Saturday, July 13, 2024

అయినా ... మనిషి మారలేదు తేది 26-12-23 శీర్షిక : దేవుడు కాలేకపోతున్నాడు…

 అయినా ... మనిషి మారలేదు 

తేది 26-12-23
శీర్షిక : దేవుడు కాలేకపోతున్నాడు… 

దేవాలయం లాంటి తల్లి 
గర్భంలోనుండి వస్తాడు…
దానవాంశ మూట గట్టుకుని 
ఆడపడుచుల చెరబడతాడు ... 

రాతి గుహల్లో తలదాచుకున్నోడు 
రంగుల భవనాలలోకి మారాడు.. 
ప్రకృతి ధర్మాలలో పుట్టి పెరిగినా
వికృతినే సదా నమ్ముకున్నాడు ... 

పరులసేవే పరమార్థమన్న 
తరువు మాట పెడచెవిననే ...
ఏపూటకాపూట కడుపు నింపుకునే
పశుపక్ష్యాదుల బాటను కాలదన్నాడు ... 

పారిశ్రామికీకతలతో కాలుష్యాల 
పంటలు పండిస్తూ స్వార్థ చింతనల 
కల్తీలను పెంచిపోషిస్తూ.. కూర్చున్న 
కొమ్మ నరుక్కుంటున్న మూర్ఖశిఖామణి ... 

కాలం రెక్కలతో చెట్టాపట్టాలేసుకుని 
కలివిడిగా కదులుతున్నా కలుపుగోలు
తనాలను మరిచి కకావికలమై 
ఏకాకితనాన్ని సంతరించుకుంటున్నాడు ...

గ్రహమండలాలు దాటినా గ్రహపాటును 
వదలనంటున్నాడు… రాక్షసులను సంహరించి
దేవతలను పూజించే మనసున్న మనిషి
మాత్రం దేవుడు కాలేకపోతున్నాడు… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment