Saturday, June 15, 2024

దీపావళి గేయం. తేది- 11-11-2023 శీర్షిక - వెలిగించుము దీపాలు.

 దీపావళి గేయం.

తేది- 11-11-2023
శీర్షిక - వెలిగించుము దీపాలు. 

వెలిగించుము దీపాలు .  
విజ్ఞాన జ్యోతులుగా… 
తొలిగించుము చీకట్లను     
అజ్ఞానపు బాటలలో… 

మదులనిండా ఆనందం 
మరు మల్లెల శోభితమే… 
మురిపములే మానసమున 
ముత్యమైన కాంతిదీపం… 

 కృతములోన జన్మించెను
 అసురుడు ఆ నరకుడు …
 అసురసంధ్య వేళలలో 
 అవనిమాత వరాహులకు … 

వెలిగించుము దీపాలు .  
విజ్ఞాన జ్యోతులుగా… 

 కఠిన తపోసంపత్తుల 
 కుటిల వరముల పొంది
 కన్నుమిన్ను కానకుండా 
 కంటకుడై ప్రవర్తించే ... 

ముసురుకున్న బాధలతో 
ముల్లోకములు వణకగా ... 
మునులు గంధర్వులు 
ముందు నిలిచే శ్రీహరికి… 

వెలిగించుము దీపాలు .  
విజ్ఞాన జ్యోతులుగా… 

అమ్మచేత మరణమని
వరము కోరే నరకుడు ...
ఆకోరికనే తీర్చగా
అవతరించె హరియే కృష్ణుడిగా … 

ఘోరమైన యుద్దంలో
సన్నద్దం ప్రదర్శించి ..
సంహరించె నరకుడిని
సత్యభామ తోడునిలువ… 

వెలిగించుము దీపాలు .  
విజ్ఞాన జ్యోతులుగా… .

తగరాని గుణములతో 
తనయుడైన సహించక …
సంహరించె సదాచారం
బోధించగ పాలకులకు … 

ఇతిహాసం లోతులను 
పునీతమై పాటించిన..
అదేకదా అసలుసిసలు
ఆనందాల దీపావళి… 

వెలిగించుము దీపాలు .  
విజ్ఞాన జ్యోతులుగా… 

అవనిపైన ఇంటింటా 
ఆనందం పెల్లుబుకగా
వెలిగించిరి దీపాలను 
వరుసబెట్టి తోరణముగా… 

దీపంజ్యోతి పరబ్రహ్మం 
దీపేనా హరదే పాపం… 
దీపంజ్యోతి కలిగిన ఇంట
దాపున శ్రీలక్ష్మీ సంపదలిచ్చున్…. 

వెలిగించుము దీపాలు .  
విజ్ఞాన జ్యోతులుగా… 
తొలిగించుము చీకట్లను     
అజ్ఞానపు బాటలలో… 
 
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment