చిత్ర కవిత
తేది : 11-12-2023
శీర్షిక : ఇంజనీరింగులో ఇగురాశాలి
చిటారు కొమ్మల్లో చిరునవ్వుల పొట్లంలా
చెట్ల చివరికొనల్లో చిత్రమైన నిర్మాణం
ఆత్రంగా ఎవరినైనా ఆకట్టుకునే
అత్యంత క్లిష్టమైన అద్భుత నిర్మాణం ...
ఇంజనీరింగులో ఇగురాశాలి
గురువు లెరుగని విద్యలో
గుంభనతలు ప్రదర్శించే
గమ్మత్తుల గిజిగాని ఇల్లు …
కనులు తెరవకముందే
కల్లాకపటమెరుగని పసి పిల్లల
కలలు కనే … కళ్ళు చెదిరే…
శత్రుదుర్భేధ్యమైన రక్షణల పొదరిల్లు…
కజ్జి కాయల్లాంటి బుజ్జి పాపాయిల
కువకువలతో.. ఆదరణ కలిగిన
అమ్మానాన్నల ప్రేమల అంకురంలా
ప్రకృతిలోన పురివిప్పుకున్న పరిమళం ..
భాష తెలియక పోయినా
భావ కవిత్వం నింపుకున్న
రాగయుక్త సంగీతం నింపుకుని
మది మదిలో ఎదలు నిండే
మధురగాన కువకువల సదనం..
మడమ తిప్పని మన ఎన్నికల
కమీషనర్ శేషన్ గారికి సైతం
మచ్చిక గాని బాల పశులకాపరితో
జ్ఞానోదయం కలిగించిన పిచ్చుకగూడు…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment