Saturday, July 13, 2024

జ్ఞాపకాల తరంగాలు తేది : 16-10-2023 శీర్షిక : మధురమైన దొంతరలు.

 జ్ఞాపకాల తరంగాలు

తేది : 16-10-2023 
శీర్షిక : మధురమైన దొంతరలు. 

బుద్ది నేర్చిన కాన్నుండి అమ్మ కట్టిచ్చిన 
సద్దిముల్లె తిని పెరిగిన తనువులా… 
నిత్యం మస్తిష్కం నిండా పొంగిపొర్లే
మధురమైన మతులబులన్ని తేనె గూళ్ళలా
వచ్చి చేరుతూనే ఉన్నాయి…. 

అప్పుడప్పుడు కొసరేసినట్టుగా 
కొన్ని కొన్నిగా చెలిమెలో ఊరిన 
మంచినీటిలా తోడుకున్నా…తరగని 
ఊటబావిలా ఆస్తి పాస్తులే అవన్ని… 

తనువున్నంతవరకుండే తపనలలా 
మంచుకొండనుండి మొదలయిన 
సెలయేరులా.. సెలయేర్లన్ని నదులయ్యాక
ఇరువైపుల వ్యాపించి విచ్చుకునే పచ్చ పువ్వులా… 

తొలకరిని తలపింపజేసే ఆలోచనల 
తంపరలు అణువణువున వ్యాపించి 
మల్లెతీగలా అల్లుకుని పరిమళాలు 
వెదజల్లే మంచిగంధపు జ్ఞాపకాల తరంగాలే. 

మళ్ళుతున్న వయసుకు చుట్టంలా
మరుపు పలకరించి కొన్ని మనం 
మరిచిపోయినా… మరికొన్ని వెంటపడి 
తరుముతానే ఉంటాయి… గమ్యం బోధిస్తూ… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment