పట్నం మింగిన సరదాలు
తేది 02-01-24
శీర్షిక : ఒకటా… రెండా…
ఉదయాత్పూర్వపు మేల్కొలుపుల
కూనిరాగముల కుక్కుటముల
కూతలు.. వీనులకు విందయ్యే
శుకపికముల కువకువల రాగములు…
ఆత్మీయత నిర్వచనాల ఆవులేగల
అంబరావములు ...
నిర్మలత్వాలొలకబోసే బోసినవ్వులు
అచ్చమైన పొరుగు బంధుత్వాలు
స్వచ్ఛమైన తాగునీటి జలసిరులు
ఇచ్ఛమైన పల్లెల్లోని పిలుపులు
వచ్చిపోయే బంధుబలగాలు …
కమ్మని మధురమైన పాలధారలు
ఝుమ్మని ఎగిరే తుమ్మెద నాదాలు
మ్యావ్ మ్యావ్ మంటూ ఇల్లంతా
కలియదిరిగే మార్జాల మతలబులు…
నమ్మకానికే అమ్మలాంటి శునకం…
కనులకింపయ్యే పచ్చిక మైదానాలు
కడుపుకింత బువ్వపెట్టే పంటపొలాలు
తొలకరికి పలకరించే మట్టి వాసనలు..
ఒంటి స్థంభం మిద్దెలొచ్చి అటకెక్కిన
విద్యార్థుల ఆటస్థలాలు…పాలబువ్వల వయసులో
పరిమళించాల్సిన పసిడినవ్వులు… దుమ్ము
ధూలిలోదూసరమయ్యే ఆటపాటల ఆనందాలు…
పొరుగుల కష్టాలను పొదువుకోవడం
ఆపదలలో ముందుండి ఆదుకోవడం
ఆనందాలను అక్కున చేర్చుకోవడం
నేనున్నానని భరోసాల భుజం తట్టడం...
ఒకటా రెండా పిండి పిప్పిచేసినట్టు
వండి వార్చిన దాఖలాలు వందలు వేలు..
విలువల వలువలూడ్చిన
వందిమాగదులు తతంగాదులు..
పడమటింటి పాపపు కన్ను
పొడసూపగానే మాడి మసైపోయిన
పచ్చని సంసారాలు.. నిప్పుల పాలై
పోతున్న కుప్పలు కుప్పల పవిత్ర బంధాలు..
పారిశ్రామికీకతలకు పచ్చ తివాచీ
పరిచిన
పాలనలతో.. పశుసంపదలు మాయమై..
కల్తీలను కలుషితాలను
కౌగిలించుకున్నాక..
రాజుకుంటున్న పశులక్షణాలతో మనిషే
మాయమవుతున్నాడు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment