Saturday, May 25, 2019

దారి తప్పిన గమ్యం

నగునూరి రాజన్న  
అంశం - దారి తప్పిన గమ్యం
తేదీ- 09-05-2019
శీర్షిక - పాలకుల పని తీరు ... 
సంఖ్య - 181

నాగరికత పేరుతో 
నడక నేర్చుకున్న 
నవీన మానవునికి 
ప్రతి అడుగున 
ప్రకృతి గొడుగై నిలిచింది. 
అభివృద్ధి పేరుతో 
అడుగేస్తున్న 
అలసత్వపు  మానవుడు మాత్రం 
ప్రకృతిని పట్టించుకోక 
ఫలితం ఆశిస్తున్నాడు. 

చాప కింద నీరులా 
పచ్చని అరణ్యాలపై
పడగ విప్పిన పాద ముద్రలు 
పగ బట్టి అతి నీల లోహిత 
కిరణ నిరోధినిని  ఛేదించే 
వరకు అర్రులు చాస్తే..... 

వాగులు, వంకలు, 
వాలు పర్వతాలు 
వాయసాల పాలవుతుంటే....  
వానల చిరునామాలు
వాటంగా గల్లంతవుతూంటే.... 
వారెవ్వా అనుకున్న మానవ జీవితం 
వామ్మో...  అనే స్థాయికి  చేరుకుంటుంటే.... 

ప్రజల నిరక్షరాస్యత,అవగాహన లేమి   
ప్రజానాయకుల నిర్లజ్జ , నిస్సిగ్గు  
పాలనాధికార్ల అలసత్వం, మంద బుద్ధి   
పర్యావరణ పతనానికి రాచమార్గాలౌతుండే ....   
పచ్చ పన్ను పేరుతో ప్రజల స్వేదం 
పదుల వత్సరాల వసూళ్లు  
ఎక్కడేసిన గొంగళి అక్కడే మాయం ..... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

కోరికలే గుర్రాలైతే

నగునూరి రాజన్న 
అంశం : కోరికలే గుర్రాలైతే 
తేదీ : 08 -05 -2019 
శీర్షిక - విచక్షణతో విజయం  
సంఖ్య : 180 

పంచ వన్నెల రామ చిలుకల్లా 
పంచేంద్రియాల పలకరింపులు
మానవ మనో ఫలకంపై 
రంగు రంగుల ప్రపంచాన్ని 
ఆవిష్కరించే సందర్భాలలో 
వ్యక్తిగత,ఆర్ధిక, సాంఘీక,నైతిక శీల 
పరిధులు  దాటే ఆలోచనలెన్నో....  

కోరికలు గుర్రాలైనప్పుడు.... 
గుర్రం ఎంత వేగమైనా మచ్చిక 
చేసుకుని స్వారీ చేయగలిగినవే...  
ఎటొచ్చి చీటా లాంటివైతేనే  ప్రమాదం.... 
వేగాన్ని జయించే క్రమంలో మానవుడు 
అంతరిక్ష నౌకల్లో ఇతర గ్రహాలకే   
పయనమౌతున్నాడు..... 

ఉబ్బి తబ్బిబ్బవకుండా 
అంకురమయ్యే మంచి చెడుల
లాభ నష్టాల బేరీజుల విజ్ఞతతో 
ధర్మ న్యాయ బద్దమైన వాటికి 
పటిష్టమైన ప్రణాళిక,
పరిపుష్టమైన దీక్ష దక్షతలతో 
క్రమానుగత క్రమశిక్షణల అమలుతో
పరులను ఫణముగ పెట్టక 
నేర్పుగ సాధించిన యొప్పును మెప్పును.   
విచక్షణతో విజయం సాధించవచ్చును. 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం రిచ్మండ్ )

ఇల్లు మారడం -2

ఇల్లు మారడం


పాత  ఇళ్లో  ... కొత్త ఇళ్లో... 
సొంతిళ్లో.... కిరాయిళ్లో... 
ఏదయినా  మానసమే...   

అన్ని రకాల మన జీవితాన 
అలరించే మంచి చెడులకు 
ఆలవాలమయ్యే దర్పణం .... 

ఇరుగు పొరుగులతో 
ఇక్కట్లు సక్కట్లలోన ... ఇగురంగా     
ఇచ్చి పుచ్చుకోవడాలే కదా... 

అవసరా నవసరాలను 
బేరీజు వేసుకుంటూ .... 
విడగొట్టి విసరడమే కదా ........ . 

పాచి బూజుల్ని భరతం బట్టి 
ప్రతి వస్తువును తడిమి తుడిచి 
ప్రత్యేకంగా చుట్టుడే సుమా .... 

దుమ్ము ధూళి దులుపంగ 
మూతి ముక్కు నిండి 
గొంతు చెడి ఒళ్ళు హూనం నమ్మండి !

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు 
ఒకప్పటి నానుడి .... 
ఇల్లు మారి చూడు  ఇప్పటి మాట.... 


నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

అక్షయ తృతీయ

నగునూరి రాజన్న   
అంశం - అక్షయ తృతీయ
తేదీ - 07-05-2019
శీర్షిక - ఇవ్వడం లోన ఇంపు
సంఖ్య - 179

ఆచారాలైతేనేమి ఆర్యులు చెప్పినవైతేనేమి 
కాలానుగుణంగా ప్రకృతిలో జరిగే మార్పులకు 
మనల్ని మనం రక్షించుకోడానికి పాటించే 
ఆరోగ్య రక్షణకు అనువైన సూత్రాలు ...  

సంప్రదాయాలైతేనేమి సంస్కృతి అయితేనేమి 
మహోన్నత మానవ జన్మకు మూలమైన 
మనకు తెలియని మహాత్యమైన అతీత శక్తికి 
ఆరాధనా భావంగా అర్పించుకునే 
ఆధ్యాత్మిక ప్రణామాలు....... ముక్తికి మార్గాలు.

అడుగడుగునా అలరించే పండగలైతేనేమి 
అందరిని ఉత్సాహపరిచే ఉత్సవాలైతేనేమి 
అన్ని దారుల ఉన్నత గమనం ఆ  వైపే 
అది గుర్తెరిగి గమ్యం చేరుట మన ధర్మం. 

యుగం మారి జగం మారగానే 
స్వార్థం పెరిగి సంయమనం కోల్పోయి
ఇవ్వడం లోని ఇంపు సొంపులు తగ్గి  
పుచ్చుకోవడం మాత్రమే పుర్రె గుణమైంది .... 

అక్షయ తృతీయమంటే ..... 
అన్నపూర్ణాదేవి అవతరించిన రోజు 
అందరికి చేర్చాలని సూచించే రోజు 
అన్ని పనులకు అనుకూలం అయినా 
అందరు మెచ్చే పనులు చేయమని.... 
ఆధ్యాత్మికానికి అంకితమవ్వమని .... 
నిన్ను నీవు శోధించుకోమని...  
ఆదిలక్ష్మిని అయ్యవారిని పూజిస్తూ 
అమ్మా నాన్నలను ప్రేమించమని... 
గ్రీష్మ తాపం పెరిగినందున వీలయితే 
ఇతరులకు దాహం తీర్చమని..... 
పొదుపుకో మదుపుకో బంగారం కాని 
పులిని చూసి నక్క వాతకు కాదు
మతమేదయినా ప్రాంతమేదయినా
మంచిని వంచించి చెడును చేరదీయమని కాదు
 చెడును ఛేదించి మంచిని మననం చేసుకోమని...


నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం : రిచ్మండ్ )

Monday, May 13, 2019

ఇల్లు మారుడు

అంశం - ఇల్లు మారుడు   
తేదీ - 06-05-2019
శీర్షిక - ప్రాణ సమానం 
సంఖ్య - 178

నాకేమో దగ్గరి మిత్రుల ఓదార్పు .... 
మా శ్రీమతికైతే ఇంటి చుట్టు ఆడవాళ్ళ
ఓదార్పులతో బాటు ఏకంగా దుఃఖాలే....
ఇల్లంటే ఇనుమడించిన అనుబంధాలే కదా..... 

కష్ట సుఖాలలో, కలిమి లేములలో
కలిసి పంచుకున్న విడదీయరాని బంధాలే కదా...  
కకా వికలమయిన మనసుతో నెమరు వేసుకుంటే  
కమ్మని అనుభూతులకు లెక్కే లేదు... 
.....  
ఒకటా  రెండా ఏకాంగా  
ముప్పై తొమ్మిది సంవత్సరాల అనుబంధం ..  
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగం... 
పదోన్నతులపై ప్రాంతం మారినా
నివాసాల పద్ధతంతా అదే సుమా ... 

వేల ఎకరాల గృహ సముదాయ విస్తీర్ణం 
లక్షల మొక్కల పెంపకం ....
శశిరంలో చలితో  గజగజ ... 
గ్రీష్మం లో ఏకంగా 3 డిగ్రీల వేడి తక్కువ....
అందరూ ఆడిపోసుకునే రామగుండంలో ...    
24 *7 నీళ్లు, విద్యుచ్ఛక్తి, , టి వి కేబుల్ కనెక్షన్లు  
ఆటలకు,పాటలకు అచ్చమైన వేదికలు 
అందరు మెచ్చే ఉద్యానవనాలు 
ఆసీన యుక్త ఆట మైదానాలు,
అన్ని రకాల వ్యాపార,వాణిజ్య సముదాయాలు,   
ఆరోగ్య యోగా కేంద్రాలు, క్లబ్బులు, కల్యాణ మంటపాలు 
ఆటల్లో భాగంగా ఈత కొలను 
ఆధ్యాత్మిక కేంద్ర ఆలయాలు, 
ఇరుగు పొరుగు ఇరువై ఊళ్లకు కలిపి 
ఈగలు దోమల నివారణకు సైతం 
ఇంపుగ వార్షిక ఒప్పందాలు .....  

గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూర్డ్ జీవితాలనిచ్చి 
సంఘంలో స్టేటసిచ్చి సంతృప్తిని నింపింది 
పండగలకు, ఫర్నీచర్లకు,వాహనాలకు,ఇళ్లకు
బహు చక్కగా  అడ్వాన్సులిచ్చి 
బతుకంతా బాధ లేకుండా ఓ ఇంటివాణ్ణి కూడా చేసింది . 

పట్టాలు పుచుకుని వచ్చిన మాకు 
ప్రశిక్షణలిచ్చి పరిణతి నింపింది అమ్మలా 
కన్న తల్లి తండ్రులను , కట్టుకున్న ఇల్లాలును  
కని పెంచిన పిల్లలను సదా కనిపెట్టుకుంది . 
అత్యవసారాలకు ఆదుకుని 
అవసరాలన్నీ తీర్చింది. 
ఆలన పాలనలతో బాటు 
చదువులిచ్చి పిల్లలకు 
సంస్కారాలు నేర్పింది. 

మా పెళ్లితో ప్రారంభమయిన జీవితాన ....  
పిల్లల పురుళ్ళు, పుట్టిన రోజులు ,
అక్షర శ్రీకారాలు, పాఠశాల చదువులు...
వాళ్ళు జీవితాన స్థిరపడడం.... 
పెళ్లిళ్లు, పేరంటాలు అన్నీ అక్కడే.... 
చివరకు అమ్మా నాన్నల అంతిమ యాత్రలు

ఇంటికొచ్చిన బంధు బలగాలైతే 
ఇంద్రభోగపు బతుకులంటూ కితాబిచ్చేవాళ్ళు ...
ఇల్లు మారిన రోజయితే 
గుండె  అంతా  పిండినట్టు, 
గొంతంతా తడారి, నాలుక పిడుచకట్టి 
ప్రాణ సమమైన  బంధమేదో 
బలవంతంగా లాగేసినట్టు 
బ్రతుకే భారమేమో... అన్నట్టు 
భవిష్యత్ అంతా శూన్యమన్నట్టు 
మాటల్లో చెప్పలేని బాధ అనుభవించినది మాత్రం  
బలీయమైన వాస్తవం..... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

పౌరాణిక ప్రాభవం

అంశం -  పౌరాణిక ప్రాభవం 
తేదీ - 04-05-2019
శీర్షిక - సంస్కృతి సాంప్రదాయాల చుక్కాని  
సంఖ్య - 177
     
మనిషి పాంచ భౌతికం... 
మనసు అశ్వ వాహకం ...
ప్రకృతిలోని జీవరాశి నుండి 
మనని మనంగా వేరయి 
చక్కని మార్గములో 
పెంపొందింపచేసుకోడానికి 
చుక్కాని లాంటి జ్ఞాన 
భాండాగారాలు  
మన పౌరాణికాలు ...... 

ఆస్తికులైనా నాస్తికులైనా     
ప్రపంచంలోని 
మతమేదైనా మనిషయితే చాలు 
పౌరాణికాలే మనిషికి  ప్రాణవాయువు... 

ఈ రంగుల ప్రపంచంలో 
ముసుగు నీడను మోస్తున్న
మాయ మనసును విడిచి
నీకు నువ్వు కనిపించేదాకా
నువ్వెక్కడున్నావో నువ్వే వెతకాలంటే 
ఓ దివిటీ కావాల్సిందే ....   
 
వేదాలు,ఉపనిషత్తులు, 
పురాణాలు, రామాయణ ,
మహాభారత భాగవతాలు 
ఆది గాగల అనేక పౌరాణికాల
సారాంశ  ప్రతిబింబాలే
మన సంస్కృతి,సంప్రదాయాలు  
 
యుగాలు మారినా 
తండ్రి మాటకు కట్టుబడి, 
ఒకే మాట,ఒకే పత్ని అన్న 
నానుడికి ప్రతీక ... రామాయణం. 

వారసత్వం వరుస కాదు 
ప్రతిభే ప్రధానమంటూ 
రాజకీయాల నిర్వచనం 
రాజసంగా తెలిపింది ... మహాభారతం. 
 
నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

పలుకే బంగారం

అంశం - పలుకే బంగారం
తేదీ - 03-05-2019
శీర్షిక - బోలో స్వతంత్ర భారత్ కీ  జై .....
సంఖ్య -176

వందల ఏండ్ల బానిస బతుకుల నుండి 
రక రకాల నిరసనలతో, అనేక రకాల 
తిరుగుబాట్లతో వందల వేల మందిని 
కోల్పోయి, చివరకు సత్యాగ్రహాలతో 
నిరాహార దీక్షలతో పోరాడి పోరాడి 
ఎదురించి సాధించుకున్న ప్రజాస్వామ్యం... 

నోముకున్నోడి ఫలం 
నోచుకున్నోడి వంతన్నట్టు .... 
ఎందరెందరో మహానుభావులు 
ఎదురొడ్డి పోరాడితే వచ్చిన  
స్వాతంత్రం ...... పగ్గాలు మాత్రం 

చివరాఖరుకు దేశం “తల” తాకట్టు 
పెట్టి 72 రెండేండ్లు...  కాదు కాదు..... 
ఇంకెన్నాళ్లో ..... రావణకాష్టానికి 
కారణభూతమయిన  గొప్పోరి  చేతిలో 
పడినందుకు ...... 
1952 డిసెంబర్ 15 అర్ధరాత్రిన 
పొట్టి శ్రీరాములుగారిని  పోగొట్టుకుంటే 
కానీ భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడలేదు ...... . 
(అదే సరయిన సమయం లో 
పలుకే బంగారం......చేసిన ఫలితం )

ఇక  పేరులో గాంధీ తగిలించుకుని... 
చేసిన మంచి పనులన్నీ  చెడ్డగా తోచే విధంగా .... 
అడుగడునా అవకతవకలతో ... 
నమ్ముకున్నోల్లను అందలాలెక్కించి  
తాను చెప్పిన కుందేటికి 
మూడే కాళ్ళు అనే రకంగా........ 
అవసరానికి మించి “అత్యవసరాన్ని” 
చాటించి.....  
దేశ ప్రజలందరి దృష్టిలో చెడ్డదై.... 
వెలుగొందగా....... . 
ఎన్నో మార్లు ... సార్ల  పలుకులు.... 
పత్రికల పలుకులు....  బంగారమే ఆయె ). 

ఇక  2009 నుండి 2014 మధ్య కాలం....  
ప్రపంచము లోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం 
చెప్పాల్సిన పనే లేదు..... 
పదవి మాత్రమే పేరుకు....
పెదవి విప్పని సరుకు......
మనందరికి మూల విరాట్టు
కోట్ల ప్రజాధనం కొల్లగొట్టబడినా... 
నోట్ల గోల నాకెందుకులే.... అని 
పలుకే బంగారమయిన 
పెద్దమనిషితో ........ 
పలికితే బాగుండనుకున్న దేశ ప్రజలు....  

బోలో స్వతంత్ర భారత్ కీ  జై ..................  

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

శైశవ గీతి

అంశం -శైశవ గీతి
తేదీ - 02-05-2019
శీర్షిక - బాల్యం
సంఖ్య - 175

కొంగు చాటు బాల్యం 
కొంటె పనుల మాల్యం 
అవక తవక చిలిపి పనులు 
అరవిరిసే అందాల నవ్వులు 
చీటికి  మాటికి అలకలు 
అమ్మంటే  అనురాగం   
నాన్నంటే గారాబం
అన్నదమ్ముల అనుబంధం 
చెల్లలంటే ఆత్మీయం.....  

ఎండైనా, వానైనా 
ఇంటయినా  బయటయినా 
ఆడేదే  ఆటలు...గెంతులు 
ఛుక్ ఛుక్ రైలు..  
వాన వాన వల్లప్ప...  
దాగుడు మూతలు 
దండా కోలు .... 
ఇల్లు వాకిళ్లు  
దద్దరిల్లే కేకలు....   
 
చిర్ర గోనెలే చిరు తిళ్ళు
గోళీలాటలే గుగ్గిళ్ళు 
తాడు బొంగరం తన్నులాటలు 
కుండా టోక్కా తో కుదేలు  
కబడ్డీ ఆట ఖతర్నాక్ లు 
చేను చెలకలు కంగాలు   
తోటలన్నీ రచ్చ రచ్చ ... 

చెరువు నిండితే ఆనందం 
మత్తడి దునికితే ఆహ్లాదం 
ఒర్రె పొంగితే ఉయ్యాలే
నీటిని చూస్తే కడుపు నిండు.... 
ఇంద్ర ధనుస్సుతో మంద్రహాసం   

చుట్టమొస్తే ఎగిరి గంతే 
మామలోస్తే మారాము 
అమ్మమ్మ అయితే 
అతి గారాభం ..... 
కష్ట సుఖాల ఇష్టాలు.... 
బరువు బాధ్యతల 
బంధాలెఱుగం.... 


నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

మే డే తేదీ 01-05-2019

అంశం- మే  డే                    
తేదీ 01-05-2019
శీర్షిక - పనిగంటలు ... పనికి విశ్రాంతి 
సంఖ్య - 174

ప్రకృతి లోనే జననం .... 
ప్రకృతి లోనే పయనం.....   
ప్రకృతి లోనే మరణం......  
ప్రకృతి లోనే నేర్చుకున్నాడు.... అయినా   
ప్రకృతి ప్రాభవాన్ని మాత్రం పుణికి పుచ్చుకోలేదు .... 

ప్రకృతి లోని పంచ భూతాలకు లేదు 
పశు పక్ష్యాదులకు లేదు...  
క్రిమి కీటకాలకు  లేదు .... పర తమ బేధం  
స్వార్ధ చింతనకు తావు లేదు.... 
సంఘటితంగా కదులుతాయి  
 
పరమ విశిష్ట ప్రాణిగా పరిగణించుకుంటాడు... మనిషి.....కానీ   
స్వార్థమెప్పుడూ స్వారీ చేస్తుంది
సంకుచితత్వం సదా అంటిపెట్టుకుంటుంది
ఆశలు అత్యాశలే జీవన గమనం  
ఈర్ష్యా  ద్వేషాలే  ఇరుగు పొరుగు  .... 

దోచుకో.... దాచుకో.... 
పక్కవాణ్ణి తొక్కైనా..... 
రాజు, జమీందారు, ప్రజా నాయకుడు 
వ్యాపారి, దళారీ, పెత్తందారీ.... వ్యవస్థేదైనా 
పేరేదైనా పక్కవాణ్ణి  పీల్చి పిప్పి చేయడమే ..... 

పాలనలెప్పుడు పలుకుబడున్నోడికే 
చట్టాలెప్పుడు చుట్టాలే డబ్బున్నోడికి
ప్రైవేట్ అయినా ప్రభుత్వ సంస్థయినా  
సంఘటిత రంగం అసంఘటిత రంగం  
ఇప్పటికీ సంపన్నులు 15  నుండి   20%
సగటు కన్నా తక్కువ ఆదాయవంతులు  80 నుండి  85%... 

బరువు మోసేంతవరకే ... బాంచన్  కాల్మొక్కుతా ... 
బరాబరిగ  రావాల్సిన 
పనిగంటలయినా... ఫలితమయినా ... 
పనికి విశ్రాంతయినా... ఇయ్యకపోతే 
బతుకు భారం అయినప్పుడు... 
 
ప్రపంచ కార్మికులంతా 
సంఘటితంగా పోరాడిన  రోజు  
ఏకమై పనిగంటలు ... పనికి విశ్రాంతి .... 
సాధించుకున్న పవిత్రమైన  రోజు
ప్రపంచ కార్మిక  పని చరిత్రలో ..... మే.... డే ..... 


నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

యుగ ధర్మం

అంశం - యుగ ధర్మం 
తేదీ  - 30-04-2019
శీర్షిక  - యుగాన్ని బట్టి ధర్మం 
సంఖ్య - 172 

శిశిరంలో ఆకు రాల్చి 
వసంతంలో చిగురించినట్టు 
కాల గమనంలో మారే కొలమానం 
కృత,త్రేతా,ద్వాపర మరియు కలి.... 

ప్రకృతే పరవశించి పండించె 
ప్రజావసరపు  తిను బండారాలు... 
దుర్భినికైనా కానరాని దుష్టాంతాలు 
దునుమాడుటకు దూరం జనమంతా .... 
కాదా ఇక స్వర్ణ జీవనం స్వర్గం  ..... కృతం 

ధర్మం కుంచించి మూడు పాదాలే అయినా  
పరంధాముడే  పరుశరాముడై , రాముడై 
ప్రజా పాలనలకు పరమార్ధత చేకూర్చె 
యుగాలు మారినా యువత నేర్చుకోవాల్సింది --త్రేత 

వేదాలు నాలుగయి వెలుగొందు విశ్వాన 
వేదనలు అంతర్గతంగా వేటాడి వెంబడించు 
వెన్నదొంగయిన పురుషోత్తముడే  
వెతలుడిగే గీత బోధించె మానవ కళ్యాణానికై ...ద్వాపర 

దాన ధర్మాలు ఒకవంతయి అలరించ 
దానవులై నర్తించు మానవ ముష్కరులు 
దండిగా గాండ్రించు కలుషితాలన్నింట 
దగా మోసములే కలి చిరునామాలు.... మానవా !

ఖర్మలననుసరించే...  స్వార్థం  
పరమార్థం,పురుషార్థం.....  
ధర్మాలనునుసరించే ఖర్మఫలం  
యుగాలననుసరించి ధర్మం....  

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

రేపటి కోసం

అంశం - రేపటి కోసం 
తేదీ - 29-04-2019
శీర్షిక - పిపీలికమే మేలు.... 
సంఖ్య - 171 

సమున్నతం మానవ జీవనం 
సరదాగా నానుడి  చెప్పుకోడానికి.... 

కలికాలమో  కానికాలమో కానీ 
అవసరాలు తీర్చుకుని 
హాయిగా బతకాల్సిన మనిషి 
ఆశలు పెరిగి, అత్యాశలకు మరిగి 
రాబోయే తరాలు...  కాదు కాదు తరతరాలు కూడా 
రాజరికం చేయాలనే సంకల్పముతో ... 
రాయి రప్పలను సైతం  వదలక 
రాత్రనక పగలనక, రాక్షసత్వపు ముసుగులో              
పవిత్ర  ప్రకృతిని పతనం చేస్తూ 
పచ్చదనాన్ని హరించేస్తూ                     
భూమిని బుగులు పరిచి గుళ్లబారుస్తూ 
నదులను  నాశనం చేస్తూ 
పర్యావరణాన్ని ధ్వంసం గావిస్తూ
ప్రశాంత  జీవితాలను పరిహాసం చేసుకుంటూ 
కాలం మార్చి  ఖర్మ కాల్చి    
స్వార్థం పెంచుకుని , రేపటి తరాల కోసమంటూ... 
పాకులాడుతూ.....   
తాను కూర్చున్న కొమ్మను 
తానే నరుక్కుంటున్న తామసుడు. 
ఉచ్చ నీచములు మరిచి,పాప భీతులు మాని 
ఉన్న తరాన్ని  ఉసురు పోసుకుంటున్న 
ఉపద్రవ వాది.... 

చిన్న చూపు చూడమనుకుంటే....  
సహనానికి,సంఘటితానికి,ముందు చూపుకు,
స్వార్థరహితానికి,సాధక బాధకాలకు,  
శ్రమ సౌందర్యానికి,పర్యావరణ హితానికి 
పిపీలికం హద్దు ఎంతో ముద్దు..