Friday, July 26, 2024

బంధాలన్నీ బంధనాలయితే తేది : 11-06-2024 శీర్షిక : ఆత్మీయతలో ముంచుదాం ...

 బంధాలన్నీ బంధనాలయితే 

తేది : 11-06-2024
శీర్షిక :  ఆత్మీయతలో ముంచుదాం ... 
సహస్రాధికం 

వస్తుంటే పోతూంటేనే 
బంధం బంధుత్వం ... అన్న 
అనుభవ వాక్యాలను మరిచిపోయి 
పలకరింపులను  చిలకరించుకోవడం 
కూడా మానేస్తున్నాం ... 

మీ ఇంటికొస్తే ఏమిస్తావు 
మా ఇంటికొస్తే ఏం తెస్తావనే 
స్వార్థాల సంచిలో తలలు 
దూర్చి ....ఆశయం మరిచి ... 
ఆర్దశాస్త్ర సూత్రంలా చీకటి 
గదిలో లేని నల్ల పిల్లికై 
ఆశగా వెదుకుతున్నాం….

ఆర్థిక బంధాలుగా మార్చుకుని 
కృత్రిమత్వం పూసుకుని 
బలవంతపు నవ్వులతో 
భక్తి ప్రదర్శనలయితే ఎలా ? 

ఉరుకులు పరుగులలో 
మాట కరువై మమత బరువై 
బంధాలన్నీ కొట్టుకుపోతూ 
ఆర్థిక బంధనాలుగా
మాత్రమే  మిగిలితే ఎలా ? 

పంతం పట్టిన పత్యపు 
భోజనంలా బంధాలన్నీ ... 
రుచి పచి లేని వంటకం 
మాటలతో  వడ్డిస్తే ఎలా ? 

సాంకేతికత చంకలో దూరిపోయి  
మనసుల నిండా కలుషితాలు 
నింపుకుని కాలుష్యపు 
ప్రకృతిలో కాట కలిసి 
మనం తల్లడిల్లుతున్నాం ... 

కార్చిచ్చులా  వ్యాపించి 
ఆసాంతం కమ్మేయకముందే 
ఆత్మీయతల అమృతంలో ముంచి 
అనురాగ పరిమళాలను 
చిలకరించడం మానవాళిలోనే  
మిన్నని రూఢీ పరచండి ... 

అప్పుడప్పుడు పలకరించండి 
ఎప్పుడోసారి కలవండి .... 
విలువైన కాలం వెచ్చిస్తూ  
కబుర్ల పూలు పూయిస్తూ  ...  
బంధాలన్నీ బంధనాలు 
మాత్రమే కావని రుజువు చేద్దాం .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment