Saturday, June 22, 2024

సంక్రాంతి గేయం తేది 13-01-2024 శీర్షిక : సంబరాల సంక్రాంతి.

 సంక్రాంతి గేయం 

తేది 13-01-2024
శీర్షిక : సంబరాల సంక్రాంతి. 

సంబరాల సంక్రాంతి
రానే వచ్చింది… 
సందళ్ళను మోసుకొని 
తానే వచ్చింది… 

విశ్వమంత పర్వములే
వివిధమైన నామముల… 
సౌరమాన కొలతలలో
సంక్రమణం మకరంలో….

కాలమనే తేరులో 
కదలింది ఆయనం…
దినకరుని గమనంలో 
దివ్యమైన రాశిమార్పు… 

సంబరాల సంక్రాంతి
రానే వచ్చింది… 

సురలకు దినముగా
సుందరమే ఆధ్యాత్మికం… 
ఉచితమైన పనులకిక
ఉత్తరాయణం పుణ్యమని… 

పంటలన్ని ఇంటజేర 
పర్వములే అందరికి …
సుందరాల నందనం
ఆనందం వెల్లివిరియ…

సంబరాల సంక్రాంతి
రానే వచ్చింది… 

ముద్దబంతులు ముంగిట్లో 
ఆహ్వానం పలుకుతూ
ముదమార నవ్వినవి 
మనసుకెంతో హాయిగూర్చి… 

అతివలచే కళాత్మకం
అందమైన రంగవళ్ళులు… 
సప్తవర్ణ శోభితములే
సంబరాలు ఇనుమడించ… 

సంబరాల సంక్రాంతి
రానే వచ్చింది… 

స్వార్థాలు సమసిపోవు
సర్వం మనమనే భావం… 
ఉన్నది పంచుకోవడమే 
ఊరంతా పండగే

పాడిపంటల సమృద్దిలో
పశువుదే పెద్దన్నపాత్రయని
అలంకరణల మురిసెదరు
తనివిదీర తన్మయత్వమై… 

సంబరాల సంక్రాంతి
రానే వచ్చింది… 
సందళ్ళను మోసుకొని 
తానే వచ్చింది… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment