భావ గీతాలు
తేది : 19-08-2023
శీర్షిక : జలసిరి ....
అంబుదము చిలికినది
అవనిమాత మురిసినది
జలసిరులు కరుణించి
పచ్చలను పొదిగినది .....
సమయానుకూలమై
సలిలము ఆవృతమవగా
సంద్రముల సంగ్రహించి
సందోహం చిందేయగ ....
భీష్మించిన గ్రీష్మములు
శీతలమై పరవశించె…
సంతసాలు నింపినది
జీవరాశి మోములలో....
అంబుదము చిలికినది
అవనిమాత మురిసినది ..
చెట్టు చేమ గుట్టలన్నీ
గుట్టుగా మురిసినవి ..
కొండ కోన పరుగులతో
మరకతమై మెరిసింది ....
గట్టు దాటి తటాకాలు
లోతట్టుల ప్రవహించగా .....
గొలుసుకట్టు చెరువులన్నీ
నిండుకుండ తలపించెను ....
అంబుదము చిలికినది
అవనిమాత మురిసినది....
స్వచ్ఛమైన సెలయేళ్ళు
చెవుల పిల్లి దూకుళ్లు....
సంబరాన నదులన్నీ
గంగమ్మయి పొర్లినవి .....
నిశ్చయముగ నిండెనే
నిండుకుండ బోనంలా
అచ్చెరువై ఆనకట్టలు
చూలాలును బోలినవి ....
అంబుదము చిలికినది
అవనిమాత మురిసినది....
పసిడి పంటకానతీయ
హాలికుని మోముమెరిసె ...
విశ్వమున కరువునకు
వింతగ చోటులేదంది ....
పట్టింపులు సల్లుబిగిన
పాలకులకు చింతబాపి...
ప్రజలందరి మోములోన
హర్షములను మూటగట్టే ....
అంబుదము చిలికినది
అవనిమాత మురిసినది....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment