అంతు చిక్కని అంతరంగం
తేది : 12-10-2023
శీర్షిక : మనోరంగము.
కుసుమకోమలపు పూదోటలలో
మాటల పరిమళాలు వెదజల్లు…
ద్రవించి సెలయేటి నీరుగా మారిన
దప్పికలు తీర్చి దర్శనమగును…
ఘనీభవించి బండరాయైపోయిన
గతుకుల జీవితమై గతించును…
కొలతల కొలమానాలకు చిక్కనిది
అర్థాంగబలాలకు లొంగనిది…అయినా
లొంగిపోతున్నది…
ధవళ వస్త్రాల వారసుల దండి సైన్యం
అండదండలుఉంటాయనుకున్న
బడుగు బలహీనుల అంతరంగం
కార్పోరేట్ల కనుసన్నల్లో కరిగిపోతున్నది…
రంగుల జెండాల నీడలలో కార్యకర్తలకు
మా”రేడు” కావల్సిన నాయకుల మనసు
మమతలు కురిపిస్తుందనుకుంటే ఖద్దరు
వస్త్రాల కబందాలలో బందీ అయిపోతున్నది…
పక్కా లెక్కలతో పల్లకీలు ఎక్కుదామనుకునే
నాయకులకు అంతుపట్టని ప్రజా అంతరంగాలతో
పల్టీలు కొట్టిస్తూ గందరగోళాల గజిబిజి లతో
ప్రతీసారి కొన్ని పరేషాన్లను మిగుల్చుతున్నది….
నగునూరి రాజన్న
No comments:
Post a Comment