సందెపొద్దులకాడ
తేది : 06-09-2023
శీర్షిక : శ్రావణ సంధ్య ....
సహస్రాధికం
తొలకరితో పులకరించిన
అవనిమాత పచ్చ వస్త్రం చుట్టుకుని
నిండు ముత్తైదువలా హొయలు
పోతుంటే మానసానికెంత ఆనందమో ....
పక్షుల కిలకిలా రవములతో
పల్లె ఛాయల్లో నేటికీ సాక్ష్యమే....
ఆనంద కీర్తనం ఎత్తుకునే
భూపాలరాగం ఎంత రసరమ్యమో ...
అప్పుడే ఒళ్ళంతా చిలకరించుకుని
ఆహ్వానములనంపిస్తూ ... ఆడిపాడే
శుకపికముల కేరింతల కువకువలు
మిల మిలల మీనముల ఆనంద వర్ణములు ....
ఊహా చిత్రాలన్నీ ఉనికి పోసుకుని
భువిని ముద్దాడుతూ ప్రకాశించే
వెండి మబ్బుల కొండలపైనుండి
తొంగిచూచే బాలదినకరుని బంగారు వర్ణం ...
అలసి సొలసిన భానుడు సందెపొద్దుల
గోధూలి వేళలో చిత్రకారుని కుంచెనుండి
జాలువారిన వర్ణాలలా కాంతులను విరజిమ్ముతూ
అబ్బురంగా మబ్బులను అలంకరిస్తుంటాడు ....
శ్రావణ సంధ్యలలో ఊరేగే
చిత్ర విచిత్రాలన్నీ తలుచుకుంటేనే....
ఉల్లము జల్లని ఉప్పొంగిపోవు
ఉల్లాసాల తనువంతా ఊగిపోవు ....
No comments:
Post a Comment