Wednesday, July 3, 2024

ఉషస్సు నింపిన ఉత్సాహం. తేది : 20-02-24 శీర్షిక. : ఆరోగ్య సిరిసంపదలు.

 ఉషస్సు నింపిన ఉత్సాహం. 

తేది : 20-02-24
శీర్షిక.  : ఆరోగ్య సిరిసంపదలు.  

విసుగు విరామం లేని జీవన సమరంలో 
పొద్దస్తమానం మడతపడ్డ మతలబులతో 
కుస్తీ పట్టి కుదేలయిన తనువు ముసుగేసిన 
నిశీది రాత్రుల్లో నిగ్గదీసుకుంటుంది ....

బ్రహ్మీ ముహూర్తం నుండే కుక్కుటముల 
కోలాహలంతో… శుకపికముల కువకువలతో 
గోమాతల అంబారవములతో.. హుషారుగా 
ఉరకలు వేయిస్తూ వెన్నుతట్టి నిదుర లేపుతుంది… 

తొంగిన బాలభానుని లేలేత కిరణాలతో 
తుషారములన్నీ అలకబూని జీవరాశిలో 
హుషారు నింపాలని ఆవురావురుమంటూ 
తుర్రున ఆవిరై  కనుమరుగవుతున్నాయి… 

అరవిరిసిన కనుదోయి కమలములకు 
ఇంతులంతా ఇగురంగా కళ్ళాపి వాకిళ్ళలో 
సప్తవర్ణాల సరాగాలతో ముగ్గులేసి మురిపాలు 
పోతుంటే భూపాళ సంగీతానికి ఆహ్వానము… 

సప్తవర్ణాల ఉషస్సును వంపుకుని 
సరాగాల ఉత్సాహాలు నింపుకుంటేనే
ఆరోగ్యాల సిరిసంపదలు.. అనంత
విశ్వంలో అరమరికలేని తుళ్ళింతలు… 



నగునూరి రాజన్న 

No comments:

Post a Comment