శ్వేత కపోతం
తేది : 09-01-24
శీర్షిక : మహోన్నతం…
పరమశాంతికి ప్రతిరూపంగా
సప్తవర్ణాల సంబంధ మూలమైన
ప్రశాంత శ్వేతవర్ణం చిహ్నంగా పొదువుకుని
విశ్వమంతా విస్తరించాలని వినీలాకాశంలో
వీక్షించే వింత పక్షి శ్వేత కపోతం…
ప్రకృతిలో పుట్టి పెరిగినా..
తరువులా తలవడు..గిరిలా నిలవడు..
పశుపక్ష్యాదులకున్న కలివిడి పట్టుమని
అబ్బని
పరమ విజ్ఞాన సంపన్నుడు ...మనిషి..
ఈర్ష్యా ద్వేషాలను విత్తుకుని ..
పగలు ప్రతీకారాలను నూరుకుని..
కక్ష్యలు కార్పణ్యాలను నెత్తికెత్తుకుని..
నిత్యం
పక్కవారిని పడదోయాలనే
కపట
బుద్ధుల్లో సిద్దహస్తుడై…
అదే జీవితమనే ఎడారి తీరాన
నిలిచాడు ... మనిషి
పెద్దరికాల పేరు చెబుతూ
ఉద్దరిస్తున్నాననే భ్రమల్లో ఊరేగుతూ..
ఉక్కు పాదాలతో ఎక్కి తొక్కుతూ..
రక్తపాతాల ఏర్లను పారిస్తున్నాడు…
పదిమందిలో సుద్దులు నేర్చిన
పెద్దమనిషిలా చిలుక పలుకులు…
పక్కకు జరగగనే నిక్కచ్చిగ
పక్కా స్వార్థాలను చంకనేసుకున్న
జిత్తులమారి నక్కలా ఆలోచనలు…
రుధిరం రుచికి మరిగిన మేకవన్నె పులి…
అన్న పానీయాలు కొంత…
అలవాట్లు పద్దతులు మరి కొంత…
ఆధ్యాత్మిక చింతనలు సాంతం…
మార్చగలవు మనిషిని మనిషిలా…
మహర్షిలా… మారితేనే మహోన్నతం…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment