Sunday, July 14, 2024

నా పథం... నా పయనం తేది : 14-03-2024 శీర్షిక : మారని సుదీర్ఘం ....

 నా పథం... నా పయనం 

తేది : 14-03-2024
శీర్షిక : మారని సుదీర్ఘం .... 

కలి కాలానికి వెలి వేసే పయనం ... 
నలుగురు నా వారనుకుని సాగే 
నమ్మకాల తోటలో నిలిచిన మాలిని .... 
మనసంతా మల్లె సుగంధాల పరిమళాలే ... 

సేవల విభాగంలో సేవకున్నయాను 
పేరు ఊరు తెలియక పోయినా ... 
పేరు చెప్పుకుని వచ్చిన వారికీ 
పెన్నిధిగా నిలిచి నమ్మకాన్నిచ్చాను ... 

సంస్థలోని వారయినా సరే ... పొరుగు 
సంస్థల వారయినా సరే ... ఏకంగా 
దూర ప్రాంతాల బంధు మిత్రులైనా .. 
తెలిసినా తెలియకపోయినా ... 

అవసరాలలో అక్కరకొచ్చాననే .. 
ఆదుకున్నాననే సంతృప్తి నేటికీ .... 
అనారోగ్యాలకు సంజీవనిగానైనా ... లేదా 
విద్యా కుసుమాలకు పరియోజనలోనైనా   .... 

అద్భుతమైన సేవలనందుకున్న వారు 
కూడా... పలకరించక పక్కకు తిరిగిన 
దాఖాలాలెన్నో ... తొంబై తొమ్మిది పొంది 
వందవది కుదరకపోతే...అంతా బూడిదిల 
పోసిన పన్నీరు చందమే ... 

స్వయానా లబ్ది పొంది కూడా ... చెప్పుడు 
మాటల చెవులకు చేటలు కట్టుకున్న తీరు ... 
అడ్డంగా నిలబడి చేసిన చేత సాయాలకు కూడా 
అలుసై ... పులుసు కాచుకుంటున్న సందర్భాలు ... 

కాలమేదయినా మారని నా భావం ... 
కలుపుకుని సాగడమే తెలిసిన మానసం ... 
కాదన్నా బాధపడని మనస్తత్వం ... 
అందరికి అన్ని వేళలా నచ్చాలని లేకున్నా 
ఆగని నా పథం ... నా పయనం సుదీర్ఘం ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment