మధుర గేయాలు
తేది : 30-03-2024
శీర్షిక : ముద్దుల కన్నయ్య
విరి సుందరమే నీ రూపం
యశోదమ్మ ముద్దు బిడ్డగా
నందునింట ఉదయించి ...
మురిపాల కన్నయ్యగా
సరదాలు తీర్చినావు ....
చిలిపి చేష్టల సింగారాలు
చిన్ని మాటల బంగారాలు
రేపల్లె తావుల లోన
గోపాలుడవై నిలిచావు ...
మధుర మధురమే నీ నామం
విరి సుందరమే నీ రూపం
పాలుత్రాగే ప్రాయమునుండే
పాలనలకు నడుం బిగించి…
పాపాత్ముల దునుమాడి
పాహి మురారివి అయినావు ....
నమ్ముకున్న వారందరిని
సదా కనిపెడుతూనే
అడుగడుగున ఆపదలను
ఉపాయంగ నివారించావు .
మధుర మధురమే నీ నామం
విరి సుందరమే నీ రూపం
నవనీత చోరుడివైనా
మురిపాల ముచ్చట్లతో
గోపెమ్మల మనసు గెలిచి
గోపాలుడవై ఏలావు ....
ఆటాపాటల నెపములతోనే
అసురులెందరినో అంతంచేసి
అమ్మకు నోట విశ్వం చూపి
ఆనవాళ్లను స్పృశించినావు ....
మధుర మధురమే నీ నామం
విరి సుందరమే నీ రూపం
యమునాతటిన విహారము
వీనుల విందగు నీ గానం ....
ఎన్ని జన్మల పుణ్యఫలమో
రాధమ్మకు నీ ప్రేమరూపం ...
సదా నిలిచిన పాండవ పక్షం
గీతబోధనల సారాంశం
విశ్వ కానుక అపురూపం ....
మధుర మధురమే నీ నామం
విరి సుందరమే నీ రూపం
నగునూరి రాజన్న
No comments:
Post a Comment