Sunday, July 14, 2024

మా ఊరి మహా కావ్యం. తేది : 27-03-2023 శీర్షిక : ప్రబంధం..

 మా ఊరి మహా కావ్యం.  

తేది : 27-03-2023 
శీర్షిక : ప్రబంధం.. 
సంఖ్య: సహస్రాధికం 

పుట్టినూరు పుణ్యస్థలము...   
పుణికి పుచ్చుకునే ఆత్మీయ రంగస్థలం.. 
రంగు రంగుల నెమలీకలతో 
పట్టు వస్త్రాల పొట్లంలో 
చుట్టిపెట్టుకున్న ప్రబంధ కావ్యం ....  
  
ముల్లె విప్పుకున్నా కొద్ది మురిపింతలే 
ఒక్కొక్క యాది ఒడువని ముచ్చటై…. 
తోడుకున్నా కొద్దీ వాడుకునే కమ్మని
సెలయేటి వాగుల చెలిమల నీరులా …

మననంతోనే మైమరిపించు తనువు 
మనసంతా గెంతుతుంది  మైగప్పి… 
పురి విప్పి నాట్యమాడు...  ఎద   
చిరుజల్లులలో మయూరమోలే ..

పచ్చంచు పైట చుట్టుకున్న 
పంటపొలాలు...పడుచు ముత్తైదువలా 
పాలకంకుల చీరలలో మెరిసిపోతూ 
పబ్బతి పట్టి నిలిచి పిలిచే ఆప్యాయతలు .... 

వెన్నమీగడల  బంధుత్వాలతో 
బాధలను మరిపించే బలవర్ధకాలు..
అరమరికలెరుగని అనుబంధాలతో
అనవరతమై అల్లుకునే ఆపన్న హస్తాలు… 

ఇచ్చి పుచ్చుకోవడాల ఇలవర్షలతో
కపటమెరుగని కలుపుగోలుతనాలు …
ఒకరికొకరు తోడూనీడలయి నిలుస్తూ
ఒంటరిని కాదనే రుజువుల చిరునామాలు…

కోటికాంతులతో వెలిగే  కొత్త పండుగ 
ఉగాదికి.... ఊరు చావడి జనసంద్రమే 
మతలబంతా మనసుకెక్కకపోయినా 
మనసుపెట్టి విందురు పంచాంగ శ్రవణం .... 

ఊరు ఊరంతా అంగరంగ వైభవమే ... 
రంగుల హరివిల్లె ...
వైశాఖ పౌర్ణమి రోజున రథ యాత్రతో .... 
కనులపంటై కనువిందు చేస్తూ... 
సౌమిత్రి సీతమ్మ సహా హనుమత్  సేవిత 
అయోధ్యరామయ్య అపూర్వ జాతర .... .  

నమ్మకాల తోటలో నడిచొచ్చే జనం .... 
ఊరంతా పండగై ఉవ్వెత్తున శోభిల్లు ...
గ్రామదేవతలను ఘనమై  కొలువంగ... 
పశువులను గావుపట్టి పవిత్రంగ మొక్కుతూ ...  
పిల్ల జల్లా ఊరంతా సల్లగుండాలని కోరుకుంటూ ....   

ఎవుసమే ఎల్లరి జీవనవిధానమని 
పశువులను అలంకరించి పండగ 
చేసుకుందురు పనిగట్టుకుని కనుమకు
ఉత్తరాయణ పర్వమందు ఊరంతా సంక్రాంతికి… 

పరమత సహనం పరమానందభరితం…
పాలుపంచుకునేవారు పవిత్ర ఆచారాలలోనా ..
పదికుటుంబాలైనా ....రంజాన్ మొహర్రం... 
పీరీల పండగకు  అస్సోయ్ దూలా అంటూ ... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment