Saturday, July 13, 2024

జానపద గేయాలు తేది : 02-09-2023 శీర్షిక : మానవా ఏదిరా నీ జాడ

 జానపద గేయాలు 

తేది : 02-09-2023
శీర్షిక : మానవా ఏదిరా నీ జాడ 
సహస్రాధికం. 

మానవా ఏదిరా నీ జాడ 
ఓ మనిషి ఏదిరా నీ నీడా …

ఆత్మీయత హరివిల్లంటివి
మానవత్వపు విరిజల్లంటివి…
అనురాగాల లోగిళ్ళంటివి
అనుబంధాల ప్రేమలంటివి… 

పల్లెలే కద పట్టుగొమ్మలనె 
దేశానికి ఆనాడు … 
పరుగుబెట్టి నువ్వేమో 
పట్నం జాడ బట్టితీవి 

చదువు చారెడు బల్పాలు దోశెడు 
చదువులెంబడి పడ్డ నీకు 
అచ్చరాలు  అంటపాయె
కానీ…
పట్నం సోకు కావాలాయె
  
మానవా ఏదిరా నీ జాడ 
ఓ మనిషి ఏదిరా నీ నీడా …
 
పలువిద్యలెన్ని నేర్చినా 
కులవిద్యకు సాటిరాదని 
పాటి మాటగ నాడు నేర్పే
గువ్వల చెన్నయ్య దండిగాను.. 

చేతివృత్తులు మోటంటివి 
కులవృత్తులు చేటంటివి
నడమంత్రపు సిరికాశించగ
ఉన్నది ఊడే ఉంచుకున్నది బాయె 
         
మానవా ఏదిరా నీ జాడ 
ఓ మనిషి ఏదిరా నీ నీడా …


2

అచ్చరాలంటినోనికేమో .. 

పారిశ్రీమికీకతల పేరుతో 
పరుగుపెట్టి నీరసిస్తుంటే… 
వెనుదిరిగి చూసెవరకు 
పావురాలే రాలిపోతున్నయి… 

ప్రేమాప్యాయతలే కరువయ్యి
యతల కథలు గొల్లుమంటున్నయి.. 
రెంటికి చెడిన రేవడిలా 
ఎందుకొచ్చిన తంటరా ఇది… 
        
మానవా ఏదిరా నీ జాడ  
ఓ మనిషి ఏదిరా నీ నీడా 

సాంకేతికత వెంట నువ్వు
సంబరపడి పరుగుతీస్తే 
పల్లె పట్నం  దాటించింది
ఖండాంతరం ఊరించింది… 

అమ్మనాన్నల బాగోగులు 
ఆన్లైన్లో నర్సులకు సొంపితే .. 
ఆస్తులన్ని కరగదీసినా 
కన్నప్రేమల సాటి అగునా … 
  
మానవా ఏదిరా నీ జాడ 
ఓ మనిషి ఏదిరా నీ నీడా 

చదువురాక కొంతమంది 
చదువులతో మరికొందరు 
పల్లె మరుగయి పట్నమొచ్చె 
కళ్ళముందే కుప్ప కూలిన కలల సౌధం… 

మంచిదాని మురిసెలోపల
కంచికథలను మార్చిరాసె 
మనిషి జీవన విధానాలను 
గ్లోబలైజేషన్ లిబరలైజేషన్… 
     
మానవా ఏదిరా నీ జాడ 
ఓ మనిషి ఏదిరా నీ నీడా 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment