Saturday, July 13, 2024

ఆన్‌లైన్‌ స్నేహాలు. తేది: 26-10-2023 శీర్షిక : పారాహుషార్…

 ఆన్‌లైన్‌ స్నేహాలు.  

తేది: 26-10-2023
శీర్షిక :  పారాహుషార్… 

అపరిచిత మాటల మూటలు తేనెల ఊటలై 
పలకరింపులు వీణలు మీటుతుంటే … 
సంతోషాలతో ఉల్లము జల్లనగానే సంగతులన్నీ 
సగంలోనే ఆవిరై పోతున్నాయి... 

మననంతోనే మంత్రముగ్దత ఆవరిస్తుంది... 
అత్యాశలు మదినంతా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే.. 
మనసు మాట వినని మల్లన్నయి 
మొరాయిస్తుంది..  ససేమిరా అంటూ సాగనియ్యదు...

సాంకేతికత సౌరభాలు పరిమళాలను వెదజల్లుతుంటే 
సర్వ విశ్వం యువతకు అరచేతిలో ఇమిడిపోగానే
ఫేస్ బుకులో తొంగిచూసి ఇన్స్టాలో  ఇష్టాలను
పంచుకుంటూ…ట్విట్టర్ పిట్టలను పలకరిస్తుంటే…

ఫాస్టు ఫాస్టుగా సోపతులను కలుపుకుని 
ప్రపంచీకరణ ఫలితాలను పొదువుకుంటున్న …
నేపథ్యంలో నాణేనికిరువైపులలా… మంచి 
మాత్రమే కాకుండా మించిన చెడులు కూడా 
తోడై అప్పుడప్పుడు తోడేళ్ళను తలపిస్తున్నాయి… 

నట్టింట్లో నెట్టు సంసారం చేస్తుంటే 
అప్పుడప్పుడు ధర్మం దారితప్పి 
న్యాయం కళ్ళకు గంతలు కట్టుకుని 
అవినీతి పలుకులు నీతులు వల్లిస్తున్నాయి ....

తాత్కాలిక ఆనందాలు తమకమై మునకలేసి 
మునిమాపు లేసి చూసుకుంటే కొంప కొల్లేరయ్యే…
ముంతలో ముల్లె మాయం..బంగారు బాల్యాల 
కంగారు..బలమనుకున్న యువత నిర్వీర్యం..
సుమలతల సుకుమార సుందరీమణులు
సంతలో సరుకై … అర్థాంతరాలై పోతున్నాయి… 

అనుభవాలన్నీ అవపోశన పట్టుకున్నాకనైనా 
అందరు జాగ్రత్తపడితే అదే ఎంతో హాయి …
మెరిసేవన్నీ మేలిమి బంగారం కాదనేది గ్రహించాలి 
అందుకే అందరు పారాహుషార్ ...

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment