బాలల గేయం
దిబ్బు దిబ్బు దిబ్బు దిబ్బు దీపావళీ
నిదురమబ్బులొదిలించు దీపావళీ
ఉదయాత్పూర్వమే తలంటు స్నానాలు
ఉత్తుంగ తరంగాల నూతన వస్త్రాలు…
ధగధగలాడే దీప కాంతులు
దద్దరిల్లె టపాసు మందులు
ఢమ్మని మోగే సుతిలి బాంబులు
ఝుమ్మని ఎగిసే చిచ్చుబుడ్లు…
బుసబుస పారే పాము బిల్లలు
చరచరలాడే కాకర పువ్వులు
వర్ణములిచ్చే వెన్నీల పుల్లలు
పొడవైన తాడు పువ్వులు…
చిటపటలాడే సీమటపాసులతో
ఎపుడెపుడంటూ పిల్లలగోలలు…
జాగ్రత్తగ చూసే పెద్దల కావలితో
జరంత ఇబ్బందే ఆనందాలకు….
కమ్మకమ్మని తీపి లడ్డూలు
కరకరలాడే వరిపిండి చెక్కలు…
చిట్టి చెళ్ళెల్ల కోరికల చేకోడీలు…
ఘుమఘుమలాడే పిండివంటలు…
కాలం చెల్లిన ధర్మం పాదాలతో
కర్రే పామై కరిచిన చందంగా
కలికాలంలో కొదువే లేదు
కఠిన పాషాణులకు ఈనాడు …
మంచితనాన్ని పెంచి పోషిస్తూ
మానవత్వాన్ని విత్తాలి…
ఆత్మీయతలను అంకురింపచేసి
అనురాగ ఫలాలను పంచాలి…
ముందో వెనకో శుభ గమనమే
చెడ్డతనంపై మంచెపుడు గెలుపే…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment