కలం గళం - భక్తి గేయాలు
తేది : 14-04-2024
శీర్షిక : రామ నామం
ఏమని తెలుపను రామనామము
ఎంతని తెలుపను రామనామము
మధుర వచనమే రామ నామము
మనసు నిండును నామ మహిమలు
సాటిలేనిది నామ గానము
సమము లేనిది రామ నామము
ఆత్మీయతలకు కట్టుబడిన
అయోనిజుని అవతారం...
అనురాగాలకు పెట్టిపుట్టిన
అన్నదమ్ముల అనుబంధం ...
ఏమని తెలుపను రామనామము
ఎంతని తెలుపను రామనామము
జనకుని మాట జవదాటకనే
కానలకేగిన కరుణామూర్తి ....
రాజభోగములు వదులుకుని
కందమూలములకే సై అన్నాడు ....
పదునాలుగేళ్ళ అరణ్యవాసం
పర్ణశాలలో పవళించాడు ....
ప్రకృతి మాతతో మమేకమయ్యి
పండు ఫలములే భుజించినాడు ....
ఏమని తెలుపను రామనామము
ఎంతని తెలుపను రామనామము
అష్టాక్షరిలో నిష్టగా ఐదవది
పంచాక్షరిలో రెండవ అక్షరం...
బీజాక్షరముల అంకురమవగా
భయభీతములు పారద్రోలేను ...
ఆది దంపతుల అవలోకనం
అదే కదా విశ్వ మార్గదర్శనం
ఐదు రెండు గుణము పదిగాను
పది పది గుణముల సహస్రం గాను...
ఏమని తెలుపను రామనామము
ఎంతని తెలుపను రామనామము
శ్రీ రామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం
రామ నామ వరాననే యంటూ ...
పొందుగ నిలిచెను గుణధామా
అనాలోచితమే అనంత పుణ్యం
ఆలోచితమైతే అవధులు లేవు...
అందుకోండిక భక్తిమార్గము
చేరుకోండిక ముక్తిమార్గము
ఏమని తెలుపను రామనామము
ఎంతని తెలుపను రామనామము
నగునూరి రాజన్న
No comments:
Post a Comment