Thursday, July 25, 2024

చిత్ర కవిత తేది: 12-05-2024 శీర్షిక : నిరాశల నిట్టూర్పు ....

 చిత్ర కవిత

తేది: 12-05-2024
శీర్షిక : నిరాశల నిట్టూర్పు .... 

నిరాశా నిట్టూర్పులే ఉచ్వాస నిచ్వాసలై 
ఒంటరి బెంగలతో తొంగిచూస్తున్నది…. 
మూడేళ్ళ వయసుకే మురిపాలను 
మూట కట్టేసి ముదిమి ఆలోచనలైంది…  

చరవాణి తెరలవాణి చర్నకోలయ్యింది
బంగారు బాల్యాన్ని బలి తీసుకుంటున్నది…. 
మాట ముచ్చట లేని మౌనమునులైన
తల్లిదండ్రులతో తమాయించుకోలేకపోతున్నది…. 

నాగరికత నడకలలో ఆత్మీయతలు 
ముచ్చట పెట్టుకుంటే ....పారిశ్రామికత 
పరుగులలో  అనురాగాలు కుంటుపడి 
అవిభాజ్యాలు విచ్చిన్నమైతే… 

సాంకేతికత అభివృద్ది నీడలలో  
సంధికొట్టింది సాంతం మానవతల 
పందిరి …జీవరాశిలో మిన్ననుకున్న 
మానవాళి విషమ పరీక్షల పాలయ్యింది ....  

మనిషి పక్కన ఉన్నా మనసులేని
మరబొమ్మయ్యాడు… మనసెక్కడో
మాటెవరితోనో.. ముభావాల ముక్కెరై
ఉలుకు పలుకు లేని ఉలిపికట్టయ్యాడు… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment