అనంతం వైపే పయనం
తేది: 16-05-2024
శీర్షిక: జ్ఞాన మార్గం ...
విజ్ఞాన వివేకాల తపోధనుడు
జీవరాశిలో మానవాళి మిన్నగ ...
అయినా సంద్రమంత విజ్ఞానంలో
సంగ్రహించింది మాత్రం ఆవగింజంతే ...
కాలి నడకలకిపుడు కదిలే రవాణాలు
భూమిపై ... నీటిలో ... వాయువులో ...
చక్రం పనిముట్లిపుడు చుక్కల్లో
చంద్రుని వలె పయనిస్తున్నవి...
కాల యవనికలో భాగ విభాగాలు
కనుక్కుని...నిర్వాహణలో నిష్ణాత
ప్రదర్శిస్తూ.. గమనంలో వేగం పెంచి
గమ్యం చేరికలో చొరవ చూపాడు ...
ఉభయచరములా భూమిపైనా
భూమిలోపలనే కాకుండా
వాయుమండలంలోని తరంగ
దైర్ఘ్యంను అనుసంధానపరిచాడు...
వస్తు విలువల
ప్రామాణికతలను
కనుక్కుని..బార్టరు విధానంనుండి
బయటపడి..ద్రవ్యంతో ధరలను పెట్టి
దండి
వాణిజ్యంతో ధరణంతా వ్యాపించె…
అవనంతా అవపోశనలు పట్టి
గురుత్వాకర్షణ శక్తిని దాటిన
రాకెట్లను కనుక్కుని ధీమాగా
గ్రహాల వైపు పయనిస్తున్నాడు ...
స్వార్థం స్వారీతో అక్కడక్కడా .... పక్కవారి
ప్రశాంతతలో కూడా దూరి పోయి
కల్లోలాలు సృష్టిస్తూ కరడు గట్టాడు...
కల్తీలకు కాపలా కాస్తూ కాలుష్యాలు పెంచి
పోషిస్తూ కట్టడి చేయలేక
కబోదిలా కాలం వెళ్లదీస్తున్నారు ....
జోడెద్దుల్లా విజ్ఞానాలను స్వార్ధాలను
ఒకే ఒరలో రెండు కత్తులను ఇమడ్చలేరు ...
అయినా మిడిమిడి విజ్ఞానాల నడకలా
ఆధిపత్యం కొరకు ఆరాటాల పోరాటం ....
స్వార్థాలను చంక దించితే
స్పర్శించవచ్చు చమత్కారాలను...
బంధుప్రీతి విస్మరిస్తే ఇక
అభేద్యమైన అగణిత గుణధామం....
జ్ఞాన మార్గం…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment