Thursday, July 25, 2024

చిత్ర కవిత తేది : 22-04-24 శీర్షిక : యాంత్రికతకు దూరం.

 చిత్ర కవిత

తేది : 22-04-24
శీర్షిక : యాంత్రికతకు దూరం. 
సహస్రాధికం 

పిట్టగూడు జీవితాలకు పిడికిట 
విశ్వం బిగించుకుని… కాళ్లకు చక్రాలు 
కట్టుకుని…కళ్ళను కొక్కేలకు తగిలించుకున్నాక 
కళాపోషణల కాంతులకు కాలం చాలని తత్వమే..

కరెంటు వెలుగుల్లో జీవితం ఆకాశ 
హర్మ్యాల్లో తేడాలేని రాత్రిపగళ్ళ తిరగలిలో 
ప్లాస్టిక్కు పరవశాలతో.. సహజత్వాలకు 
దూరంగా భారమైన బతుకులు ... 

దూరమైనకొలదీ పెరుగును అనురాగంలా 
అల్లంతదూరాన నిండుపున్నమి నీలాకాశములో 
నిగనిగలాడుతూ పోటెత్తుతున్న అలలతో
పొన్నాంబళంలో జ్యోతిలా చంద్రమ సంద్రముల సాదృశ్యం… 

ప్రకృతెలా ఉన్నా పరమపావనమే 
అందునా మల్లెల కాలం తెల్లని నురగలా 
మాఘపౌర్ణమి తైల చిత్రం మదినిఁదోచె
మంచిగంధపు పరిమళ మహత్తరమే… 

అందుకే అప్పుడప్పుడు ప్రకృతితో పరిచయం 
పెంచుకుని... అందులో మునిగి ఆనందాలు
ఏరుకుని యాంత్రికతకు దూరం జరిగితేనే 
ఆత్మీయతల అనుబంధాల సుగంధ 
పరిమళాలను ఆఘ్రాణించుకోవాలి ... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment