నారు సుమా...