Thursday, July 25, 2024

చిత్రకవిత 01-04-2024 ఎవరి తాలూకో….? ( పాత బంగాళా )

 చిత్రకవిత 

01-04-2024          
ఎవరి తాలూకో….? 

నాగరికత పుస్తకంలో తనకంటూ 
ఓ పేజీగా నిలుపుకున్న ఈ కట్టడం... 
కరుణ రసం ఒలికించిందో..కారుణ్యాలకు
మూలమయ్యిందో కాలమే చెప్పాలి ... 

ఎంతమంది శ్రామికుల రుధిరం కరిగించి
స్వేదం చిమ్మితే ముద్ద ముద్దగా పేర్చుకుని 
సోకులు అద్దుకుని సోయగాలు పోతూ
బడాయి తనంతో దర్పంగా నిలబడిందో ... 

ఎన్ని తరాల తండ్లాటలను గమనించి 
డస్సిపోయిందో... వడి తగ్గి వాడి తగ్గి 
వయసు మీదపడి శరీరం ముడుతల్లా 
పెచ్చు రాలి పుచ్చు పట్టిందో ... 

వెటకారాల మాటలతో వెక్కిరింపుల 
 వెకిలి చేష్టలకు మూలమయ్యిందో ...
వెట్టిచాకిరీలకు నిలయమయ్యిందో 
 వెతలకు దారిచూపిందో ...వెలుగు 
బాటయ్యిందో… పేజి తిప్పి చూడాల్సిందే… 

పైన ప్రాపకాలు పొంది పటాటోపంతో
కింద పూనకాలు పూని రాజ్యమేలిన 
 రాక్షసులో... కరుణ సుధలను పంచిన
మమతల సమతా మానవతా మూర్తులో ... 
ఎవరి తాలూకో…? ..ఎరుకపరుచుమా… ! 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment