Thursday, July 25, 2024

ఇడ్లి తేది : 31-03-2024 శీర్షిక : పళ్లెంలో చందమామ

 ఇడ్లి

తేది : 31-03-2024
శీర్షిక :  పళ్లెంలో చందమామ 

ఆవిర్లతో ఉడికిపోయి అనారోగ్యాల 
జాడలెరుగని గడసరి అల్పాహారం... 
కల్తీలకు కాలుష్యాలకు కాలుమోపనీక 
ఆరోగ్యాలకు పెద్దపీట వేస్తుంది .... 

మల్లె పూవులాంటి తెల్లని అప్పచ్చిని 
పళ్లెంలో చందమామను దించినట్టు 
పొద్దున్నే కరిగిపోయే మంచుముక్క 
కొబ్బరి లేదా పల్లి చట్నీతో పసందే  ... 

పిల్లలకైనా పెద్దలకైనా వారానికోసారి 
వారెవ్వా అంటుంది .. కానీ వరుసగా 
పెడితే మొహం కొట్టి మోటు సరసం 
చేసి మొత్తుతుంది ఎవరికైనా ... 

పరుగుల ప్రపంచంలో సమయాభావం 
సరిహద్దులను చెరిపేసి వేడిగా వాడిగా 
ఒకేసారి డజను మందికైనా వడ్డించడానికి 
సులువైనది సుందరమైనది వీలైనది..

రకరకాల పప్పులతో కలిపి రంగు 
ఇడ్లీలకు కూడా రోజులొచ్చాయి... 
రాగులతో రోగాలకు చెక్ పెడుతూ ... 
మిల్లెట్స్ తో బులెట్ లా దూసుకొచ్చింది 
ఆరోగ్యాల హారతిలో ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment