Sunday, June 23, 2024

చిత్తడి నేలలు తేది 03-02-2024 శీర్షిక : చిట్టి ఉడతలు / కాపాడాల్సిన కల్పవృక్షాలు

 చిత్తడి నేలలు  

తేది 03-02-2024
శీర్షిక : చిట్టి ఉడతలు / 
    కాపాడాల్సిన కల్పవృక్షాలు 

శ్రీరామచంద్రుని సేతువు 
నిర్మాణంలో చిట్టి ఉడుత 
చేసిన సాయంలా ... పర్యావరణ 
పరిరక్షణలో ప్రయాసపడుతుంది ... 

నదీమతల్లుల చివరలలో 
పచ్చగా వర్ధిల్లుతూ శోభలను 
పంచుతూ పర్యాటకులను 
ఆకట్టుకునే మరకత మణులు .... 

సారవంతమైన నేలలతో 
సరసమైన పచ్చదనపు వనముతో 
సంద్రపు అలల తాకిడికి దడిలా 
అడ్డుగోడై రక్షణలుఇచ్చు మడ అడవులు  .... 

వరద తుఫాను బీభత్సాలకు 
సునామీల హుంకరింపులకు 
కళ్లెం వేసి పహారా కాసే 
ప్రభు భక్తి పరాయణులు .... 

కాలానుగుణమై ప్రయాణించే 
వలసపక్షుల వన విహారాలు .... 
ఘనమైన మత్స్య సంపదలు 
విలువైన వృక్ష సంపదలు ....   

మొత్తంగా మానవాళి స్నేహితులు 
కాలకూట విషాలను హరించే 
అపర విశ్వ విశ్వేశ్వరులు ... 
నరేశ్వరుని కంటపడి నలగకుండా 
కాపాడుకోవాల్సిన కల్ప వృక్షాలు ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment