Wednesday, July 3, 2024

చిత్ర కవిత తేది : 26-02-2024 శీర్షిక: ఖరీదైన చుక్క

 చిత్ర కవిత 

తేది : 26-02-2024
శీర్షిక: ఖరీదైన చుక్క 

అందమైన అయస్కాంత 
సంబంధమే... నయనంలో 
తచ్చాడే నయాగారం... 
నడి సంద్రపు మది బడబాగ్నులకు  .... 

అందమైన ఆనందమైనా... 
సుడిగుండాల బాధలైనా ... 
ఎద సంద్రములో ఎసరు పెట్టుకుని 
పొయ్యిమీద పాత్రలా పొంగుతుంది .... 

కను కొలకులలో తటాకాలై 
నులి వెచ్చని ముత్యపు బిందువులై 
గుది గుచ్చిన సుమమాలలా 
జల జల రాలుతుంటాయి .... ! 

సుడిగాలిలో చిక్కిన నావలా 
బడబాలనం నిండిన గుండె 
బద్దలైన అగ్నిపర్వతంలా పారి 
సేద దీరుతుంది జాలువారి చెక్కిళ్ళపై 
నిద్దరోతుంది కమ్మని బాల్యంలా ....! 

ఏది ఏమైనా ...నిలిచిన నీరు కుళ్లిపోయి   
పారే నీరు పవిత్రమైనట్టు...  
నిలబడి నీరసించి కన్నీరు 
పెట్టుకుంటే ప్రయోజనం శూన్యం ... 

అడుగు ముందుకేయి 
చేయి చేయి కలపవోయి....  
సమస్యల మూలాలపై పోరాడవోయి 
సఫలత సాధించి చూపవోయి ...!
అదే జీవిత రహస్యం .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment