ఆంక్షలు లేని కాంక్షలు
తేది: 29-04-24
శీర్షిక : సద్ది ముల్లె తిన్న కుక్కలా…
మనిషి ఆశాజీవి కానీ ఆశయజీవిగా
కూడా పాత్ర పోషించాలి.. వివేక
విచక్షణల తక్కెడలో మొగ్గకుండా
చూసుకోవాలి జీవరాశి క్షేమం కోసం ...
ప్రకృతి నియమాలు పాటిస్తూనే
పయనించడము నేర్చుకోవాలి...
లేదంటే తాడెక్కేవాడికి తలదన్నేవాడొకడు
ఉంటాడనే స్పృహనైనా ఉండాలి ...
సవాలక్ష ఆంక్షలున్నా స్వార్థం ముందట
సంక నాకి పోతున్నది వ్యవహారం ...
ఆంక్షలే లేకుంటే అంధత్వమే ఆశ్రయించాలి
చూడలేక భీభత్సాల భీష్మ పర్వాలను ..
ఆంక్షలు లేకున్నా ప్రకృతి పశుపక్ష్యాదులు
పరిధిలో భ్రమిస్తాయి..విజ్ఞాన వంతున్నని
విర్రవీగే మనిషేమో ఆంక్షలకు మినహాయింపులు
విధించుకోనైనా.. విధ్వంసం సృష్టించయినా ...
వీరంగం చేసయినా ... వింత పశుత్వం
సంతరించుకుంటున్నాడు...సర్వం దోస్తున్నారు
బుద్ది కుశలతల పెద్దమనిషి కమ్మంటే..
సద్ది ముల్లె తిన్న కుక్కలా బుద్ది మారి
ప్రకృతిమాతను పరిమార్చడంలో
పడతులను
చెరబట్టడంలో.. అగ్రగామిగా
తయారయ్యాడు...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment