మూగబోయిన వీధులు
తేది : 29-11-23
శీర్షిక : బోసిపోయిన వాడలు
దద్దరిల్లిన రణగొణ ధ్వనులు కాస్త
కనికరించి మౌనవ్రతం బాటలు
పట్టినయి…తుఫాను తెప్పరిల్లిన
చందంగా ప్రశాంతతలు నెలకొన్నయి…
రంగు రంగుల జెండాలతో
రంజిల్లే ఫ్లెక్సీల హోర్డింగులతో
డీజే పాటల హోరుల జోరులతో
వాడవాడలా వాహనాల రొదలతో ….
నెల రోజులనుండి చెవుల్లో ఇల్లు కట్టుకుని
శంఖమూది…గింగిరాలై శబ్దాలతో మార్మోగిన
వీధులన్నీ నిర్మానుష్యమై
నిమ్మకు నీరెత్తినట్లుగా
నీరసాల వారసులై మిగిలాయి..
అవినీతి భరతం పడతానంటూ…
అందరు బాగుండాలి అందులో నేనుండాలంటూ
చెప్పిందే చేస్తానని.. చేసేదే
చెప్తానంటూ...
విశ్వంలోనే దేశాన్ని
అగ్రగామిగా నిలపాలని..
అహర్నిశల
ఆరాటాలతో పోరాటం చేస్తూ ..
దేశప్రజలే శ్వాసగా
పద్దెనిమిది గంటల
ప్రయాసలను ఒకరు వల్లె వేస్తుంటే…
బోరెమసొంటి దేశాన్ని బొంత సింపులు
చేయాలనుకుంటున్నోళ్ళంతా
చుక్కలు చూపించి ముక్కలు చేయాలనుకున్నోళ్ళు
చాటలో తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు
చాప కింద నీరులా చవుడు నేలను చేద్దామని…
సంక్షేమాల పేరు
చెబుతూ సవతి
ప్రేమలను ఒలకబోస్తూ... అభివృద్దిని
అటకెక్కిస్తూ నగదు ఫలహరాల పల్లెంతో
మతాల మారణహోమాలను రగుల్చుతూ కులాల
కుంపట్లను రాజేస్తూ రావణ కాష్టం
రగుల్చుతున్నారు ...మరికొంతమంది…
ఎప్పటికి బాగుపడునో
ఏరీతిగా
చక్కబడునో
ఎవరి దీవెనలు ఫలించునో
ఏ వ్రతముల ఫలితములు చేకూరునో
ఎదురుచూపుల బ్రతుకులే…ఇక
మిగిలింది ప్రజలకు…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment