Saturday, July 13, 2024

అభ్యుదయ గేయాలు తేది : 29-07-2022 శీర్షిక : మానవత మరలిరాదా ...

 అభ్యుదయ గేయాలు 

సమూహ సంఖ్య : 41 
తేది : 29-07-2022
శీర్షిక : మానవత మరలిరాదా ... 

జీవరాశి చరితలో 
మానవాళి మిన్నరా 

స్వాతంత్య్రం సభలతో
సంబరాలు చేస్తున్నం 
వజ్రోత్సవ విజయమని
వరసగ సంవత్సరం....  

ఉన్నోడే  నాయకుడు
ఉసురులు తీస్తున్నాడు 
స్వార్థాలు మాయలేదు 
సంకుచితం వదల్లేదు ... // జీవ // 

ప్రతినిధుల సభలన్నీ 
పరాచికాల కిటకిటలే  
పనికిరాని లెక్కలెన్నో
పల్లెదాకా చేరపాయె .....

త్రివర్ణ పతాకాలూ
రెపరెపలు ఆకసాన  
తిండి తిప్పళ్లకేమో 
తెల్ల రేషన్ కార్డులు ….  // జీవ // 

లక్షలు కోట్లల్లోనే  
లగాయించి అంచనాలు 
లక్ష్యాలు చేరలేని 
అరకొరల గమ్యాలు

షెడ్యూళ్లలో రాజ్యాంగం 
సేదలు  దీరుతున్నది  
సంక్షేమాల చిరునామా
జాడలేదు బడుగులకు…  // జీవ // 

తెగబడె రౌడిమూకల
పెడరెక్కలు విరవలేదు
బాలలను భిక్షుకులుగ 
బలవంతం మానలేదు ... 

వ్యాపారం వరసమారి
అసువులనే కోరుతున్నది
వడ్డీలకు బెదిరింపులు 
గురిచూసిరి అమాత్యుల .....  // జీవ // 

నాగరికత మైలురాయి 
యాంత్రికత పెంచింది 
చేతివృత్తులు చేవచచ్చి
పల్లెతనం తెల్లబోయే….. 

విశ్వ బ్రహ్మ కొలిమిలన్ని
వింతగా మాయమయ్యె
నేతన్నల ప్రేవులతో 
పడుగు చుట్ట చుట్టింది…  // జీవ // 

స్థానిక పాలనలన్నీ 
స్తబ్దుగ నిదురిస్తుంటే
చాటుమాటు పొరుగుల
సంతజేరు సార్వభౌమత… 

చట్టమంటె కొందరికి 
కాకూడదు చుట్టములా
పట్టుబట్టి ప్రజలంతా
ఒకటేనని రూఢిపరిచు // జీవ// 

లెక్కలేని చట్టాలెన్నో
చక్కబెట్ట లేదొకటన్నా 
ఒంటరిగా మహిళనేడు 
ఓటి కుండ తీరు చూడు

అరకదున్నే రైతన్నలు
పొలిమేరల పొలికేకలు
మందులు విత్తనాల మునిగి
మద్దతుధర దక్కపాయె….  // జీవ // 

పెన్షన్ల పథకాలని
పైసలన్నీ పంచుడే
పానకాల సీసాలకు
పైకము  రాబట్టుడే… 

ఇంటోన్ని కొట్టపోతె
ఈ మీసం ఎందుకని
ఇచ్చి పుచ్చుకుంటేనే
ఇకమతుల గమ్మతి… // జీవ// 

సరిహద్దుల సైనికులకు 
సవాలక్ష సవాల్లాయె
ప్రూఫ్ లేని జాకెట్లకు 
బుల్లెట్లే  ప్రీతిపాత్రం…. 

సాంకేతికత సంబరాలు 
జ్ఞానులుదాటే సంద్రాలు
విదేశాల బతుకుదెరువు
వింత ప్రాప్తం కన్నోళ్లకు ...  // జీవ // 

పాలకుడు అధికారి 
పరితపించి సేవ చేస్తే 
ఫలితమింక సులువేగా 
ప్రజలవైపు పాలనతో ... 

ఆత్మీయతలల్లుకుంటే 
అనురాగం పెల్లుబుకితే 
మానవత మరలిరాదా 
మనుషులంతా కలిసిపోరా  .... // జీవ // 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment