Thursday, July 25, 2024

కోపతాపాలు తేది 19-10-2023 శీర్షిక : ఉక్రోషాల ఉలుకు

 కోపతాపాలు

తేది 19-10-2023
శీర్షిక : ఉక్రోషాల ఉలుకు

అప్పుడప్పుడోచిపోయే బంధువుల్లా 
వచ్చిపోతే భయపడాల్సిందేమీ లేదు 
నిత్యం కలుసుకునే మిత్రుల్లా 
అంటిపెట్టుకుంటేనే అసలు సమస్య ...

ఆత్మ పరిశీలనలకు అల్లంత దూరం 
మనస్సాక్షి మాట వినటానికి మొహమాటం 
 కానీ అందరు నా మాట వినాలనే అత్యాశ 
 వినకుంటే వింతరీతిలో విపరీతధోరణి ....

వారసత్వమై వరించిన కానుకో 
అలుముకున్న ఆహారపు అలవాట్లో 
డాంబికానికి తెచ్చిపెట్టుకున్న దర్పమో 
సంయమనానికి నిర్వచనం తెలియదన్నట్టు ...

అహం పలకరిస్తుందో ఏమో 
 పైచేయి నాదే వుండాలనే తత్వమో 
 అయినదానికీ కానిదానికీ తేడాలేకుండా 
 అస్సోయి దూలా అంటూ ఊగిపోవడమే ...

చిన్నా పెద్దల ముందుకూడా చిందులేస్తూ 
గుర్తింపుకు గుత్తాధికారం తమదేనన్నట్టు.. 
ఉక్రోషాల ఉలుకును ఒంటబట్టించుకుని
పట్టుపట్టి తమ మాటలకు తగిన 
గుర్తింపు పొందడంలో తగ్గేది లేదంటారు ... 

కొన్నిసార్లు సందర్భం తెలియకపోయినా 
 సాంతంగా విషయ అవగాహనలేకపోయినా  
దూరిపోయి దుమధుమలాడి ధూందామ్ చేసేసి 
వింత ప్రవర్తనలకు విచిత్ర వారసులైపోతారు...

అందుకే అంటారు పెద్దలు 
వినడం నేర్చుకుంటే విచక్షణలు పెరిగి 
వినమ్రతల చిరునామై చిరంజీవిగా నిలిచి 
అనుబంధాల ఆధారభూతమై 
ఆత్మీయతల అడ్రస్సుగా అలరారవచ్చని...

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment