మాతృత్వం
శీర్షిక : అమ్మ గేయం
13-11-2022
అమ్మెంత గొప్పదో
అమ్మెంత మంచిదో…
మధురమైన తేనియలా
మమతల పొదరిల్లులా….
ప్రాణమైన పోసుకోని
పసిగుడ్డును పదిలపరుచ…
పరుస్తుంది కడుపులోనే
కడుమెత్తని పొత్తిళ్ళను ....
గట్టిగ లేచి కూర్చుండ
పట్టు దొరకక పోయినా …
పొట్టచూసి మురుసుకుని
పుట్టెడు దీవెనలిస్తుంది...
అమ్మెంత గొప్పదో
అమ్మెంత మంచిదో …
అడుగు తీసి అడుగేయ
ఎగుడు దిగుడు దారంతా
పదిలంగా పసికట్టు ప్రమాదం
అల్లంత దూరాన అలవోకగా…
కాళ్ళు చేతులాడిస్తే
కడుపునిండ తినలేక …
వేవిళ్ళతో సతమతమై
వేయి కళ్ళ ఎదురుచూపులు ...
అమ్మెంత గొప్పదో
అమ్మెంత మంచిదో…
ప్రపంచాన పరిచయించ
పృథ్విపైన పదిలపరచ…
పక్కను కూడ దొర్లించలేక
నిక్కబొడుచు రోమాలు...
సాధారణ నొప్పులతో నువు
ఒప్పుల కుప్పనుకుంటే….
నరకమే అమ్మకింక
ఏబదంతల నొప్పులతో…
అమ్మెంత గొప్పదో
అమ్మెంత మంచిదో….
అడ్డంగా పొట్టచీల్చి
ఆపరేషన్ కు అనుమతిస్తే…
అవుతావు నువు జననం
అమ్మకవును పున్నామ నరకం ….
రుధిరం స్తన్యంచేసి
మధురంగా నింపుతుంది ...
రోజుల పాపాయిని తాను
రాజులాగా పెంచుతుంది....
అమ్మెంత గొప్పదో
అమ్మెంత మంచిదో…
పసితనాన పాలుతాగి
ఆకతాయిగా జుట్టుపీకితే…
పట్టు తాను విడిపించి
గుండెలకు హత్తుకుంటుంది ...
బాలారిష్టాల బాధలతో
చిన్నపాటి నలతలకే ….
చిగురుటాకులా వణికిపోవు
చింతలతో అంగలార్చు ...
అమ్మెంత గొప్పదో
అమ్మెంత మంచిదో….
చిన్ని చిన్ని మాటలను
చిద్విలాసమై బోధించు
బుడిబుడి అడుగులను
బుద్ది మాటగ నేర్పించును…
చంటితనం తుంటరిగా
ఒకటి రెండు చేసినా
ఒడిలోనా ఒంటిపైనా
భూజాతల ఓర్పులే ....
అమ్మెంత గొప్పదో
అమ్మెంత మంచిదో….
చందమామ చూపించి
గోరుముద్ద తినిపించు ...
జోలపాట వినిపించి
బుజ్జి నిద్ర నందించు...
జ్ఞానమెరుగని జీవితాన
జీవగడియారంగ మారిపోయి…
గడియకొక్కసారిగా
జవజీవాలకు మెతుకౌతుంది ..
అమ్మెంత గొప్పదో
అమ్మెంత మంచిదో….
యుక్తవసు వచ్చువరకు
బతుకుబండి నడుచువరకు …
ప్రయోజకులను చేసాక
పరవశమై మురిసిపోవు ....
పదిలంగా కడుపుకట్టి
పదిమందిని సాకును…
పస్తులుండైనా తాను
పరవశించి మురియును….
అమ్మెంత గొప్పదో
అమ్మెంత మంచిదో…
ఆయువుతో పాటుగా
ఆస్తులు అంతస్తులు …
ఆత్మీయత అనురాగం
అన్నీ తాను పంచి ఇచ్చు…
అవసానంలో మనమంత
సూటిపోటి మాటలన్నా…
చూసి చూడనట్టుండు
మాట బైటపడనీయక….
అమ్మెంత గొప్పదో
అమ్మెంత మంచిదో ….
మధురమైన తేనియలా
మమతల పొదరిల్లులా
నగునూరి రాజన్న
కరినగరము (రిచ్మండ్)
No comments:
Post a Comment