Sunday, July 14, 2024

సరికొత్త సంప్రదాయం తేది 13-09-2023 శీర్షిక : వీరమాతే నా భారతం

 సరికొత్త సంప్రదాయం

తేది 13-09-2023 
శీర్షిక :  వీరమాతే నా భారతం 
సహస్రాధికం.  

వలసవాదుల గారడీలో...ఇంటిదొంగల లీలలో .... 
తప్పని పరిస్థితులలో తిప్పలెన్నో పడుతూనే 
విడిపోయి సవాలక్ష షరతులు బిగించుకున్నా ... 
సద్దు మనగని యుద్ధ హోరులోనే బ్రతికాము... 

కాల్పుల విరమణలను లెక్కపెట్టుకుంటూ 
కబోదిలా కాలం వెళ్లబుచ్చుతూ... 
ప్రతిపక్షం కదలికలకు సాకుల కళ్ళెం వేస్తూంటే ... 
సైన్యం ప్రాణాలు శూన్యములో కొట్టుమిట్టాడేవి ... 
 
నిప్పుల కుంపటిని నెత్తిన మోస్తూ 
గడ్డి మొలవదని గుడ్డిగా ధారాదత్తం చేసి 
విశ్వ దేశాల మధ్య వీటో పవరు వద్దని
పొరుగును పక్కలో బల్లెంలా తయారు చేసుకుని... 
దిక్కులు చూసే దౌర్భాగ్యం…. 
 
ఇంటింటికో రామాయణంలా 
 మనదేశానికి ఉండేదో మహర్దశ 
 అభివృద్ధి చెందుతున్నదంటూ 
 అరడజను దశాబ్దాలపాటుగా ... 
 అదే మహాగొప్పనే భ్రాంతిలో బ్రతికాము... 

లెక్కమారగానే తిక్క కుదిరినట్టు 
ఆకస్మిత దాడులతో అతలాకుతలం చేసి 
లక్షిత వర్గాలను దక్షతతో మట్టుబెట్టి  
తక్షణ రక్షణ చర్యలు చేపట్టడం... 

 రాజుల సొమ్ము రాళ్ళ పాలులా కాకుండా 
 రూకల రూపురేఖలు మార్చి రాకపోకల 
 సంధి వ్యవస్థలోని లొసుగుల లొటపెటలను 
 కట్టడి చేసి ఆర్ధిక బలోపేతానికి బాటలు వేయడం… 

మహత్తు నిండిన మానవతా వాదం నెత్తికెత్తుకుని 
చావుబతుకుల్లో టీకాల సాయమందిస్తూ 
జనాభాలో ఉన్నట్టుగానే  పెద్దన్న పాత్రను పోషిస్తూ... 
చంద్రయానంతో చరితకెక్కిన దేశ పుటలతో…
జీ ట్వంటీలో జిగేలుమన్న జిలుగు వెలుగులతో..
విశ్వదేశాల వీక్షణంలో వీరమాతే ఇపుడు నా భారతం...

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment