హాస్య గేయాలు గీతాలు.
తేది 04-05-2024
శీర్షిక : మధుర క్షణాలు….
వినవే ఓ మరదలా
కనవే నా ప్రాణమా ....
లగ్గ బలము ముంచుకొచ్చి
లగాయించి పోరినాను …
ముందరున్న సంబంధం
మురిపించగ మనసుకు…
మారుమాట చెప్పకుండా
సరేనని ఒప్పుకుంటిని …
సర్రాసుగ వినుకోక
సనుగుడేందిర మామా ఇపుడు…
వినవే ఓ మరదలా
కనవే నా ప్రాణమా ....
వీరంగం సృష్టిద్దాం
సంగీత్ పేరుజెప్పి
వింత వింత పద్ధతులు
తంతులోన జోడిద్దాం ...
ఏందిర మామా ఈ
ఎకసెక్కెపు ఆటలు
ఏమీకొచ్చే ఎందుకొచ్చే
పనికిరాని మాటలు ....
వినవే ఓ మరదలా
కనవే నా ప్రాణమా ....
ప్రేవెడ్డింగ్ షూట్లతో
వెండితెరను దాటేద్దాం
పచ్చ పచ్చ పొలాలలో
గట్లెంబడి ఉరుకుదాం ....
సనాతనం గొప్పదిరా
అయ్యోరి మంత్రాలతో ...
సంప్రదాయం పెద్దదిరా
అయినోళ్ల ఆశీర్వచనంతో ..
వినవే ఓ మరదలా
కనవే నా ప్రాణమా ....
హల్దీలకు కలర్ కోడు
మెహందీలు పెట్టుకుందాం
మంగళ స్నానాల తంతులో
ఫోటోలకు ఫోజులిద్దాం ...
మనసారా దీవెనలు
అమ్మలక్కలిస్తే చాలదా ...
మళ్లేందుకు హడావిడి
లక్షల్లో జమా ఖర్చులు ....
వినవే ఓ మరదలా
కనవే నా ప్రాణమా ....
ఆర్భాటపు అలంకరణ
మెహర్బానీ షోకులతో
డీ జే లతో ఇరగదీసి
ఇల్లుపీకి పందిరేద్దాము ....
వద్దుర ఓరయ్యో
వల్లగాని అగచాట్లు
మధురమైన క్షణాలను
గుండెల్లో దాచుకుందాం ....
వినవే ఓ మరదలా
కనవే నా ప్రాణమా ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment