Wednesday, June 12, 2024

ప్రపంచ శాంతి తేది .21-10-23 శీర్షిక : బుద్ది ఉన్నోడే పెద్దకొడుకు.

 ప్రపంచ శాంతి 

 తేది .21-10-23 
శీర్షిక : బుద్ది ఉన్నోడే పెద్దకొడుకు.  

ప్రాణి చిన్నదో పెద్దదో అజ్ఞానో విజ్ఞానో 
మృగజాతులన్నీ వంతులవారీ తంతుగా 
ఇతర జాతులను వేటాడుతుంటే…  
విజ్ఞావంతున్నని విర్రవీగే మనిషి మాత్రం 
పశువుపాటి సూత్రం పాటించని హీనమే ... 

పొరపాటుగానో గ్రహపాటుగానో అజ్ఞానంతో  
కొన్ని జంతువులు తమ సంతానాలను తామే 
తింటుంటే...బుద్దెరిగిన మనిషి మాత్రం తన 
జాతిని తానే ఆధిపత్యాకాంక్షల మట్టుబెడుతుంటే 
మర్కట మూలాలను మరువలేదని ఋజువులాయె …   

బుద్ది ఉన్నోడే పెద్ద కొడుకంటరు..శాంతిమంత్రం 
జపించాలంటే…చదువుల తల్లికి ఓంకారంలా 
యుద్దానికి సన్నద్ధమై ఆరంభించగలగే సత్తా… 
బెత్తం పట్టుకున్న ఉపాధ్యాయునిలా అదుపుల
వ్యూహం తెలిసి…జనగణమని ముగించగలిగే 
నేర్పరితనం ఉండాలి… 

అదేంటోగాని అందివచ్చిన పెద్దరికాన్ని పొదువుకుని
అందలాలు అధిరోహిస్తున్నారు తంపులు పెట్టి… 
మందుగుండ్లు అమ్ముకుంటున్నారు మభ్యపెడుతూ… 
అంబట్ల దూడలా ఎగదోస్తూ ఆటలాడుతున్నారు
ప్రాణాల పందేరంతో…. 

మదించిన ఎనుబోతు మందమీద పడ్డట్టు… 
ప్రపంచ యుద్ధాలలో ప్రత్యక్షమో పరోక్షమో
మొద్దుబారిన పెద్దతలకాయలే నలుగురిలో
సుద్దులు చెబుతూ ఒంటరిగా మద్దతులు…. 

ఎవరి మానాన వారిని బతుకనీయక  
ఎగబడుతుంటే… ఎదురుపోతుంటే 
ప్రళయమే సమాధానమై పరిసమాప్తికి 
పట్టంగట్టి అందరి ఆనందాలు తీర్చుతుంది… 

నగునూరి రాజన్న. 

No comments:

Post a Comment