కొత్త సంవత్సరం
తేది: 27-12-23
శీర్షిక : వివేకం…
అనుభవాల తోటలో
అడ్డంకులనధిగమిస్తూ
ఆదమరిచి నిదురించగలిగి
ఆనందాల బాట పట్టగలగడమే…
అసలైన సంతోషాలమూట…
అప్పుడే అదొక కొత్త మాట…
పడమటింటి పాపపు కన్ను వల
పక్కవాడిని సదా తొక్కాలనే నేల
అర్దరాత్రి ఆకతాయిల గోల
మత్తుమందుల కూతల కోయిల…
గ్రెగోరియన్ కాల గమనములో పేజీ మార్పు…
గ్రీకు పద్ధతిన ఏర్పరుచుకున్న కాల విభజన కూర్పు …
గ్రీన్ విచ్ రేఖ చివరన మరొక తూర్పు…
గిర్రు గిర్రున తిరిగే భూగ్రహానికి మరొక మలుపు …
ఆంగ్ల నూతన వత్సరమంటూ
అర్రులు చాచిన జనులకు
కావాలొక వింత నిండిన సంత…
కరువులో కాగిపోతున్న కళేబరాలకు
జుర్రుకోవడానికొక చీకటి రాత్రి.....
మత్తు మందుల క్రీనీడలకు యమరాత్రి..
రేవు పార్టీలకొక కాళరాత్రి…
ఆయనంలో మార్పు కానరాదు
ఋతువులో మార్పు లేదు
మేనులో ఉత్సాహాలు పొడసూపవు
పంట చేతికంది ఇంట నిండదు…
బతుకులో వెలుగులు కానరావు
కాలంలో కాకలు తీరలేదు…
పక్షులు సైతం ఆనందించవు…
కోకిలలు ఆనందంగా కూయవు…
చెట్టు పచ్చగా చిగురించదు...
గట్టు తివాచీలా విస్తరించదు…
పైగా ఆకు రాలి మోడువారుతుంది....
వసంతాగమనంతో ప్రకృతి పులకరిస్తే
నులి వెచ్చని ఉషోదయాత్పూర్వాన
ఉగాది ఉదయాన ఉత్సాహాలు నింపి
షడ్రుచుల ఆనందాలు నింపు...
శుచి శుభ్రతల చిరునామాలు
ఉమ్మడి కుటుంబాల మన ఉగాది..
ఎవరికి వారే యమునా తీరే
పాచి కేకులు, సుక్క మందులు,
జీవహింసలు…
పరుగుల్లో
మూలమలుపుల్లో
పరలోక యాత్రలు.........
అజ్ఞాన తిమిరాలను తరిమే
వికాసాల సంకేతం జ్యోతి ప్రజ్వలనం
విజ్ఞానాల విరించి ఉగాదికి....
అసలు పోలికే లేని అంట కాగే
ఆంగ్ల నూతనానికి దీపాలార్పడం
ఎలా నిర్వచించను .....
కాల గమనము లో మరో మైలు రాయి
కలి పురుషునికి ఇది ఒక వత్సరం …
నిన్నటి అనుభవాల పాఠాల నుండి
రేపటి ఫలితాలు నిర్దేశించుకోగలిగే
ఆదర్శ పథాన్ని ఆచరించగలగడంవివేకం....
వివేకమే మానవ వికాసం...
మన తెలుగు నూతన సంవత్సరం మహోన్నతం…
యుగాలనాడు గీతాచార్యుడు నుడివినదే ..
తెలియని పర ధర్మం కన్నా
తెలిసిన మనధర్మం ఎంతో మిన్నని.....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment