10.10.23 తెలుగు భాషా గేయం
కవచ కుండలం (శీర్షిక )
తెలుగు వచన మండలమే-
వెలుగు పాల పుంత లోయి
తెలుగు కవచ కుండలమే -
చెలగు స్నేహ హస్త మోయి
ఉడుకు మిరప బజ్జీల్లా
నుడికారం ఉన్న భాష
కొడుకులున్న తల్లుల్లా
గడుసుదనం గలుగు భాష
ముత్యమంటి మెరుపులున్న
ముచ్చటైన మేటి భాష
సత్యమంటి ఓంకారము
సదా శుభము చాటు భాష
తెలుగు వచన మండలమే-
వెలుగు పాల పుంత లోయి
తెలుగు కవచ కుండలమే -
చెలగు స్నేహ హస్త మోయి
పూత రేకు పొరలలా
పోతపోసినట్టి తీపి భాష
పోతనార్యు భాగవతపు
చేతనతో పూత భాష
కల్పములా కలకాలము
కలలు తీర్చు భవ్య భాష
శిల్పములలో అజంతా ,
శీర్షములలో తలకట్టుతో
తెలుగు వచన మండలమే-
వెలుగు పాల పుంత లోయి
తెలుగు కవచ కుండలమే -
చెలగు స్నేహ హస్త మోయి
నల్లనయ్య వేణువులా
పల్లవించు ప్రేమ భాష
హల్లు,అచ్చు,ఒత్తులతో,
హాయి గూర్చు రమ్య భాష
కొమ్ము' లతో పౌరుషముగ
కొలువు దీరు రాజ భాష
అమ్ములపొది నేబదారు
ఝమ్మను శ స్త్రా స్త్ర భాష
తెలుగు వచన మండలమే-
వెలుగు పాల పుంత లోయి
తెలుగు కవచ కుండలమే -
చెలగు స్నేహ హస్త మోయి
జాతీయాలతో జాతిని
జాగృతమ్ము జేయు భాష
ప్రీతిగొలుపు పద్య గద్య
రీతులున్న జీవ భాష
అమ్మ ఒడిన బోధనతో
హారతిగొను పూజ్య భాష
కమ్మనైన గేయ కైత
కొమ్మ చాటు చిలక భాష
తెలుగు వచన మండలమే-
వెలుగు పాల పుంత లోయి
తెలుగు కవచ కుండలమే -
చెలగు స్నేహ హస్త మోయి
డా .రమణ యశస్వి
గుంటూరు 9848078807
No comments:
Post a Comment