Sunday, June 23, 2024

కాలం యవనిక వెనుక తేది : 02-02-2024 శీర్షిక : జగన్నాటక రంగం

 కాలం యవనిక వెనుక

తేది : 02-02-2024 
శీర్షిక : జగన్నాటక రంగం 

అబ్బ! అంతా అనుకున్నట్టుగానే 
అమలు జరుగుతున్నదిని .... 
అపుడపుడు మురిసిపోతుంటాం 
ఆదమరిచి కూడా అడుగులేస్తాం....  

బాగా జరిగిన ఘట్టాలను 
బావ రక్తిగా చెప్పుకుంటూ 
బాదరబందీలను దాచేస్తూ 
వందిమాగదుల ముందర 
బాకాలు ఊదుకుంటాము ... 

ఘట్టము మారిపోగానే చట్టం 
మన చేతినుండి జారగానే ... 
చుట్టం చూపులా అన్ని సన్నివేశాలు 
పలకరించి అసలు రంగును  
ప్రజాక్షేత్రములో పదిలం చేస్తుంది. 

డెబ్బదేండ్ల చరిత్రలో దేబిరించిన 
క్షణాల వెనక జరిగిన బాగోతాలు 
అప్పుడప్పుడు అక్కడక్కడా 
చిత్ర విచిత్రాలుగా కనిపిస్తుంటే ... 
ఛీ కొట్టేవి కొన్నయితే ... ఛాతీ 
విచ్చుకున్న చామంతులు మరికొన్ని ... 

అదుపు చేసుకోలేని ఆలోచనలకు 
అణచుకోలేని భావాలకు 
రూపమిచ్చుకుని నవరసాలని ... 
సంతృప్తుల సరిగమలు .... 

నిజానికి కదిలిపోతున్న కాల యవనిక 
వెనుక జగన్నాటక రంగంలో జనులంతా 
రంగులేసుకున్న రమణీయ 
పాత్రధారులమని ఆలస్యంగా గుర్తిస్తాం .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment