Sunday, July 14, 2024

అలలపై కలల తీగ తేది : 31-07-23 శీర్షిక : పొదరిల్లు

 అలలపై కలల తీగ 

తేది : 31-07-23
శీర్షిక : పొదరిల్లు 

జీవరాశిలో మానవాళికే వైవిధ్యం
వెలుగులు విరజిమ్మే వేణువుగా
రక్షణలందించే ధర్మచక్రముగా
మానవమేధనేది సర్వమోదం…. 
కదిలి మెదిలే ప్రతి ఆలోచనల 
మనో కడలి తరంగం ప్రగతే గమ్యం… 

ప్రశాంత మానస సరోవరంలో 
పడిలేచే ఊహల కెరటాలెన్నో…ఎన్నెన్నో…
ఆకారందాల్చి అపురూపమయ్యే
ఆలోచనలెన్నో…రెక్కలొచ్చి రెపరెప లాడేవెన్నో….
ఆశల ఊపిరికి అంకురమయ్యేవి ఎన్నో…. 

ఉరుకుల పరుగుల జీవితపు
కాలప్రవాహంలో ఉనికి కోల్పోయేవెన్నో… 
కార్యరూపం తాల్చలేక కాటగలిసేవెన్నో… 
నిరాశా నిస్పృహల నిశీధిలో చిక్కుకునేవెన్నో… 

అయినా అధైర్యపడక  ఆత్మస్థైర్యం 
ఆలంబనగా చేసుకుని…నిశీధి చుక్కాని 
మిణుగురులా ప్రకాశిస్తూ …అకుంఠిత 
దీక్ష దక్షతలను హత్తుకుని అడుగులేస్తూ…
అపూర్వమైన ఆలోచనా తరంగాలను 
తడుతూ ఆశయ గమ్యాలను చేరుకోవచ్చు… 

మనిషి జీవితంలో కలల ఆలోచనలు కూడా 
అలలలాంటివే..కలల తీగను మెల్లగా కదిలిస్తూ 
ఒకటొకటిగా సున్నితంగా ఏరుకుంటూ
ఒద్దికగా కూరుస్తూ పేరుస్తూ….
పొదరిళ్లులా పొందించి నిలుపుకోవడమే 
జీవన సత్యం ...

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment