అనుబంధాల వాకిళ్లు
తేది: 22-11-2023
శీర్షిక: ఆత్మగల్ల లోగిళ్ళు అనాథలు కావు.
బాల్యములో బాగాగుర్తు
చిన తాతల ఇళ్లన్నీ కలియతిరిగి
కబుర్లలో మునిగితేలి పనాయిలు ఇస్తే
తిన్న రోజులు పక్కాగా ఇంకా గుర్తున్నయి...
అల్లంత దూరం అత్తయ్యల పిల్లల పెళ్లికని
ఎడ్ల బండిపైన నాల్రోజుల పయనానికి
ఎగిలివారంగా బైలెల్లి అంబటాళ్ళకు చేరుకొని
అలుపులు తీర్చుకున్నది యాదులే…
పాలు పెరుగులు మా ఇంట పుష్కలమని
పక్కూరులో ఉండే మామయ్యల కొడుకులు
సెలవులకు మా ఇంటికి కొచ్చి పంటచేలల్లో
ఆటపాటలతో దూకింది మరువలేదింకా…!
రెండేసి గేదెలు పాలిచ్చిన రోజుల్లో
పాడి అమ్ముకోవడం పాటిగాదని నాన్నంటే
వీధిలో వారందరికి అమ్మ వరుసగా పిలిచి
పెరుగు పంచిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి…
అమ్మమ్మ ఇంటి ముందు నిలబడి వచ్చేవారితో
పోయేవారితో చిన్నా చితకా పనులు చేయిస్తుంటే
ఆనాడు బుర్రకెక్కలేదు… ఆత్మ గళ్ళ లోగిళ్ళు
ఎప్పుడూ అనాథలు కావనే విషయం…!
నగునూరి రాజన్న.
కరినగరము.
No comments:
Post a Comment