ప్రజాస్వామ్యం
తేది 30-11-2023
శీర్షిక : పేరు మారిన పెన్నిధి
ప్రపంచాన అతి పెద్దదని
ఆర్భాటాల పర్వములేగాని..
ఆదిలోనే వంకర తిరిగి
అంకురమైన మొలకనే కదా!
అలా మర్రి మాను నీడలో
ఊడలైతే వేసింది గాని
పరాయి మొక్కను ఎదగనీయక
ఊపిరంతా కుటుంబమైనది….
బెంగాలులోన కాలేదా బంగారం
బసుగారి ప్రజా రంజకం…
ఒరిస్సాలోన ఒరవడిగా నిలిచె
తరం మారినా తప్పని ప్రేమలతో …
ప్రజాస్వామ్య పాలనలంటే
పాయసాలు జుర్రుకోడమే కొందరికి…
నాటినుండి నేటివరకు
నడుస్తున్న చరిత్ర తీరు చూస్తే...
రాను రాను ఏదో అయినట్టు
తిట్ల పురాణాలతో విసుగెత్తినా…
వీసమంత ఉపయోగంలేని
విమల చరితలను తలపిస్తున్నవి…
తన ఉనికికి తాళమేసేసి
కులాల కుంపటిని రాజేసి
కుంటిసాకుల వర్గాలుగా రాశిపోసి
వన్నెకు రాకుండ తగిన జాగ్రత్తలు…
చాపకింద నీరులా పారుతూ
చంకలోన దూరిన కొందరు..
సవతి ప్రేమలతో తచ్చాడుతూ
తగాదాల తంపులకు ఉసికొల్పారు…
అతివలపై చూపుల వలలతో
గతి తప్పిన మతి విధానాలు…
కోటరీలలోన మంతనాలు
కొండంత కపట ప్రేమలు ...
ప్రజాక్షేమం కోరిన ఫలితాలను
పక్కనబెట్టే సంస్కృతని….
పునికిపుచ్చుకుని పుణ్యం
మూటలు కట్టుకుంటున్నారు….
ఆడలేక మద్దెల ఓడిన చందంగా
ప్రజామనసులలో దూరకుండ…
పక్కదేశాల వాకిలిలో మోకరిల్లుతూ
ప్రతిపక్షాలకు బూచీల పేచీలు….
అరె పాపమని ఆదరించి
గెలిపిస్తే... శత్రువుల జండాలు
ఎగురవేసి సెలవిచ్చిన రంగులు
ఊసరవెల్లులకే ఉలికిపాటు కలిగించె ...
మొన్నటిలా కాశ్మీరులోగాని
నిన్న జరిగిన ఢిల్లీ గల్లీ కొట్లాట గాని
మచ్చుతునకలే కద సోదరా
మారాజుల మనోభావాలకు …
పేరుమారిన పెన్నిధిలా తయారై
చెప్పుకుంటున్నాము మనకు మనమే…
నిప్పులేకుండా పొగ రానట్లుగా
నిలువున మునిగిన దాఖలాలే….
నగునూరి రాజన్న
No comments:
Post a Comment