కొన్ని ఆనందాలను ఒంపుకుందాం -2
తేది : 27-02-2024
శీర్షిక : ఆనందాల హరివిల్లులు ....
సహస్రాధికం
అరమరిక లెరుగని ఆనంద బాల్యం ...
పల్లె పిలుపుల కమ్మని మాధుర్యం ...
పట్టుతేనెలనైనా చప్పున కొట్టుకొచ్చే
ప్రాణమెదురుపెట్టే బాల్య స్నేహితులు ....
నిత్యం పలకరించే పచ్చని పొలాలు
రసాయనమెరుగని రందిలేని కూరగాయలు ...
పుట్ట తేనెలాంటి మధురమైన
చెట్లమీది మధుర ఫలాలు ....
ఆత్మీయతల పలకరింపులు
అనురాగాల కుమ్మరించే తావులు ...
అడగకముందే తీరిపోయే
అవసరాలు....చేరదీసిన గురువులు ....
ఉద్యమాలతో ఊపిరాడని
కళాశాలల చదువులు తప్పితే...
నిలిచిన ప్రతి చోటా గెలుపు శిఖరమే ...
గెలిచి నిలిచిన మలుపులే అన్నీ ...
మంచి ముత్యపు మాతృ సంస్థ ...
మనసెరిగిన జీవిత తోడు ...
మాటకు కట్టుబడే సంతానం ....
సమయానుకూలమైన హోదాలు ....
నాలుగు దశాబ్దాల నందనవనం...
అడపాదడపా చిరు సమస్యలైనా
అన్నీ ఆనందాల హరివిల్లులే ....
అమృతమయమైన సంతోషాలే ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment