Sunday, July 14, 2024

రెప్ప వాల్చని పహారా తేది : 26-07-23 శీర్షిక : మంచు కొండల్లో మందారాలే….

 రెప్ప వాల్చని పహారా 

తేది : 26-07-23
శీర్షిక : మంచు కొండల్లో మందారాలే…. 
సహస్రాధికం 

అందమైన కాశ్మీరం మంచు పొరలతో
సుందరమైన లోయల ప్రకృతిరమ్యం…
దాయాదుల దమన నీతి వికృతి చేష్టలకు... 
విలవిల లాడే వింతగా అందవిహీనమై… 

నాటి పాలకుల మెతక వైఖరితో 
పక్కలో బల్లెంలా పామును పొదువుకున్న వైనం…
విడిగా దేశమిచ్చినా సుడిగాలిలా 
అప్పుడప్పుడు విరుచుకు పడుతూ 
పొరుగుబంధాలను తుంగలో తొక్కడమే వారి నైజం... 

అనుక్షణం కళ్ళల్లో వత్తులేసుకుని 
అప్రమత్తమైనా …ఎదో చిన్న కునుకులో 
రాక్షసమూకల రాకాసి చేష్టలతో 
రణగొణ ధ్వనులే రమణీయతలను 
కాలరాస్తున్నవి… 

దానికి తోడు ఇంటి దొంగల బలంతో 
ఇరకాటమే ఎప్పుడూ… మంచుకొండల్లో
మందారాలవలె రెప్ప వాల్చని పహారాలతో 
నిత్యం అగ్ని హోత్రమే మాతృభూమి పరిరక్షణలో
మన సైన్యానికి… 

వేలసార్లు ప్రపంచం వెలుగు చూసింది 
ఆమోదించుకున్న  ఒప్పందాలను అటకెక్కిస్తూ
కాల్పుల విరమణలకు గాటుపెట్టే 
పిరికిపందల చర్యలతో కవ్వింపులే…. 

టెర్రరిస్టుల కర్మాగారంలా పెంచిపోషిస్తూ 
టెర్రిటరీలో ఎప్పుడూ పగలను 
రాచపుండులా మాననీయని వ్రణాన్ని రాజేస్తూ 
మానవసమాధుల తోటలో విహరిస్తుంది... 

లెక్కలేనన్ని సార్లు పక్కాగా ఓడించినా 
కుక్క  తోక వంకరలా..చెడిపోయిన 
బుద్దితో చెండాలమే చెంగల్వ 
పూవని చెవిలో పెట్టుకోవడమే వారి పని ... 

కనిపెంచిన తల్లిదండులను 
కట్టుకున్న ఇల్లాలును కన్న పిల్లలను 
కలల జీవితాన్ని కణికట్టుగా వదిలేసి 
మాతృభూమి సేవలో మరకతములై
నిలిచిన మణి రత్నాలు మన సైనికులు ... 

నగునూరి రాజన్న

No comments:

Post a Comment